మువ్వన్నెలు మురిసె.. స్వతంత్ర స్ఫూర్తి విరిసె

స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని శనివారం రాష్ట్రవ్యాప్తంగా జాతీయ జెండాలతో భారీ ర్యాలీలు నిర్వహించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్‌

Updated : 14 Aug 2022 06:01 IST

రాష్ట్రవ్యాప్తంగా వజ్రోత్సవ ర్యాలీలు

పాల్గొన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు

ఈనాడు, హైదరాబాద్‌: స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని శనివారం రాష్ట్రవ్యాప్తంగా జాతీయ జెండాలతో భారీ ర్యాలీలు నిర్వహించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్‌ సమీపంలోని అంబేడ్కర్‌ విగ్రహం నుంచి బోట్స్‌ క్లబ్‌ వరకు ర్యాలీ సాగింది.  ఇందులో ఉద్యోగులు, విద్యార్థులు, ఇతరులు త్రివర్ణ పతాకాలతో పాల్గొన్నారు. రాకెట్‌ పార్కు వద్ద గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. త్రివర్ణ బెలూన్లు ఎగురవేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సంగారెడ్డిలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని గన్‌పార్కు నుంచి లుంబినీ పార్కు వరకు నిర్వహించిన ఫ్రీడం వాక్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, సంఘం అధ్యక్షురాలు మమత, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, టీఎన్జీవో నేతలు, విద్యార్థులు పాల్గొన్నారు. హనుమకొండలో నిర్వహించిన ఫ్రీడం ర్యాలీని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ప్రారంభించారు. ఖమ్మంలో 2 కిలోమీటర్ల త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పాల్గొన్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ద్విచక్రవాహనాల ర్యాలీ నిర్వహించాయి. మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన భారీ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొన్నారు. మిర్యాలగూడలో 750 మీటర్లు, భువనగిరిలో 300 మీటర్ల జాతీయ జెండాను ప్రదర్శించారు. సిరిసిల్లలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఫ్రీడం ర్యాలీ నిర్వహించడంతో పాటు బెలూన్లను ఎగురవేశారు.

రాజ్‌భవన్‌లో..

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల(హర్‌ ఘర్‌ తిరంగా)లో భాగంగా గవర్నర్‌ తమిళిసై శనివారం   రాజ్‌భవన్‌ ఆవరణలోని తమ అధికారిక నివాస భవనంపై జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీసు దళాల గౌరవవందనం స్వీకరించారు. రాజ్‌భవన్‌ అధికారులు, సిబ్బందికి మిఠాయిలు పంచారు. ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో 150 మీటర్ల జాతీయ జెండాతో నిర్వహించిన ర్యాలీలో గవర్నర్‌ పాల్గొన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన అమృత్‌ మహోత్సవాల స్మారక పైలాన్‌ను రాజ్‌భవన్‌ ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద ఆమె ప్రారంభించారు.

* హైదరాబాద్‌లోని రాంనగర్‌లో హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ తన నివాసంపై జాతీయ జెండాను ఎగురవేశారు.

* 22న ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న ముగింపు వేడుకల ఏర్పాట్లను శనివారం వజ్రోత్సవాల కమిటీ ఛైర్మన్‌ కేశవరావు, మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తదితరులు పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని