తుపాకీతో గాలిలోకి మంత్రి కాల్పులు..

స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా శనివారం మహబూబ్‌నగర్‌లో చేపట్టిన ర్యాలీ ప్రారంభ సమయంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తుపాకీతో గాలిలోకి కాల్పులు జరపడం వివాదాస్పదం అయింది

Published : 14 Aug 2022 05:16 IST

తిరంగా ర్యాలీలో శ్రీనివాస్‌గౌడ్‌ తీరుపై వివాదం

ఈనాడు, హైదరాబాద్‌, ఈనాడు డిజిటల్‌, మహబూబ్‌నగర్‌, నారాయణగూడ, న్యూస్‌టుడే: స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా శనివారం మహబూబ్‌నగర్‌లో చేపట్టిన ర్యాలీ ప్రారంభ సమయంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తుపాకీతో గాలిలోకి కాల్పులు జరపడం వివాదాస్పదం అయింది. పట్టణంలోని జిల్లా పరిషత్‌ మైదానం నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు శనివారం జిల్లా కలెక్టరు వెంకట్‌రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, అధికారులు, విద్యార్థులతో భారీ ర్యాలీ చేపట్టారు. కార్యక్రమం ప్రారంభంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తుపాకితో గాలిలోకి కాల్పులు జరిపారు. ఇక్కడ ఆయన ఎస్‌ఎల్‌ఆర్‌(సెల్ఫ్‌ లోడెడ్‌ రైఫిల్‌) వాడారంటూ కాసేపట్లోనే సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. ఈ నెల 11న ఫ్రీడం రన్‌లోనూ మంత్రి ఇలాగే గాలిలోకి కాల్పులు జరిపారు.

నేను కాల్చిన గన్‌లో బుల్లెట్లు ఉండవు: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

ఈ వ్యవహారంపై మహబూబ్‌నగర్‌లో, అనంతరం హైదరాబాద్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. ర్యాలీలో తాను కాల్చిన గన్‌లో బుల్లెట్లు ఉండవని, పేల్చినప్పుడు శబ్దం మాత్రమే వస్తుందన్నారు. ‘ఆ ర్యాలీలో ప్రారంభ సూచకంగా శబ్దం కోసం గాలిలో కాల్పులు జరపాలని జిల్లా ఎస్పీ నా చేతికి తుపాకి ఇచ్చారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడా వేడుకలను ఇలా కాల్పులు జరిపే ప్రారంభిస్తారు. క్రీడల మంత్రిని కాబట్టి నాకా అర్హత ఉంది. కానీ, పోలీసుల చేతిలోని తుపాకీ లాక్కొని గాలిలో కాల్పులు జరిపానంటూ నాపై దుష్ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నా. జాతీయ, రాష్ట్ర రైఫిల్‌ అసోసియేషన్‌లలో నేనూ సభ్యుడినే, నిబంధనలు తెలుసు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు స్వాతంత్య్ర వజ్రోత్సవాలను మహబూబ్‌నగర్‌లో 25వేల మందితో ఘనంగా నిర్వహిస్తుంటే ఓర్వలేని కొందరు  సామాజిక మాధ్యమాల్లో తమపై దుష్ప్రచారం చేస్తూ నాటకాలు ఆడుతున్నారు’’ అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. తుపాకి వాడటంలో తన తప్పున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని ఆయన సవాల్‌ విసిరారు.   

మంత్రి పేల్చింది డమ్మీ బుల్లెట్‌: ఎస్పీ వెంకటేశ్వర్లు

ర్యాలీలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పేల్చింది డమ్మీ బుల్లెట్‌ అని, ప్రభుత్వ కార్యక్రమాల్లో దీన్ని వినియోగించడం ఆనవాయితీ అని మహబూబ్‌నగర్‌ జిల్లా ఎస్పీ ఆర్‌.వెంకటేశ్వర్లు శనివారం రాత్రి ఓ ప్రకటనలో స్పష్టీకరించారు. ఈ నెల 11న, శనివారం నిర్వహించిన ర్యాలీలో ఇన్సాస్‌ తుపాకితో బ్లాంక్‌ ఆమ్యునేషన్‌(డమ్మీబుల్లెట్‌)ను ఆయన పేల్చారన్నారు. ప్రభుత్వ ఉత్సవాలు, ర్యాలీలు, క్రీడల ప్రారంభ సమయాల్లో దాన్ని ఉపయోగిస్తారని, అది చట్టబద్ధమేనని ఆయన వివరించారు. గన్‌మెన్‌ తుపాకిని మంత్రి వినియోగించారన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts