ఎగువన నీరు.. దిగువ కన్నీరు

వర్షాలు తగ్గుముఖం పట్టినా.. వరద తగ్గని విచిత్ర పరిస్థితి కుమురం భీం, మంచిర్యాల జిల్లాల్లో ఉంది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు అక్కడి ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు

Published : 14 Aug 2022 05:16 IST

50 వేల ఎకరాలను ముంచెత్తిన ప్రాణహిత, పెన్‌గంగ జలాలు

నష్టాలతో అల్లాడిపోతున్న అన్నదాతలు

కుమురం భీం, మంచిర్యాల జిల్లాల్లో ‘మహా’ విపత్తు

ఈనాడు డిజిటల్‌, ఆసిఫాబాద్‌-న్యూస్‌టుడే, బెజ్జూర్‌, కోటపల్లి: వర్షాలు తగ్గుముఖం పట్టినా.. వరద తగ్గని విచిత్ర పరిస్థితి కుమురం భీం, మంచిర్యాల జిల్లాల్లో ఉంది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు అక్కడి ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతుండటంతో ప్రాణహిత, పెన్‌గంగ నదులు నిండుగా ప్రవహిస్తూ.. పరీవాహక ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. ప్రాథమికంగా 50 వేల ఎకరాల్లో (కుమురం భీం జిల్లాలో 35 వేల ఎకరాలు, మంచిర్యాల జిల్లాలో 15 వేల ఎకరాలు) పంటలు మునకలో ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఇప్పటికే జులైలో కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన రైతులు.. ‘మహా’ వరద పోటుకు కుదేలవుతున్నారు. పంటలతోపాటు బావులు, మోటార్లు, పైపులు ఇతర సామగ్రి వరదలో కొట్టుకుపోవడంతో  తీవ్ర నష్టం వాటిల్లుతోంది. వరుసగా మూడో ఏడాది ఇలా పంటలు మునిగిపోయాయని అక్కడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా నష్టపరిహారం మాత్రం ఇవ్వడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. మహారాష్ట్రలోని చంద్రపుర్‌ జిల్లా ఇరయి ప్రాజెక్టు గేట్లు ఎత్తిన ప్రతిసారీ పెన్‌గంగ, ప్రాణహిత నదులు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. ఈ ఏడాదిలో జులై నుంచి ఇప్పటివరకు నాలుగుసార్లు ఇరయి ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. దీంతో మంచిర్యాల, కుమురం భీం జిల్లాల్లోని వేల ఎకరాలు వరదకు మునిగిపోతున్నాయి. దీనికితోడు వంతెనలు మునిగి పదుల సంఖ్యలో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి.

నిండా ముంచుతున్న జలాలు

కుమురం భీం జిల్లా సిర్పూర్‌(టి)లో పెన్‌గంగ, కౌటాల మండలంలో వార్ధా నదుల జలాలు సైతం అన్నదాతలను నిండా ముంచుతున్నాయి. ఈ రెండు నదుల సంగమంతో తుమ్మిడిహట్టి నుంచి ప్రాణహిత ప్రవాహం మరింత ఉద్ధృతమవుతోంది. బెజ్జూరు, చింతలమానేపల్లి, పెంచికల్‌పేట్, దహెగాం మండలాలతో పాటు, మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి, వేమనపల్లి మండలాల్లోని ప్రాణహిత పరీవాహకంలో రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పంట చేలు కూడా ప్రస్తుతం పూర్తిగా నీటిలోనే ఉన్నాయి.

జలదిగ్బంధంలో గ్రామాలు..

కుమురం భీం జిల్లా బెజ్జూర్‌ మండలంలోని తలాయి, పాపన్‌పేట్, తిక్కపల్లి, పాతసోమిని, మొగవెల్లి, ఇప్పలగూడ, భీమారం, సుశ్మీర్‌, నాగేపల్లి, బండలగూడ, టోంకిని, పారిగాం, పాతమొగవెల్లితో పాటు, మరో 13 గ్రామాలను ప్రాణహిత నది వరద చుట్టుముట్టింది. సమీప రహదారులపై వరద ప్రవహిస్తుండటంతో మూడు రోజులనుంచి రాకపోకలు స్తంభించిపోయాయి.


రెండోసారి వేసిన పంటా నీటిపాలు..

గత నెలలో కురిసిన వర్షాలకు పంట ప్రాణహిత ప్రవాహంలో కొట్టుకుపోయింది. మళ్లీ దున్ని అయిదు ఎకరాల్లో పత్తి విత్తనాలు వేశాను. పక్షం రోజుల నుంచి చేలో నీళ్లే ఉంటున్నాయి. పత్తి పంట పూర్తిగా నీటమునిగి పనికిరాకుండాపోయింది. మళ్లీ విత్తనాలు వేసే పరిస్థితీ లేదు.

- కోరితే ఎర్రయ్య, పాపన్‌పేట్, బెజ్జూర్‌


రూ.1 లక్ష నష్టపోయా..

అయిదు ఎకరాల్లో పత్తి విత్తనాలు వేశాను. జులైలో కురిసిన వర్షాలకు పంట నామరూపాల్లేకుండా కొట్టుకుపోయింది. మళ్లీ విత్తనాలు తెచ్చి వేశాను. రెండుసార్లు కలిపి రూ.లక్ష పెట్టుబడి అయ్యింది. ఎప్పుడు లేనంతగా ఈసారి పెన్‌గంగ నీళ్లు మా గ్రామం వరకు వచ్చాయి. 

- పిప్రే బాపురావు, టోంకిని, సిర్పూర్‌(టి)

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని