నకిలీ పీహెచ్‌డీలేవీ దొరకలేదు

ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌, ఫార్మసీ కళాశాలల అధ్యాపకుల విద్యార్హతలకు సంబంధించి నకిలీ పీహెచ్‌డీలపై ఆధారాలేవీ దొరకలేదని జేఎన్‌టీయూహెచ్‌ ఉపకులపతి కట్టా నర్సింహారెడ్డి తెలిపారు. ఎంసెట్‌ ఫలితాల విడుదల అనంతరం

Published : 13 Aug 2022 04:14 IST

6 నెలల్లో డాక్టరేట్‌పై హైకోర్టులో కేసు నడుస్తోంది
జేఎన్‌టీయూహెచ్‌ ఉపకులపతి వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌, ఫార్మసీ కళాశాలల అధ్యాపకుల విద్యార్హతలకు సంబంధించి నకిలీ పీహెచ్‌డీలపై ఆధారాలేవీ దొరకలేదని జేఎన్‌టీయూహెచ్‌ ఉపకులపతి కట్టా నర్సింహారెడ్డి తెలిపారు. ఎంసెట్‌ ఫలితాల విడుదల అనంతరం శుక్రవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. నకిలీ పీహెచ్‌డీ ధ్రువపత్రాలను గుర్తించేందుకు గత ఏడాది ముగ్గురు సభ్యుల కమిటీని నియమించిన విషయంపై అడిగిన ప్రశ్నకు ఈ సమాధానమిచ్చారు. అమెరికా కాలిఫోర్నియా వర్సిటీలో ఆరు నెలల్లో పీహెచ్‌డీ చేసినట్లు ఒకరు సర్టిఫికెట్‌ చూపారని.. దీనిపై తాము వర్సిటీకి లేఖ రాస్తే అది అసలుదేనని సమాధానమిచ్చారన్నారు. దానిపై హైకోర్టులో కేసు నడుస్తోందని తెలిపారు. అన్ని కళాశాలలు.. తమ వెబ్‌సైట్లలో అధ్యాపకుల జాబితాను ఉంచడం తప్పనిసరి చేస్తామని వెల్లడించారు. ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో అధ్యాపకుల నియామకానికి ప్రత్యేక పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వానికి రాశామని, అయితే దానివల్ల పలు సమస్యలు ఉత్పన్నమవుతాయని అనుమతి ఇవ్వలేదన్నారు. కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులకు పలు యాజమాన్యాలు జీతాలు ఇచ్చి.. అందులో కొంత మొత్తాన్ని వెనక్కి తీసుకుంటున్నాయని, దాన్ని ఎందుకు నిరోధించలేకపోతున్నారని ప్రశ్నించగా.. వారు రాజీపడితే తాము ఏం చేయగలమని ప్రశ్నించారు. దీనిపై అధ్యాపకులు ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. కళాశాలలు ఎంపిక చేసుకున్న అధ్యాపకులకు తగిన అర్హతలు ఉన్నాయో? లేవో? పరిశీలించి ఆమోదం(ర్యాటిఫై) తెలిపేందుకు స్టాఫ్‌ సెలెక్టన్‌ కమిటీ మీటింగ్‌ (ఎస్‌సీఎం)లు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈసారి వర్సిటీలను పిలవకుండా రాష్ట్రవ్యాప్తంగా 20 క్లస్టర్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో మాదిరిగా ఈసారి ఆయా కళాశాలలకు వెళ్లి భవనాలు, ల్యాబ్‌లను పరిశీలించేది లేదన్నారు. కొత్త కోర్సులు వచ్చినా.. కొత్త అధ్యాపకులు చేరినా ఆ వివరాలను తనిఖీ చేస్తామని, ఈ నెల 25 నాటికి అనుబంధ గుర్తింపు జారీ ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు.

స్పాట్‌ ప్రవేశాలపై చర్చ..

ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో స్పాట్‌ ప్రవేశాలు జరిపినట్లుగా ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలల్లోనూ సీట్లు మిగిలిపోకుండా స్పాట్‌ అడ్మిషన్లు జరపాలన్న అంశంపై చర్చ నడుస్తోందని నర్సింహారెడ్డి తెలిపారు. ఈసారి కొత్తగా హైదరాబాద్‌, సుల్తాన్‌పూర్‌ కళాశాలల్లో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ విధానంలో బీటెక్‌ ‘ఏఐ అండ్‌ ఎంఎల్‌’ కోర్సును ప్రారంభిస్తున్నామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని