బాడీవేర్‌ కెమెరాలు ఎక్కడ?

ట్రాఫిక్‌ పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారన్న అపవాదు తొలగించుకునే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ‘బాడీ వేర్‌ కెమెరాల’ ప్రయోగం మూణ్నాళ్ల ముచ్చటయింది. ఏడేళ్ల క్రితం ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో వీటిని ప్రవేశపెట్టగా..ఇప్పుడవి

Updated : 11 Aug 2022 06:01 IST

మూణ్నాళ్ల ముచ్చటగా వినియోగం
సర్వర్‌ పనిచేయడం లేదనే నెపంతో మూలకు

ఈనాడు, హైదరాబాద్‌: ట్రాఫిక్‌ పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారన్న అపవాదు తొలగించుకునే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ‘బాడీ వేర్‌ కెమెరాల’ ప్రయోగం మూణ్నాళ్ల ముచ్చటయింది. ఏడేళ్ల క్రితం ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో వీటిని ప్రవేశపెట్టగా..ఇప్పుడవి  చూద్దామన్నా కనిపించడంలేదు. మియాపూర్‌, కూకట్‌పల్లిలో ట్రాఫిక్‌ పోలీసులు వాహనదారులతో దురుసుగా ప్రవర్తించిన ఘటనలు వెలుగుచూసిన నేపథ్యంలో మళ్లీ ఇప్పుడా కెమెరాల అంశం తెరపైకి వచ్చింది. పోలీసుల వ్యవహారశైలిపై ఆరోపణలు ఎప్పట్నుంచో ఉన్నాయి. అసభ్య పదజాల ప్రయోగం, దురుసు ప్రవర్తన, విచక్షణ కోల్పోయి దాడిచేయడం వంటివి అందులో కొన్ని. పోలీస్‌శాఖపై ఉన్న ఈ అపప్రధను తొలగించుకునేందుకే తెలంగాణ ఏర్పడిన తర్వాత స్నేహపూర్వక (ఫ్రెండ్లీ) పోలీసింగ్‌ అనే విధానాన్ని తెరపైకి తెచ్చారు. ఇందులో భాగంగా ప్రతి పోలీస్‌స్టేషన్‌లో రిసెప్షన్‌ కేంద్రాలు, సీసీ కెమెరాల ఏర్పాటు, ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి పోలీసుల ప్రవర్తన గురించి తెలుసుకోవడం వంటి సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇవన్నీ కొంతవరకు సత్ఫలితాలనే ఇచ్చాయి.

ట్రాఫిక్‌ పోలీసులపై నిఘా కోసం..: రోడ్లపై విధులు నిర్వర్తించే ట్రాఫిక్‌ పోలీసులు నిబంధనల ఉల్లంఘనల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారని, వాహనదారులతో దురుసుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణల నుంచి బయటపడే లక్ష్యంతో అధికారులు ‘బాడీవేర్‌ కెమెరాల’ విధానాన్ని ప్రవేశపెట్టాలని అప్పట్లోనే నిర్ణయించారు. ఇందుకోసం 2015లో తొలుత హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో వంద కెమెరాలు కొన్నారు. అటు తర్వాత ఉమ్మడి సైబరాబాద్‌ కమిషనరేట్‌లో మరో వంద కొనుగోలు చేశారు. ‘క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు మెడలో ఈ కెమెరాలను ధరిస్తారు. ఆ కెమెరాల పరిధిలో నమోదయ్యే దృశ్యాలు పోలీసు కంట్రోల్‌ రూంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన సర్వర్‌లో నిక్షిప్తమవుతాయి. పోలీసుల ప్రవర్తనపై ఎవరైనా ఫిర్యాదుచేసిన పక్షంలో ఆ దృశ్యాల ఆధారంగా వాస్తవాలు తెలుసుకుంటాం’’ అని అప్పట్లో అధికారులు ప్రకటించారు. ఇక్కడ విజయవంతమైతే రాష్ట్రమంతా విస్తరిస్తామనీ చెప్పారు. ఇప్పుడు వాటి వాడకం దాదాపు నిలిచిపోయింది. సర్వర్‌ పనిచేయడం లేదని, కెమెరాలలో తరచూ సాంకేతిక సమస్యలు వస్తున్నాయనే కారణంగా వాటిని వాడటం లేదని తెలుస్తోంది. తాజాగా మియాపూర్‌, కూకట్‌పల్లిలో ట్రాఫిక్‌ పోలీసులు వాహనదారులతో దురుసుగా ప్రవర్తించిన ఘటనలు వెలుగుచూసిన నేపథ్యంలో.. ఇప్పుడు ఈ కెమెరాల అంశం మరోసారి చర్చకు వచ్చింది. ఈ రెండు ఘటనల్లో వాహనదారుల ప్రవర్తన కారణంగానే తాము దురుసుగా వ్యవహరించాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నప్పటికీ వాస్తవం ఏమిటన్నది వెల్లడికావడం లేదు. బాడీవేర్‌ కెమెరాలు వినియోగించి ఉంటే వాస్తవాలు తెలిసేవని, వీటిని మళ్లీ అందుబాటులోకి తేవాలని క్షేత్రస్థాయి సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని