అవి ప్రభుత్వ భూములని ఎలా అంటారు?

ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు భూ వివాదంలో ఉన్నప్పుడు మధ్యలో అకస్మాత్తుగా వచ్చి అవి ప్రభుత్వ భూములని ఎలా అంటారంటూ తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. హైదరాబాద్‌ హైదర్‌నగర్‌లోని సర్వే

Published : 12 Aug 2022 05:28 IST

హైదర్‌నగర్‌ భూముల కేసులో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం ప్రశ్న

ఇరువర్గాల న్యాయవాదుల తీరుపై సీజేఐ ఆగ్రహం

తాను సభ్యుడిగా లేని ధర్మాసనానికి కేసును పంపాలని రిజిస్ట్రీకి ఆదేశం

ఈనాడు, దిల్లీ: ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు భూ వివాదంలో ఉన్నప్పుడు మధ్యలో అకస్మాత్తుగా వచ్చి అవి ప్రభుత్వ భూములని ఎలా అంటారంటూ తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. హైదరాబాద్‌ హైదర్‌నగర్‌లోని సర్వే నంబర్‌ 172లో దాదాపు 98 ఎకరాల భూమి తమదంటూ ట్రినిటీ ఇన్‌ఫ్రా వెంచర్స్‌ (గోల్డ్‌స్టోన్‌) లిమిటెడ్‌, ఆ కంపెనీ భాగస్వాములు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. ఆ భూములు ప్రభుత్వానికి చెందుతాయంటూ రాష్ట్ర ప్రభుత్వం మరో పిటిషన్‌ దాఖలు చేసింది. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ కృష్ణమురారిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది వికాస్‌సింగ్‌ వాదనలు వినిపించారు. ఆ భూములపై 197 మంది క్లెయిమ్‌ అడుగుతున్నందున వివాదం ప్రారంభమైందని, వారందరితో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఆ భూములతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని, మూడేళ్ల పాటు పట్టించుకోకుండా ఇప్పుడు పిటిషన్‌ దాఖలు చేయడం సరికాదని చెప్పారు. ఆ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి చెందుతాయని, అందుకు సంబంధించి చట్టం కూడా ఉందని.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది సీఎస్‌ వైద్యనాథన్‌ వాదించారు. ఆ భూములు ప్రభుత్వానివేనని నిరూపిస్తామన్నారు. జోక్యం చేసుకున్న ధర్మాసనం సంవత్సరాల తరబడి పట్టించుకోకుండా అకస్మాత్తుగా వచ్చి అవి ప్రభుత్వ భూములని ఎలా అంటారంటూ వైద్యనాథన్‌ని ప్రశ్నించింది. పలు కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం అలానే వ్యవహరిస్తోందని పేర్కొంది. తాము ఆలస్యంగా పిటిషన్‌ దాఖలు చేయలేదని వైద్యనాథన్‌ అనగా.. ప్రభుత్వ పిటిషన్‌పై విచారణను వికాస్‌సింగ్‌ వ్యతిరేకించారు. ప్రభుత్వం తన పిటిషన్‌పై వాదనలు వినిపిస్తే మీకేం అభ్యంతరం అని ఈ సందర్భంగా సీజేఐ ప్రశ్నించారు. అనంతరం ఇరుపక్షాల న్యాయవాదులు ధర్మాసనం చెబుతున్నది ఆలకించకుండా వాదనలు వినిపిస్తుండడంతో సీజేఐ ఎన్‌.వి.రమణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీనియర్‌ న్యాయవాదుల తీరు సరికాదని మందలించారు. ఆ తర్వాత సైతం సీనియర్‌ న్యాయవాదులు అదే తీరులో వాదిస్తుండడంతో.. ఆగ్రహించిన సీజేఐ.. ఇక ఈ కేసులో తాను వాదనలు విననని స్పష్టం చేశారు. తాను సభ్యుడిగా లేని ఇతర ధర్మాసనం ముందు ఈ నెల 23వ తేదీ జాబితాలో చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని