కాకులను కొట్టి గద్దలకు వేస్తారా

పేద ప్రజల నోటికాడి కూడును కూడా లాగేసే దుర్మార్గానికి మోదీ ప్రభుత్వం తెగించిందని మంత్రి కేటీఆర్‌ ఘాటుగా విమర్శించారు. ఎనిమిదేళ్ల పాలనలో సామాన్యుడి బతుకు భారం చేసిన భాజపా ఆధ్వర్యంలోని కేంద్రం.. పాలు, పెరుగు

Updated : 14 Aug 2022 06:33 IST

ఉచిత పథకాలను రద్దు చేసే దమ్ముందా?

పంద్రాగస్టు ప్రసంగంలో స్పష్టతనివ్వాలి

ప్రధానికి మంత్రి కేటీఆర్‌ లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: పేద ప్రజల నోటికాడి కూడును కూడా లాగేసే దుర్మార్గానికి మోదీ ప్రభుత్వం తెగించిందని మంత్రి కేటీఆర్‌ ఘాటుగా విమర్శించారు. ఎనిమిదేళ్ల పాలనలో సామాన్యుడి బతుకు భారం చేసిన భాజపా ఆధ్వర్యంలోని కేంద్రం.. పాలు, పెరుగు వంటి నిత్యావసరాలపైనా జీఎస్టీ వేసి పేదల రక్తాన్ని జలగలా పీల్చుకుంటోందన్నారు. కొత్తగా ఉచిత పథకాల రద్దుకు పాచిక వేస్తోందని ధ్వజమెత్తారు. కాకులను కొట్టి గద్దలకు వేయడం.. సామాన్యుడి కడుపుకొట్టి, కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చడమే మీ విధానమా? అని ప్రశ్నించారు. ‘మీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలవుతున్న అన్ని సంక్షేమ పథకాలను రద్దు చేస్తామని   ప్రకటించి ఎన్నికలకు వెళ్లగలరా? దేశంలో అమలవుతున్న సంక్షేమ పథకాలన్నీ రద్దు చేయడానికి పార్లమెంటులో చట్టం కానీ, రాజ్యాంగ సవరణ గానీ చేస్తారా’ అని నిలదీశారు. సోమవారం  ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి చేసే పంద్రాగస్టు ప్రసంగంలో పేదల సంక్షేమ పథకాలపై ప్రధాని తన వైఖరిని స్పష్టంచేయాలని కోరారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు.

సంపద పెంచాలె - పేదలకు పంచాలె అన్నది కేసీఆర్‌ నినాదం..

‘‘ఎనిమిదేళ్ల మీ పాలనలో దేశంలో పేదరికం పెచ్చుమీరింది. నైజీరియా కన్నా ఎక్కువమంది పేదలున్న దేశంగా అపకీర్తిని గడించింది. మీకు ముందున్న 14 మంది ప్రధానులు కలిసి రూ.56 లక్షల కోట్ల అప్పుచేస్తే, మీరొక్కరే చేసింది రూ.80 లక్షల కోట్లకు పైమాటే. వాటికి వడ్డీలు కట్టడానికే దేశ వార్షిక రాబడిలో 37% ఖర్చవుతోందని కాగ్‌ హెచ్చరించింది. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం జీడీపీలో 40 శాతానికి మించి అప్పులు చేయకూడదు. మీ సర్కారు ఇప్పటికే 54 శాతం అప్పులు చేసింది. ఆ డబ్బును ఏ ప్రయోజనాలకు ఖర్చుచేశారో చెప్పాలి. ఒక్క భారీ నీటిపారుదల ప్రాజెక్టు కానీ, మరేదైనా జాతీయస్థాయి నిర్మాణం కానీ చేయలేదు. పేదల కడుపునింపే ఒక్క సంక్షేమ పథకాన్నీ తీసుకురాలేదు. పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా పథకాలు పెడితే ‘ఫ్రీబీ కల్చర్‌’ అంటూ విషం చిమ్ముతున్నారు. సంపద పెంచాలె - పేదలకు పంచాలె అన్నది ముఖ్యమంత్రి కేసీఆర్‌ నినాదం. మీకు సంపద పెంచడం చేతకాదు. పేదలకు ఖర్చు చేయడానికి మనసు రాదు.

బడా బాబులకు, రైతులకు మాఫీ చేసింది ఎంతెంత?

రైతన్నకు ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను ఉచితం అనడం భావ్యమా? మీ పాలనలో బడా బాబులకు మాఫీ చేసిన/వారు ఎగ్గొట్టిన రుణాలెన్ని? రైతన్నకు మాఫీ చేసిన రుణాలెన్నో చెప్పాలి. బడుగు, బలహీనవర్గాలకు రూపాయికే కిలో బియ్యం.. విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్న భోజనం.. గర్భిణులకు ఆరోగ్యలక్ష్మి, అమ్మఒడి,    కేసీఆర్‌ కిట్‌, రూ.13,000 నగదు సహాయం.. మిషన్‌ భగీరథ, నేతన్నకు చేయూత, నేతన్నకు బీమా, బతుకమ్మ చీరలు, కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్‌, దళితబంధు పథకాలు అవసరం లేదా? గ్యాస్‌పై రాయితీ  ఎత్తివేయడంతో పాటు కరోనా మహమ్మారి సమయంలో లక్షల మంది వలస కార్మికుల ముక్కుపిండి రైలు టికెట్‌ ఛార్జీలు వసూలు చేసిన పాషాణ హృదయపు ప్రభుత్వం మీది. ప్రజా సంక్షేమంపై మీ విధానం ఏమిటో ఈ దేశ ప్రజలకు స్పష్టం చేయాలి’’ అని లేఖలో కేటీఆర్‌ పేర్కొన్నారు.


కాలిగాయం నుంచి కోలుకుంటున్న కేటీఆర్‌

గత నెల 23న ఇంట్లో జారి పడి గాయంతో చికిత్స పొందుతున్న తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ కోలుకుంటున్నారు. మూడు వారాల విశ్రాంతి ముగుస్తుండగా ఆదివారం వైద్యులు ఆయన కాలికి కట్టు విప్పి పరీక్షలు చేయనున్నారు. పూర్తిగా నయమైనట్లు ధ్రువీకరిస్తే  కేటీఆర్‌ రాత్రికి రాజన్న సిరిసిల్ల జిల్లాకు పయనమవుతారని తెలిసింది. సోమవారం అక్కడ జరిగే స్వాతంత్య్రదిన వేడుకల్లో ఆయన పాల్గొంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని