TSRTC: ఆర్టీసీకి భారీ గి‘రాఖీ’.. రికార్డు స్థాయిలో వసూళ్లు

రోజువారీ ఆదాయం రికార్డులను తెలంగాణ ఆర్టీసీ తిరగరాసింది. రాఖీపౌర్ణమి రోజున రికార్డుస్థాయి ఆదాయాన్ని ఆర్జించింది. ఎన్నడూ లేని విధంగా ఒక్కరోజు ఆదాయం రూ.20కోట్లు దాటింది.

Updated : 14 Aug 2022 09:55 IST

ఈనాడు, హైదరాబాద్‌: రోజువారీ ఆదాయం రికార్డులను తెలంగాణ ఆర్టీసీ తిరగరాసింది. రాఖీపౌర్ణమి రోజున రికార్డుస్థాయి ఆదాయాన్ని ఆర్జించింది. ఎన్నడూ లేని విధంగా ఒక్కరోజు ఆదాయం రూ.20కోట్లు దాటింది. ఆక్యుపెన్సీలోనూ రికార్డు సృష్టించింది. సంస్థ సాధారణ రోజువారీ ఆదాయంగా రూ.15.59 కోట్ల లక్ష్యాన్ని అధికారులు నిర్దేశించారు. రకరకాల ఛార్జీల పెంపుతో ఇటీవల రోజువారీ ఆదాయం రూ.13కోట్లు దాటుతోంది. సోమవారాల్లో ఆ లక్ష్యాన్ని సునాయాసంగా అధిగమిస్తోంది. మామూలు రోజుల్లో రూ.13 నుంచి 15కోట్ల వరకు సమకూరుతుంది. తెలంగాణలో రాఖీపౌర్ణమికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఒక్క రోజులోనే ఆర్టీసీ ఆదాయం రూ.20.11కోట్లు లభించటం విశేషం. ఆర్టీసీ చరిత్రలో ఇది అపూర్వమని అధికారులూ చెబుతున్నారు. టీఎస్‌ఆర్టీసీ పరిధిలోని కరీంనగర్‌ జోన్‌లో అత్యధికంగా 8.79 కోట్లు, హైదరాబాద్‌ జోన్‌లో రూ.5.85 కోట్లు, గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ పరిధిలో రూ.5.47 కోట్ల వంతున ఆదాయం లభించింది. లక్ష్యానికి మించి రూ.4.51కోట్ల అదనపు ఆదాయాన్ని ఆర్జించింది. మొత్తం 38.77 లక్షల మంది రాకపోకలు సాగించారు. సగటు ఆక్యుపెన్సీ 86.84 శాతంగా నమోదయింది. నల్గొండ రీజియన్‌లో అత్యధికంగా 101.01 శాతం, మెదక్‌ రీజియన్‌లో 94.44 శాతం, హైదరాబాద్‌ రీజియన్‌లో అతి తక్కువగా 74.18 శాతం సగటు ఆక్యుపెన్సీ నమోదయింది. రాఖీపౌర్ణమి సందర్భంగా రికార్డుస్థాయిలో ఆదాయం ఆర్జించటంపై ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ వి.సి.సజ్జనార్‌ శుక్రవారం హర్షం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని