ఆర్టీసీలో వీఆర్‌ఎస్‌కు స్పందన అంతంతే

రాష్ట్ర ఆర్టీసీలో సిబ్బందిని తగ్గించుకోవాలన్న అధికారుల ఆలోచనకు చుక్కెదురు అయింది. ఖర్చులను తగ్గించుకుని నష్టాల నుంచి బయటపడాలన్న వ్యూహం ఫలించలేదు. ఆర్టీసీ ప్రతిపాదించిన స్వచ్ఛంద ఉద్యోగ విరమణ(వీఆర్‌ఎస్‌)కు

Published : 11 Aug 2022 04:32 IST

దరఖాస్తు చేసుకుంది 525 మందే

అంచనాలు తలకిందులవడంతో అధికారుల మల్లగుల్లాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఆర్టీసీలో సిబ్బందిని తగ్గించుకోవాలన్న అధికారుల ఆలోచనకు చుక్కెదురు అయింది. ఖర్చులను తగ్గించుకుని నష్టాల నుంచి బయటపడాలన్న వ్యూహం ఫలించలేదు. ఆర్టీసీ ప్రతిపాదించిన స్వచ్ఛంద ఉద్యోగ విరమణ(వీఆర్‌ఎస్‌)కు ఉద్యోగులు పెద్దగా ముందుకు రాలేదు. కొద్ది నెలల ముందు అధికారులు డిపోల వారీగా చేపట్టిన అనధికార అభిప్రాయసేకరణలో రెండు వేల మందికి పైగా ఉద్యోగులు వీఆర్‌ఎస్‌కు తమ వివరాలను నమోదు చేసుకున్నారు. ఆపై జరిగిన పాలకవర్గ సమావేశంలో వీఆర్‌ఎస్‌ అమలుకు తీర్మానం చేశారు. ఆ మేరకు జులైలో అధికారికంగా వీఆర్‌ఎస్‌ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. 20 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నవారంతా అర్హులని, జులై 31వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా స్పష్టం చేశారు. ఎలాంటి ప్యాకేజీని ఇస్తారన్నది కొంత ఆలస్యంగా ప్రకటించారు.

అయిదారు వేలు అంచనా వేస్తే..

ప్రస్తుతం ఆర్టీసీలో 46,750 మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో సింహభాగం డ్రైవర్లు, కండక్టర్లే. వీఆర్‌ఎస్‌ తీసుకునేందుకు మొగ్గు చూపే వారిలో అధిక శాతం మంది వీరే ఉంటారు. ప్రస్తుత సంవత్సరంలో 2,360 మంది పదవీవిరమణ చేయనున్నారు.  అనధికారికంగా సేకరించిన ఆసక్తి వ్యక్తీకరణ సందర్భంగానే రెండు వేల మందికిపైగా ముందుకు వచ్చారు.. అధికారికంగా వెల్లడిస్తే అయిదారు వేల మంది ముందుకు వస్తారని అధికారులు అంచనా వేశారు. అయితే కేవలం 525 మంది ఉద్యోగులే ముందుకు రావడంతో వారు కంగుతిన్నారు.

కింకర్తవ్యం...

వీఆర్‌ఎస్‌కు ఉద్యోగుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవటంతో అధికారుల మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రకటించిన ప్యాకేజీ ఆసక్తికరంగా లేదన్న అభిప్రాయం ఉద్యోగవర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఈ అంశంపై అధికారులు త్వరలో మేధోమథనం చేయాలని నిర్ణయించారు. ప్యాకేజీలో మార్పులు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందన్న అంశంపైనా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని