డిజైన్‌ మారిందా?

డిజైన్‌లో చేసిన మార్పు వల్లే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన అన్నారం పంపుహౌస్‌ నీట మునిగిందా అన్నది నీటిపారుదల శాఖ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పంపుహౌస్‌ మెయింటెనెన్స్‌ బే(నిర్వహణ ప్రాంతం)

Updated : 12 Aug 2022 07:09 IST

అందుకే అన్నారం పంపుహౌస్‌ నీట మునిగిందా?

మొదట ఆమోదించిన ప్రకారం నిర్వహణ ప్రాంతం 132 మీటర్లు

తర్వాత 124 మీటర్లకు తగ్గింపు

ఈ రెండింటికీ అనుమతించింది జెన్‌కోనే 

ఈనాడు హైదరాబాద్‌: డిజైన్‌లో చేసిన మార్పు వల్లే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన అన్నారం పంపుహౌస్‌ నీట మునిగిందా అన్నది నీటిపారుదల శాఖ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పంపుహౌస్‌ మెయింటెనెన్స్‌ బే(నిర్వహణ ప్రాంతం) మొదట ఆమోదించిన డిజైన్‌ ప్రకారం 132 మీటర్లు. అంటే అంతవరకు కాంక్రీటు పని చేయాలి. తర్వాత మార్పు చేసి 124 మీటర్లకు తగ్గించారు. దీంతోపాటు మోటార్లు, స్విచ్‌గేర్‌లు ఇలా అన్నింటి మెయింటెనెన్స్‌ బేల మట్టాలు తగ్గిపోయాయి. మొదట ఆమోదించింది, తర్వాత మార్చి ఆమోదించింది కూడా జెన్‌కోనే. పంపుహౌస్‌ నిర్మాణం కావడంతో సివిల్‌ పనులతో సహా అన్నింటికి సంబంధించిన డిజైన్లను జెన్‌కోనే ఆమోదించిందని, సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌(సీడీవో) ఆమోదానికి వెళ్లలేదని తెలిసింది. వారి పరిశీలనకు వెళ్లినా, అసలు కాంక్రీటు పనిని ఎనిమిది మీటర్లు ఎందుకు తగ్గించారన్న అంశాన్ని ప్రస్తుతం నీటిపారుదల శాఖ అధికారులు కూడా పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

132 మీటర్లయితే పంపుహౌస్‌కు రక్షణ ఉండేదోమో...: అన్నారం బ్యారేజీ నుంచి సుందిళ్లకు నీటిని ఎత్తిపోసేందుకు చేపట్టిన పంపుహౌస్‌ సివిల్‌ పనుల డిజైన్‌కు మొదట 2016 నవంబరు 4న జెన్‌కో చీఫ్‌ ఇంజినీర్‌ ఆమోదం తెలిపారు. ఇందులో మెయింటెనెన్స్‌ బే 132 మీటర్లుగా ఉంది. దీనిపై కాళేశ్వరం చీఫ్‌ ఇంజినీర్‌ కూడా సంతకం చేశారు. దీనికి తగ్గట్లుగానే తవ్వకం చేపట్టినా, 2018 జూన్‌ 15న మళ్లీ మార్పు చేశారు. దాని ప్రకారం మెయింటెనెన్స్‌ బే 124 మీటర్లకు తగ్గిపోయింది. అంటే కాంక్రీటు పని అంత వరకు చేస్తే సరిపోతుంది. దీంతోపాటు పంపులు అమర్చే ఫ్లోర్‌, మొదటి స్విచ్‌గేర్‌ రూం, రెండో స్విచ్‌గేర్‌ రూం మట్టాలను కూడా మార్చారు. ఈ మార్పులకన్నా మెయింటెనెన్స్‌ బే మట్టాన్ని తగ్గించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సుందిళ్ల బ్యారేజికి 1.8 కిలోమీటర్ల దూరంలో అన్నారం పంపుహౌస్‌ ఉంది. సుందిళ్ల బ్యారేజి వద్ద అత్యధిక వరద మట్టం(హెచ్‌.ఎఫ్‌.ఎల్‌) 132.13 మీటర్లు కాగా, అన్నారం వద్ద 121 మీటర్లు. వీటిని పరిగణనలోకి తీసుకొనే రెండు బ్యారేజీల పూర్తి స్థాయి నీటిమట్టాలను నిర్ధారించారు. పంపుహౌస్‌కు సమీపంలో ఉన్న చందనాపూర్‌ వాగు హెచ్‌.ఎఫ్‌.ఎల్‌. 124.5 మీటర్లని సంబంధిత వర్గాలు తెలిపాయి. మొదట ఆమోదం తెలిపినట్లుగా 132 మీటర్ల వరకు కాంక్రీటు పని చేసి ఉంటే పంపుహౌస్‌కు రక్షణ ఉండేదోమో అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత నెలలో అత్యధిక వరద వచ్చినపుడు సుందిళ్ల వద్ద నమోదైన మట్టం 130.6 మీటర్లుగా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అంటే హెచ్‌.ఎఫ్‌.ఎల్‌. పూర్తిగా రాలేదు. వచ్చి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదన్నదానిపై కూడా అధ్యయనం జరగాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని