గర్భిణులకు బతుకమ్మ కానుకగా పౌష్టికాహార కిట్లు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు బతుకమ్మ కానుకగా వచ్చే నెల నుంచి గర్భిణులకు పౌష్టికాహార(న్యూట్రిషన్‌) కిట్లు పంపిణీ చేస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు

Updated : 14 Aug 2022 05:59 IST

వచ్చే నెల నుంచి 9 జిల్లాల్లో పంపిణీ

1.50 లక్షల మందికి లబ్ధి

మంత్రి హరీశ్‌రావు వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు బతుకమ్మ కానుకగా వచ్చే నెల నుంచి గర్భిణులకు పౌష్టికాహార(న్యూట్రిషన్‌) కిట్లు పంపిణీ చేస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. అత్యధిక రక్తహీనత(ఎనీమియా) ప్రభావం ఉన్న 9 జిల్లాలు- ఆదిలాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్‌, ములుగు, నాగర్‌కర్నూల్‌, వికారాబాద్‌లలో వీటిని పంపిణీ చేస్తామన్నారు. దీని ద్వారా 1.50 లక్షల మంది గర్భిణులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు రూ.1,200 కోట్లతో 13.30 లక్షల మందికి కేసీఆర్‌ కిట్లు అందించినట్లు తెలిపారు. టీకాల పంపిణీలో కేంద్రం విఫలమైందని, బూస్టర్‌ నిల్వలు పెంచాలని లేఖ రాస్తే కాస్తంత స్పందించిందన్నారు. శనివారం హైదరాబాద్‌ కోఠిలో ఉన్న వైద్యారోగ్యశాఖ కార్యాలయాల ప్రాంగణంలోని వైద్యఆరోగ్య సేవలు, మౌలిక వసతుల సంస్థ(టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) కార్యాలయంలో కార్యక్రమ నిర్వహణ విభాగం(ప్రోగ్రాం మేనేజ్‌మెంట్‌ యూనిట్‌)ను హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘గర్భిణులకు పౌష్టికాహారం కిట్లను రెండుసార్లు అందిస్తాం. ప్రొటీన్‌, మినరల్‌, విటమిన్‌లను అందించడం ద్వారా రక్తహీనతను తగ్గించడం, హిమోగ్లోబిన్‌ శాతం పెంచడం దీని లక్ష్యం. ఒక్కో కిట్‌ విలువ దాదాపు రూ.2000 ఉంటుంది. ఇందులో పౌష్టికాహార పదార్థాల పొడి- 2 సీసాలు(ఒక్కోటి కిలో), కిలో ఖర్జూర, ఐరన్‌ సిరప్‌ 3 సీసాలు, 500 గ్రాముల నెయ్యి ఉంటాయి. రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో 5 క్యాథ్‌లాబ్‌లు, మరో 5 ఎమ్మారై, 30 సీటీ స్కాన్‌లతో పాటు రూ.5 లక్షలకు పైగా విలువైన అధునాతన యంత్ర పరికరాలు 1020 సమకూర్చాం. యంత్ర పరికరాల నిర్వహణ కోసం పీఎంయూను ప్రారంభించాం. ప్రైవేట్‌లో మాదిరిగా ప్రభుత్వాసుపత్రుల్లో యంత్రాలు పాడైతే గంటల్లోనే మరమ్మతుల కోసం ఇ-ఉపకరణ్‌ అనే వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్నాం. 88885 26666 నంబరుతో కాల్‌సెంటర్‌ ఏర్పాటు చేశాం. మందుల బడ్జెట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.500 కోట్లకు పెంచారు. అత్యవసర వినియోగానికి అన్ని ప్రభుత్వ వైద్యశాలల సూపరింటెండెంట్ల వద్ద రూ.100 కోట్లు పెడుతున్నాం. కేసీఆర్‌ కిట్లు, ప్రభుత్వ చర్యల ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 30 నుంచి 66.8 శాతానికి పెరిగాయి. రాష్ట్రంలో సిజేరియన్ల రేటు 2021 ఆగస్టులో 62 శాతం ఉండగా.. ఈ ఏడాది జులైలో 56 శాతానికి తగ్గింది. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నందున అర్హులైనవారంతా వెంటనే బూస్టర్‌ డోస్‌ తీసుకోవాలి. టీఆర్‌ఆర్‌ వైద్య కళాశాల విద్యార్థులకు సీట్లు కేటాయించాలని కేంద్రం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. మెరిట్‌ ఆధారంగా మంగళవారం లోపు సర్దుబాటు చేస్తాం. మిగిలిన రెండు కళాశాలల విద్యార్థులకు సర్దుబాటు ఉత్తర్వులు రాగానే వారికీ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తాం’’ అని వివరించారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఛైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, వైద్యశాఖ కార్యదర్శి రిజ్వి, డీఎంఈ రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని