ఇంటర్‌ ఉంటేనే అంగన్‌వాడీ పోస్టు

కేంద్ర ప్రభుత్వం అంగన్‌వాడీ టీచర్‌, వర్కర్‌ పోస్టులకు విద్యార్హతను పెంచింది. ఇప్పటివరకు పదోతరగతి అర్హతగా ఈ పార్ట్‌టైమ్‌ నియామకాలు చేపడుతుండగా, ఇకపై కనీసం ఇంటర్మీడియట్‌ అ

Published : 14 Aug 2022 04:48 IST

విద్యార్హతలు పెంచిన కేంద్ర ప్రభుత్వం

కౌమార బాలికలకు పోషకాహార పథకం ప్రకటన

ఈనాడు, హైదరాబాద్‌:  కేంద్ర ప్రభుత్వం అంగన్‌వాడీ టీచర్‌, వర్కర్‌ పోస్టులకు విద్యార్హతను పెంచింది. ఇప్పటివరకు పదోతరగతి అర్హతగా ఈ పార్ట్‌టైమ్‌ నియామకాలు చేపడుతుండగా, ఇకపై కనీసం ఇంటర్మీడియట్‌ అర్హతగా నిర్ణయించింది. ఈమేరకు ‘మిషన్‌ సాక్షం అంగన్‌వాడీ, పోషణ్‌ అభియాన్‌ 2.0’ విధివిధానాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఏటా 40వేల చొప్పున అయిదేళ్లలో 2 లక్షల అంగన్‌వాడీ కేంద్రాలను ఆధునికీకరించనుంది. అలాగే అంగన్‌వాడీ నియామకాల్లో కనీస వయసు 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించడంతో పాటు గరిష్ఠ వయసు 35 ఏళ్లుగా ఖరారు చేసింది. కొత్త విధివిధానాలతో రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 5,111 టీచర్‌, ఇతర పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతినిచ్చింది. ఈ పోస్టుల్లో పనిచేసే సిబ్బందిని గౌరవ వేతన వర్కర్లుగా స్పష్టంచేసింది. అంగన్‌వాడీ సర్వీసుల్లో చేరిన మహిళలకు పదవీ విరమణ వయసు ఖరారు చేయకున్నా, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించుకోవచ్చని తెలిపింది. అయితే 65 ఏళ్ల తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ సర్వీసులో ఉండకూడదని వెల్లడించింది.

50 శాతం పదోన్నతులతో భర్తీ..

కొత్తగా చేపట్టే నియామకాల్లో 50 శాతం అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులను అయిదేళ్ల అనుభవం కలిగి, ఆయాలుగా పనిచేస్తున్న వారితో భర్తీ చేయాల్సి ఉంటుంది. సూపర్‌వైజర్‌ పోస్టుల్లో 50 శాతం పోస్టులను అయిదేళ్ల సర్వీసు ఉన్న అంగన్‌వాడీ టీచర్లతో భర్తీచేయాలి. ఈ పోస్టులకు నిర్ణయించిన విద్యార్హతలు, సర్వీసు నిబంధనల ప్రకారం నియామకాలు చేపట్టాలి. అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌, టీచర్‌, ఆయా పోస్టుల భర్తీలో రిజర్వేషన్‌ నిబంధనలు కచ్చితంగా పాటించాలి.

బాలికలకు ఇంటికే రేషన్‌

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు పౌష్ఠికాహారం, ఆరేళ్లలోపు చిన్నారులకు పోషకాహారంతో పాటు పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తోంది. కౌమార బాలికల్లో రక్త హీనత ఎక్కువగా ఉన్నట్లు ఆరోగ్య నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణతో సహా కొన్ని రాష్ట్రాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. కౌమార బాలికలకు పోషకాహారం కోసం ప్రత్యేక పథకం లేదా అదనపు సహాయం కావాలని రాష్ట్ర మహిళాశిశు సంక్షేమశాఖ కేంద్రానికి గతంలో ప్రతిపాదనలు పంపించింది. కౌమార బాలికల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు 14-18 ఏళ్ల బాలికల కోసం ప్రత్యేక పథకం ప్రవేశపెట్టింది. తొలుత ఎంపిక చేసిన జిల్లాలు, ఈశాన్య రాష్ట్రాల్లో అమలు చేయనుంది. ఏడాదికి 300 రోజుల పాటు రోజుకి రూ.9.50 చొప్పున ఇంటికే రేషన్‌ పథకం కింద పౌష్ఠికాహారం అందించనుంది. అంటే ఏడాదికి ఒక్కో బాలికకు రూ.2850 ప్రయోజనం కలగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని