5111 అంగన్‌వాడీ పోస్టుల భర్తీ

తెలంగాణలో జరుగుతున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాల కానుకగా ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల మందికి ఆసరా పింఛన్లు మంజూరు చేయాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. రాష్ట్రంలో ఇప్పటికే 36 లక్షల మంది పింఛన్లు పొందుతున్నారు. వీటితో కలిపి మొత్తం పింఛన్లు 46 లక్షలకు చేరనున్నాయి.

Updated : 12 Aug 2022 06:53 IST

58, 59 జీవోల కింద పట్టాల పంపిణీ వేగవంతం

గ్రామకంఠంలో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులపై కమిటీ

21 నాటి శాసనసభ ప్రత్యేక సమావేశం రద్దు

మరిన్ని ఆదాయ వనరుల సమీకరణపై దృష్టి

పంద్రాగస్టు నుంచి 10 లక్షల మందికి కొత్త పింఛన్లు

రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో నిర్ణయాలు

ఈనాడు - హైదరాబాద్‌

తెలంగాణలో జరుగుతున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాల కానుకగా ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల మందికి ఆసరా పింఛన్లు మంజూరు చేయాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. రాష్ట్రంలో ఇప్పటికే 36 లక్షల మంది పింఛన్లు పొందుతున్నారు. వీటితో కలిపి మొత్తం పింఛన్లు 46 లక్షలకు చేరనున్నాయి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 5,111 అంగన్‌వాడీ ఉపాధ్యాయులు, ఆయా పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, 58, 59 జీవోల కింద పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలనీ కేబినెట్‌ నిర్ణయించింది. గ్రామకంఠంలో నూతన ఇళ్ల నిర్మాణానికి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల శాశ్వత పరిష్కారానికి అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఆ కమిటీ 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన గురువారం ప్రగతిభవన్‌లో అయిదున్నర గంటలపాటు మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో మరిన్ని ఆదాయ వనరులను సమీకరించాలని తీర్మానించింది. హైదరాబాద్‌లోని కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రిలో ఈఎన్‌టీ టవర్‌, సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో నూతన భవన సముదాయం, కోఠిలోని వైద్యారోగ్యశాఖ సముదాయంలో ఆసుపత్రి నిర్మాణ ప్రతిపాదనలకు మంత్రిమండలి అనుమతించింది. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా 75 మంది ఖైదీల విడుదలకు ఆమోదం తెలిపింది. వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 21న తలపెట్టిన శాసనసభ, స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ రోజు పెద్దఎత్తున వివాహాలు ఉన్నందున ప్రజాప్రతినిధుల నుంచి వస్తున్న వినతులను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకుంది. 

ఆర్థిక పరిస్థితిపై విస్తృత చర్చ

సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విస్తృత చర్చ జరిగింది. సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావులు రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. అనంతరం సీఎం మాట్లాడారు. ‘‘ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆదాయంలో 15.3 శాతం వృద్ధిరేటు నమోదైంది. కేంద్రం నుంచి వివిధ పథకాల కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు 12.9 శాతం తగ్గినప్పటికీ ఈ వృద్ధిరేటు నమోదు కావడం రాష్ట్ర ఆర్థిక పటిష్ఠతకు నిదర్శనం. ముఖ్యంగా కేంద్రం సింగిల్‌ నోడల్‌ ఏజెన్సీ(ఎస్‌ఎన్‌ఏ) ఖాతాలు అనే కొత్త పద్ధతి తేవడంతో రాష్ట్రాలకిచ్చే నిధుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితుల్లో కోతలు విధించింది. లేకపోతే రాష్ట్ర ఆదాయం మరింత పెరిగి, దాదాపు 22 శాతం వృద్ధిరేటు నమోదయ్యేది. కేంద్ర ప్రాయోజిత పథకా(సీఎస్‌ఎస్‌)ల్లో గత 8 సంవత్సరాల్లో రాష్ట్రానికి రూ.47,312 కోట్లు మాత్రమే వచ్చాయి. గత నాలుగేళ్లలో రైతుబంధు పథకం కింద రైతులకు రూ.58,024 కోట్ల పంట పెట్టుబడి సాయం అందించాం. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష 84 వేల కోట్లు ఖర్చు చేయగా అందులో సీఎస్‌ఎస్‌ కింద అందింది రూ.5,200 కోట్లు మాత్రమే. రాష్ట్రం మొత్తం పెట్టిన ఖర్చులో ఇది 3 శాతం కంటే తక్కువ. కేంద్రం అవలంబిస్తున్న అసంబద్ధ విధానాలతో రాష్ట్రాభివృద్ధికి విఘాతం కలుగుతోంది. రాష్ట్రం సాధించిన ప్రగతి కేంద్రం కూడా సాధించి ఉంటే రాష్ట్ర జీఎస్‌డీపీ మరో రూ.3 లక్షల కోట్లు పెరిగి.. రూ.14.50 లక్షల కోట్లకు చేరేది. దేశ జనాభాలో రాష్ట్ర జనాభా రెండున్నర శాతమే అయినా దేశ ఆదాయానికి 5 శాతం ఆర్థిక వనరులు అందిస్తున్నాం. పన్నుల ఆదాయ వృద్ధిలో 11.5 శాతంతో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది. రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరం 2014-15లో రాష్ట్ర ఆదాయం రూ.62 వేల కోట్లుండగా, గత సంవత్సరానికి 1.84 లక్షల కోట్లకు పెరిగింది. ఏడేళ్లలోనే రాష్ట్రం మూడు రెట్ల వృద్ధి సాధించి.. దేశంలో అగ్రగామిగా నిలిచింది’’ అని సీఎం వివరించారు.

ఐటీ రంగం భేష్‌

ఐటీ రంగంపై ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ‘‘గత సంవత్సరం 1.55 లక్షల మందికి కొత్తగా ఉద్యోగాల కల్పనతో రాష్ట్రం దేశంలో అగ్రగామిగా నిలిచింది. బెంగళూరులో 1.48 లక్షల ఉద్యోగాలే కల్పించారు’’ అని జయేశ్‌రంజన్‌ తెలిపారు. రాష్ట్ర ఐటీ రంగ అభివృద్ధిపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తంచేశారు.


* ఈ నెల 16వ తేదీన ఉదయం 11.30కు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన జరపాలని మంత్రిమండలి సమావేశం నిర్ణయించింది. దీనిపై ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు ఆమోదం తెలిపింది.

* వికారాబాద్‌లో ఆటోనగర్‌ నిర్మాణానికి 15 ఎకరాలు, తాండూరు మార్కెట్‌ కమిటీకి యాలాలలో 30 ఎకరాలు, షాబాదు బండల(నాపరాళ్ల) పాలిషింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలో 45 ఎకరాలు కేటాయింపు. 

* కోఠి ఈఎన్టీ ఆసుపత్రికి అదనంగా 10 ప్రత్యేక వైద్యనిపుణుల పోస్టుల మంజూరు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని