నిండుకుండల్లా జలాశయాలు

రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలన్నీ జలకళతో నిండుకుండలను తలపిస్తున్నాయి. భారీగా వస్తున్న వరద ప్రవాహాలతో ప్రాజెక్టుల గేట్లు తెరుచుకుంటున్నాయి. గోదావరి, కృష్ణా నదుల్లో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. పర్యవసానంగా భద్రాచలం వద్ద బుధవారం

Published : 11 Aug 2022 04:29 IST

గోదావరి, కృష్ణాలకు కొనసాగుతున్న భారీవరద

భద్రాచలం వద్ద మూడో ప్రమాదహెచ్చరికకు చేరువలో నీటిమట్టం

ఆందోళనలో లోతట్టు గ్రామాల ప్రజలు

సముద్రంలోకి 2,700 టీఎంసీలు

నేడు తెరుచుకోనున్న నాగార్జునసాగర్‌ గేట్లు

ఈనాడు హైదరాబాద్‌; భద్రాచలం, నాగార్జునసాగర్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలన్నీ జలకళతో నిండుకుండలను తలపిస్తున్నాయి. భారీగా వస్తున్న వరద ప్రవాహాలతో ప్రాజెక్టుల గేట్లు తెరుచుకుంటున్నాయి. గోదావరి, కృష్ణా నదుల్లో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. పర్యవసానంగా భద్రాచలం వద్ద బుధవారం సాయంత్రం రెండో ప్రమాద హెచ్చరిక 48 అడుగులు దాటి 50.60 అడుగుల మట్టం వద్ద 12.91 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. గత నెలలో నీటమునిగి ఇంకా తేరుకోని గ్రామాల ప్రజలు తాజా వరదతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సింగూరు, శ్రీరామసాగర్‌, ప్రాణహితల నుంచి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ప్రాణహిత నది గోదావరిలో కలిసిన తర్వాత మేడిగడ్డ బ్యారేజీ 85 గేట్లు ఎత్తి 8.57 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. గోదావరి నుంచి బుధవారం ఉదయం ఆరు గంటల వరకు 2,700 టీఎంసీలు సముద్రంలోకి వెళ్లింది. కృష్ణాలో అటు ఆలమట్టి, ఇటు తుంగభద్రల నుంచి భారీ వరద ప్రవాహం కొనసాగుతుండడంతో బుధవారం రాత్రి 9 గంటలకు శ్రీశైలంలో పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తితోపాటు పది గేట్లు ఎత్తి 3,79,460 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో నాగార్జునసాగర్‌ డ్యాం క్రస్టుగేట్ల ద్వారా గురువారం ఉదయం 6:30 గంటలకు నీటిని విడుదల చేయనున్నట్లు ఎస్‌ఈ ధర్మ తెలిపారు. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు.

పులిచింతల వద్ద అప్రమత్తత

ఎగువ నుంచి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో సాగర్‌ నుంచి నీటి విడుదల పరిమాణాన్ని లక్ష నుంచి 3లక్షల క్యూసెక్కులకు పెంచే అవకాశముందని తెలపటంతో పులిచింతల అధికారులుఅప్రమత్తమయ్యారు. తెలంగాణ జెన్‌కో జల విద్యుత్కేంద్రంలో 70 మెగావాట్ల విద్యుదుత్పాదన ప్రక్రియ యథావిధిగా కొనసాగుతోంది.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని