తగ్గిన వరి సాగు

ప్రస్తుత వానాకాలం సీజన్‌లో దేశవ్యాప్తంగా వరి పంట సాగు తగ్గింది. ఈ నెల ఆరంభానికి 5.71 కోట్ల ఎకరాల్లోనే వరి నాట్లు వేశారు. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే.. 87 లక్షల ఎకరాలు తక్కువ సాగైనట్లు కేంద్ర వ్యవసాయశాఖ తాజాగా తెలిపింది. 222

Published : 13 Aug 2022 04:52 IST

దేశవ్యాప్తంగా గతేడాది ఇదే సీజన్‌తో పోలిస్తే 87 లక్షల ఎకరాలు తక్కువ
యూపీ సహా 4 రాష్ట్రాల్లో తీవ్ర వర్షాభావం
రాష్ట్రంలో నీరున్నా పుంజుకోని సాగు
రేషన్‌ పంపిణీకి వానాకాలంలో పండే బియ్యమే కీలకం
ఈనాడు - హైదరాబాద్‌

ప్రస్తుత వానాకాలం సీజన్‌లో దేశవ్యాప్తంగా వరి పంట సాగు తగ్గింది. ఈ నెల ఆరంభానికి 5.71 కోట్ల ఎకరాల్లోనే వరి నాట్లు వేశారు. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే.. 87 లక్షల ఎకరాలు తక్కువ సాగైనట్లు కేంద్ర వ్యవసాయశాఖ తాజాగా తెలిపింది. 222 జిల్లాల్లో వర్షాలు లేకపోవడమే ఇందుకు కారణమని వెల్లడించింది. కీలకమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో 75 జిల్లాలకు గానూ 62 జిల్లాల్లో, బిహార్‌లో 38కి 35, ఝార్ఖండ్‌లో 24కి 23, పశ్చిమ బెంగాల్‌లో 23కి 16, మధ్యప్రదేశ్‌లో 50కి 15 జిల్లాల్లో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. జులై దాటినా ఈ జిల్లాల్లో వర్షాలు పడకపోవడంతో వరి సాగుచేసే పరిస్థితులు లేవని అక్కడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీరు వినియోగం తక్కువ ఉండే ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సూచిస్తున్నాయి. బిహార్‌ ప్రభుత్వం రైతులకు కరవు సాయం అందించేందుకు యోచిస్తోంది.

తెలంగాణలో సాధారణంకన్నా చాలా ఎక్కువగా వర్షాలు పడి సాగునీరు పుష్కలంగా ఉన్నా వరి సాగు విస్తీర్ణం పెరగలేదు. గతేడాది ఇదే సమయానికి 32.82 లక్షల ఎకరాల్లో వరినాట్లు పడగా.. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ 23.91 లక్షల ఎకరాల్లోనే సాగు చేశారు. 8.91 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. గతేడాది వానాకాలం సీజన్‌లో రాష్ట్రంలో 62 లక్షల ఎకరాల్లో వరి పంట వేయగా.. ప్రస్తుతం వచ్చే నెలాఖరున సీజన్‌ ముగిసేనాటికి 42 లక్షల ఎకరాల్లో వరి సాగు కావచ్చని రాష్ట్ర వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. రాష్ట్రంలో గతేడాది రికార్డుస్థాయిలో వరి విస్తీర్ణం పెరిగినా.. ఈ సీజన్‌లో సాధారణ విస్తీర్ణం 42 లక్షల ఎకరాలే ఉంటుందని ఆరంభంలోనే వ్యవసాయశాఖ లక్ష్యాన్ని నిర్ణయించింది. ప్రోత్సాహమూ తగ్గించింది. గతంలో రైతులకు విక్రయించే వరి విత్తనాలపై క్వింటాకు రూ.వెయ్యి వరకూ రాయితీ ఇచ్చేది. ఈ సీజన్‌లో ఆ రాయితీని నిలిపివేసింది. మార్కెట్లలో అధికంగా విక్రయించే సన్నబియ్యం తెలంగాణలో వానాకాలంలోనే అధికంగా పండుతుంది. రాష్ట్రంలో రైతులను ప్రోత్సహిస్తే ఈ సీజన్‌లో సన్నాల సాగు విస్తీర్ణం పెరగవచ్చని చెబుతున్నారు.

కీలకంగా మారిన బియ్యం నిల్వలు

రేషన్‌ బియ్యం కోసం ఎఫ్‌సీఐ ఏటా వానా కాలంలో పండే పంట నుంచే దాదాపు 5.89 కోట్ల టన్నులు సేకరిస్తోంది. ప్రస్తుతం దేశంలో 5.48 కోట్ల టన్నుల బియ్యం నిల్వలున్నాయి. ఈ ఏడాది (2022-23) దేశవ్యాప్తంగా వివిధ పథకాల కింద ప్రజలకు పంపిణీకి మాత్రమే ఇవి సరిపోతాయని అంచనా. గత మార్చి నుంచి ఎండల తీవ్రత కారణంగా గోధుమ పంట దెబ్బతినడంతో ప్రస్తుతం దేశంలో బియ్యం నిల్వలు కీలకంగా మారాయి.

ధరలపై ప్రభావం

‘‘చిల్లర మార్కెట్లలో బియ్యం విక్రయ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. 2 నెలల క్రితంతో పోలిస్తే కిలో నాణ్యమైన సన్న బియ్యం ధర రూ.2 నుంచి 3 వరకూ పెరిగింది. ఇంకా పెరగవచ్చని అంచనా వేస్తున్నాం. నవంబరు నుంచి మార్కెట్లలో రైతులు అమ్మకానికి తెచ్చే ఖరీఫ్‌ సన్న వడ్లకు సైతం మంచి ధర పలికే అవకాశాలున్నాయి’’ అని హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి రాజేశ్‌, మార్కెట్‌ వర్గాలు ‘ఈనాడు’కు చెప్పాయి.

రాష్ట్రంలో ఇప్పటికీ అవకాశం..

‘‘ధాన్యాన్ని మద్దతు ధరకు కొంటారో లేదో తెలియక తెలంగాణ రైతులు వరి సాగుకు పెద్దగా ఉత్సాహం చూపలేదు. దేశవ్యాప్తంగా సాగు విస్తీర్ణం తగ్గిన నేపథ్యంలో ఇంతవరకూ నాట్లు వేయని రైతులు నేరుగా విత్తే పద్ధతిలో సాగుచేసినా పంట చేతికొస్తుంది’’ అని ఓ వ్యవసాయాధికారి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు