కాగితాల్లో చంపిన మహిళను కలిశారు

హనుమకొండకు చెందిన మతిస్థిమితం లేని మహిళను ఎట్టకేలకు ఆమె భర్త, కుమారుడు గురువారం చెన్నైలోని అన్బగం రిహాబిలిటేషన్‌ కేంద్రంలో కలుసుకున్నారు. ఈ విషయాన్ని

Published : 12 Aug 2022 05:28 IST

చెన్నై నుంచి తీసుకొస్తున్న భర్త, కుమారుడు

ఈనాడు-వరంగల్‌, కార్పొరేషన్‌(వరంగల్‌)- న్యూస్‌టుడే: హనుమకొండకు చెందిన మతిస్థిమితం లేని మహిళను ఎట్టకేలకు ఆమె భర్త, కుమారుడు గురువారం చెన్నైలోని అన్బగం రిహాబిలిటేషన్‌ కేంద్రంలో కలుసుకున్నారు. ఈ విషయాన్ని ఆ కేంద్రం ట్రస్టీ సభ్యుడు మహ్మద్‌ రఫీ ‘ఈనాడు’కు ఫోన్‌లో తెలిపారు. ఆమెను 2017 ఏప్రిల్‌ 16న చెన్నై ఆల్‌ ఉమెన్‌ పోలీసులు తమకు అప్పగించారని చెప్పారు. ఆమె అయిదేళ్లుగా తమ కేంద్రంలోనే ఆశ్రయం పొందుతోందన్నారు. మహిళ చిరునామాను గుర్తించి కుటుంబసభ్యులకు చెప్పడంతో వారు గురువారం వచ్చారన్నారు. ఆమె కుమారుడితో ‘ఈనాడు’ ఫోన్‌లో మాట్లాడగా తన తల్లితో బస్సులో బయలుదేరామని, శుక్రవారం వరంగల్‌కు చేరుకుంటామని చెప్పారు. మహిళ దయనీయ గాథపై ‘రైలెక్కించి పంపారు.. కాగితాల్లో చంపారు’ శీర్షికతో గురువారం ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైన విషయం విదితమే.

నాడు తీసుకున్నాడు.. నేడు రద్దు చేయాలంటున్నాడు

చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు హనుమకొండ యాదవనగర్‌కు చెందిన యువకుడు అన్ని దారులు వెతికాడు. తన తల్లి మృతి చెందిందంటూ.. మరణ ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని 2021 ఆగస్టు 3న దరఖాస్తు చేసుకున్నాడు. అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి ఆన్‌లైన్‌లో డెత్‌ రిజిస్ట్రేషన్‌ చేయగా మీ-సేవా కేంద్రంలో ధ్రువీకరణ పత్రం తీసుకున్నాడు. తప్పుడు సమాచారంతో దీనిని తీసుకున్నారని ఆ తర్వాత ఒక ఫిర్యాదు వచ్చింది. విచారణలో ఇరుగుపొరుగువారు ఆమె చనిపోయిందనే చెప్పడంతో అధికారులు దానిని పక్కనపెట్టేశారు. అయితే మరణ ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేయాలని నాలుగు రోజుల కిందట ఆ యువకుడు అర్జీ పెట్టుకున్నాడు. తన తల్లి బతికే ఉందని, చెన్నైలోని స్వచ్ఛంద సంస్థ వారు వీడియో కాల్‌ ద్వారా చూపించారని తెలిపాడు. దీంతో కంగుతిన్న ఉద్యోగులు న్యాయ సలహా కోసం లీగల్‌సెల్‌ దృష్టికి తీసుకెళ్లారు. అయితే మరణ ధ్రువీకరణ పత్రాన్ని వెంటనే రద్దు చేయాలని ఉద్యోగులపై రెండు, మూడు రోజులుగా రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నాయని తెలిసింది.

అంత్యక్రియలూ చేశామన్నారు

రెండేళ్ల కిందట వరంగల్‌ ప్రాంతంలో రైలు పట్టాలపై గుర్తు తెలియని మహిళ మృతదేహం ఉండగా పోలీసుల సమాచారం మేరకు అది తమ తల్లిదేనని భావించి అంత్యక్రియలు చేశామని మహిళ కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఆ మృతదేహం ఎవరిదనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని