పీజీ వైద్యుల్లో మానసిక కుంగుబాటు

బోధనాసుపత్రుల్లో నిరంతరం రోగులకు సేవలందించేది పీజీ వైద్య విద్యార్థులే(రెసిడెంట్‌ వైద్యులు). ఆచార్యులు, సహ ఆచార్యులు, సహాయ ఆచార్యులు.. ఇలా ఎంతమంది ఉన్నా.. అత్యవసర, సాధారణ వార్డుల్లో వీరి పాత్రే కీలకం. వీరు

Published : 13 Aug 2022 04:52 IST

పరిష్కారానికి తక్షణం చర్యలు తీసుకోవాలి: ఎన్‌ఎంసీ

ఈనాడు, హైదరాబాద్‌: బోధనాసుపత్రుల్లో నిరంతరం రోగులకు సేవలందించేది పీజీ వైద్య విద్యార్థులే(రెసిడెంట్‌ వైద్యులు). ఆచార్యులు, సహ ఆచార్యులు, సహాయ ఆచార్యులు.. ఇలా ఎంతమంది ఉన్నా.. అత్యవసర, సాధారణ వార్డుల్లో వీరి పాత్రే కీలకం. వీరు మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే.. రోగులకు మెరుగైన వైద్యసేవలను అందించగలుగుతారు. అయితే ఇటీవలి కాలంలో వారు తీవ్ర ఒత్తిడి, మానసిక కుంగుబాటుకు లోనవుతున్నారు. ముఖ్యంగా కొవిడ్‌ రాకతో వారిపై తీవ్ర పని భారం పెరిగింది. దీంతో మానసికంగా కుంగుబాటుకు గురై కొందరు ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలూ ఉన్నాయి. అత్యవసర పనులున్నా వాటిని పక్కనబెట్టి దీర్ఘకాలంగా వైద్యసేవల్లో ఉండడం వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి, కుంగుబాటుకు గురవుతున్నట్లుగా పలువురు పీజీ వైద్య విద్యార్థులు జాతీయ వైద్య కమిషన్‌కు(ఎన్‌ఎంసీకి) ఫిర్యాదు చేశారు. దీనిపై పార్లమెంటులో ఇటీవల కొందరు ప్రశ్నలు లేవనెత్తారు. ఈ పరిస్థితుల్లో ఎన్‌ఎంసీలో భాగమైన పీజీ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ బోర్డు (పీజీఎంఈబీ) ఇటీవల అత్యవసరంగా సమావేశమైంది. ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యతను వైద్య కళాశాలలే స్వీకరించాలని నిర్ణయించింది. పీజీ వైద్య విద్యార్థులకు విశ్రాంతి, వారానికి ఒకరోజు సెలవు, అత్యవసర సమయాల్లో సెలవులు, మానసిక నిపుణులతో కౌన్సెలింగ్‌ వంటి చర్యలు చేపట్టాలని అన్ని వైద్య కళాశాలలకు, ఆసుపత్రులకు తాజాగా ఆదేశాలు జారీచేసింది. వారు ప్రశాంతంగా విధులు నిర్వర్తించే వాతావరణాన్ని కల్పించాలని, ఇందుకోసం ప్రతి వైద్య కళాశాలలోనూ ఒక కమిటీని ఏర్పాటు చేయాలని పేర్కొంది. ‘‘వారు ఏవైనా ఫిర్యాదులు చేస్తే స్వీకరించి, పరిష్కారానికి కృషిచేయాలి. వాటిపై నివేదికలను ఎన్‌ఎంసీకి పంపించాలి’’ అని పీజీఎంఈబీ స్పష్టం చేసింది. ఇందుకోసం ఫిర్యాదుల పెట్టెను అన్ని కళాశాలలు, ఆసుపత్రుల్లో తక్షణమే ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని