నేరపరిశోధనలో ప్రతిభకు పట్టం

నేరపరిశోధనలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఏటా అందజేసే ‘యూనియన్‌ హోంమినిస్టర్స్‌ మెడల్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఇన్వెస్టిగేషన్‌’ పురస్కారాల జాబితాను కేంద్ర హోంశాఖ శుక్రవారం ప్రకటించింది. స్వాతంత్య్ర దినోత్సవాలను

Published : 13 Aug 2022 04:52 IST

అయిదుగురు పోలీసులకు కేంద్రహోంశాఖ పతకాలు

ఈనాడు, హైదరాబాద్‌: నేరపరిశోధనలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఏటా అందజేసే ‘యూనియన్‌ హోంమినిస్టర్స్‌ మెడల్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఇన్వెస్టిగేషన్‌’ పురస్కారాల జాబితాను కేంద్ర హోంశాఖ శుక్రవారం ప్రకటించింది. స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకొని 2018 నుంచి ప్రకటిస్తున్న ఈ పురస్కారాలకు ఈసారి దేశవ్యాప్తంగా 151 మంది ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి నలుగురు డీఎస్పీలు పర్వతగిరి వెంకటరమణ(ట్రాన్స్‌కో విజిలెన్స్‌), రుద్రవరం గాండ్ల శివమారుతి (ఆసిఫ్‌నగర్‌-హైదరాబాద్‌), ఆశల గంగారాం(బాలానగర్‌-సైబరాబాద్‌), రఘు వెగ్గలం(జహీరాబాద్‌)తోపాటు ఇన్‌స్పెక్టర్‌ బూజూరు అంజిరెడ్డి(ఎల్‌బీనగర్‌-రాచకొండ)కి ఈ పురస్కారాలు లభించాయి.


సాంకేతిక, సంప్రదాయపరంగా ఆధారాల సేకరణ

రుద్రవరం గాండ్ల శివమారుతి(1995 బ్యాచ్‌) లంగర్‌హౌస్‌ ఠాణా పరిధిలో నమోదైన పొక్సో కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించారు. 2019లో అయిదేళ్ల పాపపై అత్యాచారం కేసులో సాంకేతిక, సంప్రదాయ పరంగా ఆధారాలు సేకరించి న్యాయస్థానంలో పకడ్బందీ అభియోగపత్రం దాఖలు చేశారు. నిందితుడికి జీవితకాల శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. బాధితురాలికి రూ.7లక్షల పరిహారం అందేలా మారుతి కృషి చేశారు. శివమారుతి హైదరాబాద్‌ సీసీఎస్‌లో పనిచేసిన కాలంలో టెక్‌ టీం, సిట్‌, స్పెషల్‌టీం, వైట్‌ కాలర్‌టీమ్‌లలో ఉంటూ క్లిష్టమైన కేసుల్ని చేధించడంలో కీలకంగా వ్యవహరించారు. టాస్క్‌ఫోర్స్‌ విభాగంలోనూ సత్తా చాటారు.


పొక్సో కేసులో 20 ఏళ్ల జైలుశిక్ష

ఘు వెగ్గలం(1995 బ్యాచ్‌) 2020లో ఆర్మూర్‌ డీఎస్పీగా ఉన్న సమయంలో ఆర్మూర్‌ ఠాణా పరిధిలో పొక్సో కేసు నమోదైంది. పటాన్‌చెరుకు చెందిన బాధితురాలి(16)పై వంశీకృష్ణ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పొక్సో కేసు కావడంతో రఘు ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తును పర్యవేక్షించారు. కీలక ఆధారాలు సేకరించి కొద్దిరోజుల్లోనే అభియోగపత్రం దాఖలు చేశారు. నిందితుడికి న్యాయస్థానం 20ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.


బాలికపై సెక్యూరిటీగార్డు అత్యాచారం కేసులో..

గంగారం(1995 బ్యాచ్‌) అబిడ్స్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న సమయంలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం కేసు నమోదైంది. 2017లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు పాఠశాల సెక్యూరిటీగార్డు కమల్‌భాన్‌ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈకేసులో గంగారాం పకడ్బందీ ఆధారాలు సేకరించి అభియోగ పత్రం దాఖలు చేయడంతో నిందితుడికి 20ఏళ్ల జైలుశిక్షతోపాటు రూ.2వేల జరిమానా విధించారు.


హత్యకేసులో బెయిల్‌ రాకముందే అభియోగపత్రం

అంజిరెడ్డి మేడిపల్లి ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న సమయంలో ఒడిశాకు చెందిన కూలీ జయరాం రౌత్‌(23) హత్య జరిగింది. ఒడిశాకే చెందిన ముకుంద(33) రాడ్‌తో కొట్టి ఈ హత్యకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. 2020 మేలో జరిగిన ఈ హత్య కేసులో అంజిరెడ్డి పకడ్బందీ ఆధారాలతో 90 రోజుల్లో బెయిల్‌ రాకముందే అభియోపగపత్రం దాఖలు చేశారు. 11 నెలల్లో వెలువడిన తీర్పులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షతోపాటు రూ.10వేల జరిమానా విధించారు.


హోంగార్డు అత్యాచారం కేసులో అయిదున్నర నెలల్లోనే తీర్పు

పర్వతగిరి వెంకటరమణ(1991 బ్యాచ్‌) గోపాలపురం (హైదరాబాద్‌ కమిషనరేట్‌) ఏసీపీగా ఉన్న సమయం(2020)లో బాలికపై అత్యాచారం కేసును చేధించడంలో కీలకంగా వ్యవహరించారు. తుకారంగేట్‌ ఠాణా పరిధిలో అంగవైకల్యంతో ఉన్న 16ఏళ్ల బాలికపై హోంగార్డు బొట్ల మల్లికార్జున అత్యాచారానికి పాల్పడిన కేసులో రెండు నెలల ఆరు రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేశారు. అలాగే డీఎన్‌ఏ నమూనా, ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదికలతో మరో రెండు అనుబంధ అభియోగపత్రాలు దాఖలు చేశారు. ఈ కేసు తీర్పు అయిదున్నర నెలల్లోనే వెలువడింది. పకడ్బందీ సాక్ష్యాధారాల కారణంగా నిందితుడికి పొక్సో చట్టంకింద 30 ఏళ్ల కఠినకారాగార శిక్షతోపాటు రూ.40వేల జరిమానా.. ఎస్సీ/ఎస్టీ నిరోధక చట్టం కింద జీవితఖైదుతోపాటు రూ.5వేల జరిమానా విధించారు. మరోవైపు బాధితురాలికి రూ.7లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని