అంతటా ప్రచారం.. ఏదీ పథకం..!?

వ్యవసాయ బోర్లకు సౌరవిద్యుత్‌ ఏర్పాటు పథకం రాష్ట్రంలో అమలుకావడం లేదు. పీఎం కుసుమ్‌ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకూ అనుమతి ఇవ్వలేదు. వ్యవసాయ బోర్లకు తప్పక మీటర్లు పెట్టాలనే కేంద్ర సర్కారు

Published : 13 Aug 2022 05:39 IST

వ్యవసాయ బోర్లకు సౌరవిద్యుత్‌ ఏర్పాటెక్కడ
అది ఉంటే ప్రయోజనమని ఊరూరా కేంద్రం హోర్డింగులు
సౌరవిద్యుత్‌ పెట్టాలంటే బోర్లకు మీటర్లు తప్పనిసరి
అందుకు రాష్ట్ర ప్రభుత్వం తిరస్కారం

ఈనాడు, హైదరాబాద్‌: వ్యవసాయ బోర్లకు సౌరవిద్యుత్‌ ఏర్పాటు పథకం రాష్ట్రంలో అమలుకావడం లేదు. పీఎం కుసుమ్‌ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకూ అనుమతి ఇవ్వలేదు. వ్యవసాయ బోర్లకు తప్పక మీటర్లు పెట్టాలనే కేంద్ర సర్కారు నిబంధనే అనుమతి నిరాకరణకు మూలకారణమని తెలుస్తోంది. వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. మరోవైపు ‘ప్రధానమంత్రి కిసాన్‌ ఊర్జా ఏవం ఉత్థాన్‌ మహాభియాన్‌’(పీఎం కుసుమ్‌) కింద సౌరవిద్యుత్‌ ఏర్పాటుచేసుకుంటే ఎన్నో ప్రయోజనాలున్నాయని గ్రామాల్లో ప్రచార హోర్డింగులను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేస్తోంది. వాటిపై ఎక్కడా రాష్ట్ర డిస్కం లేదా టీఎస్‌ రెడ్కో చిరునామా సమాచారం లేకపోవడం గమనార్హం. రాష్ట్రప్రభుత్వం ఈ పథకం అమలుకు ఆసక్తి చూపనందున డిస్కం/రెడ్కో చిరునామా, సమాచారం ఈ హోర్డింగులపై రాయవద్దని, రాస్తే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర అధికారులు హెచ్చరించారు. అందుకనే వాటిపై కేంద్ర నూతన ఇంధన వనరుల మంత్రిత్వశాఖ(ఎంఎన్‌ఆర్‌ఈ) వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని రాశారు. ఒకవేళ.. ఆ వెబ్‌సైట్‌లో తెలిపినట్లు రైతులు దరఖాస్తు చేసుకున్నా వారి పొలాల వద్ద సౌరవిద్యుత్‌ కేంద్రాలు పెట్టడానికి, కరెంటు తీసుకోవడానికి డిస్కంలు సహకరించాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఇంతవరకూ రాష్ట్ర ప్రభుత్వమే అనుమతి ఇవ్వలేదు. సాధారణ కరెంటు లైన్ల నుంచే ఏటా 50వేలకు పైగా వ్యవసాయ బోర్లకు కనెక్షన్లు ఇస్తున్న డిస్కంలు వాటిలో ఒక్కదానికైనా సౌరవిద్యుత్‌ ఏర్పాటును ప్రోత్సహించడం లేదు. రైతులకు రోజంతా సాధారణ కరెంటునే రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్నందున సౌరవిద్యుత్‌ ఉత్పత్తిని సొంత ఖర్చుతో ఏర్పాటు చేసుకోవడానికి వారు ముందుకు రారని విద్యుత్‌సంస్థలు పీఎం కుసుమ్‌ అమలు జోలికి వెళ్లడం లేదు. కానీ, వ్యవసాయ బోర్లకు కాకుండా ప్రతీ గ్రామంలో వాటికి కరెంటు సరఫరా చేసే ట్రాన్స్‌ఫార్మర్‌ దగ్గర ఒక్కో ఫీడర్‌కు గరిష్ఠంగా 2 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యమున్న సౌరవిద్యుత్‌ కేంద్రం ఏర్పాటుకు (రాష్ట్రస్థాయిలో 500 మెగావాట్ల ఉత్పత్తికి) అవకాశముందని రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ(టీఎస్‌ రెడ్కో) అధ్యయనంలో గుర్తించింది. ఇలా రాష్ట్రస్థాయిలో 500 మెగావాట్ల ఉత్పత్తికి అనువుగా ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద సౌరవిద్యుత్‌ కేంద్రాల ఏర్పాటుకు రైతులను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి రెడ్కో తాజాగా ప్రతిపాదించింది. ఇందుకోసం సబ్‌స్టేషన్ల వారీగా వ్యవసాయ ఫీడర్లను గుర్తించాలని డిస్కంలను సైతం కోరింది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే ఆ పని చేస్తామని డిస్కంలు స్పష్టీకరించాయి. కేంద్రం పథకం అమలుచేయమంటోంది...రాష్ట్ర ప్రభుత్వం దాని అమలుకు అనుమతి ఇవ్వకపోవడంతో ప్రచార హోర్డింగుల ఏర్పాటుకు పెట్టిన ఖర్చూ వృథా అయినట్లేనని విద్యుత్‌ అధికారులే అంతర్గతంగా వ్యాఖ్యానిస్తున్నారు.

యూనిట్‌ ధర అధికమనేనా...

ఎన్టీపీసీ నుంచి యూనిట్‌ సౌరవిద్యుత్‌ను రూ.2.45కే డిస్కంలు కొంటున్నాయి. కానీ పీఎం కుసుమ్‌ కింద రైతులు సొంత వ్యవసాయ బోర్లకు లేదా ట్రాన్స్‌ఫార్మర్‌ వారీగా ఫీడర్ల వద్ద సౌరవిద్యుత్‌ కేంద్రం పెట్టుకుంటే అక్కడ ఉత్పత్తి చేసే కరెంటుకు యూనిట్‌కు రూ.3.13 చొప్పున వారికి చెల్లించాలని రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ) ఇటీవల ఉత్తర్వులిచ్చింది. ఒకవైపు ఎన్టీపీసీ, ఇతర సంస్థల నుంచి యూనిట్‌ కరెంటు రూ.2.50లోపే  లభిస్తుంటే.. పీఎం కుసుమ్‌ పేరుతో రైతుల వద్ద నుంచి రూ.3.13కి కొనమంటే అది తమకు మరింత భారమని డిస్కంలు ఆసక్తి చూపడం లేదు. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా కేంద్రం ఏదైనా పథకాన్ని నేరుగా అమలుచేయాలనుకుంటే ఎలా విఫలమవుతుందో చెప్పడానికి ‘పీఎం కుసుమ్‌’ ఉదాహరణ అని సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని