ఉపాధి హామీలో అక్రమాలు జరిగాయ్‌..

రాష్ట్రంలోని ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని, నిబంధనలకు విరుద్ధంగా పనులు చేశారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అనుమతి లేకుండా రైతువేదికలు, రైతు కల్లాలు నిర్మిచారని, నీటి ట్యాంకుల్లో పూడికతీత పనుల్లో

Published : 13 Aug 2022 04:53 IST

అధికారులపై చర్యలు చేపట్టాలి
సెప్టెంబరు 11లోగా ఏటీఆర్‌ నివేదిక ఇవ్వండి
రాష్ట్రానికి కేంద్రం లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని, నిబంధనలకు విరుద్ధంగా పనులు చేశారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అనుమతి లేకుండా రైతువేదికలు, రైతు కల్లాలు నిర్మిచారని, నీటి ట్యాంకుల్లో పూడికతీత పనుల్లో లోటుపాట్లు జరిగాయని పేర్కొంది. ఈ అక్రమాల్లో దుర్వినియోగమైన నిధులు కేంద్రానికి రికవరీ చేయాలని, సంబంధిత అధికారులపై పరిపాలన, క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రభుత్వం తీసుకున్న చర్యల నివేదికను సెప్టెంబరు 11లోగా కేంద్రానికి పంపాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ‘‘రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం అమలుపై జూన్‌ 9 నుంచి 12 వరకు చేపట్టిన పర్యటనలో పలు ఉల్లంఘనలు గుర్తించాం. కేంద్రం అనుమతి లేకుండా రైతువేదికలు, కల్లాలు, అడవుల్లో కందకాలు తవ్వారు. పనుల అంచనాలు, అనుమతులు, అమల్లో తీవ్ర అక్రమాలు జరిగాయి. చెరువుల్లో పూడికతీత పనులు నిబంధనలకు అనుగుణంగా లేవు. కొండప్రాంతాల్లో కాక మైదాన ప్రాంతాల్లోని అడవుల్లో కందకాలు తవ్వారు. టెక్నికల్‌ కమిటీ అనుమతులు తీసుకోకుండా పనుల్ని విభజించారు. పథకం అమలు, పనుల్లో నిబంధనల ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయి. పనులు చేసినచోట బోర్డులు లేవు. జాబ్‌కార్డులు, గ్రామాల్లో రికార్డుల నిర్వహణ సరిగా లేదని కమిటీ తెలిపింది. ఈ అక్రమాలు గుర్తించాక కేంద్రం క్షేత్రస్థాయిలో ఉపాధిపనుల పరిశీలనకు 15 బృందాలు పంపించింది. అవి ఆయా పనుల్లో లోపాలు, అక్రమాలు గుర్తించాయి. సదరు కమిటీలు ఇచ్చిన నివేదికల్ని తెలంగాణ ప్రభుత్వానికి పంపించాం. వాటిలో చూపిన తీవ్ర లోపాలపై చర్యలు తీసుకుని, ఆ నివేదికను కేంద్రానికి సమర్పించాలి’’ అని కేంద్రం పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని