స్వాతంత్య్ర శతాబ్దికి భవ్య భారత్‌

వచ్చే 25 ఏళ్లలో భవ్యభారత్‌ నిర్మాణానికి యువత నడుం బిగించాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపునిచ్చారు. దేశం మనకు అన్నీ ఇచ్చిందని, అందువల్ల దాని రక్షణ, భద్రత, పురోగతి, శ్రేయస్సు

Updated : 15 Aug 2022 07:12 IST

యువత నడుం బిగించాలి

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు

ఈనాడు, దిల్లీ: వచ్చే 25 ఏళ్లలో భవ్యభారత్‌ నిర్మాణానికి యువత నడుం బిగించాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపునిచ్చారు. దేశం మనకు అన్నీ ఇచ్చిందని, అందువల్ల దాని రక్షణ, భద్రత, పురోగతి, శ్రేయస్సు కోసం శక్తివంచన లేకుండా పాటుపడతామంటూ ప్రతిజ్ఞ చేయాలని పేర్కొన్నారు. భవ్యమైన భారత్‌ను నిర్మించినప్పుడే మన మనుగడకు సార్థకత లభిస్తుందని అభిప్రాయపడ్డారు. సోమవారం స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో ఆమె ఆదివారం రాత్రి తొలిసారి జాతినుద్దేశించి ప్రసంగించారు.

‘‘75 ఏళ్లు గడవడం అంటే భారత్‌లాంటి దేశానికి ఒక రెప్పపాటులాంటిదే. వ్యక్తిగతంగా మనకు అది ఒక జీవితకాలం. ఇంతవరకు మనం నేర్చుకున్న పాఠాలు మరో మైలురాయి దిశగా జాతి ముందడుగు వేయడానికి ఉపయోగపడ్డాయి. మనం అమృతకాలంలోకి ప్రవేశించి దేశ స్వాతంత్య్ర శత వసంతోత్సవాలు జరుపుకోవడానికి పునాది వేశాయి. స్వాతంత్య్ర సమరయోధులు కన్న కలలను 2047 నాటికల్లా పూర్తిగా సాకారం చేసుకుంటాం. దినదిన ప్రవర్ధమానమవుతున్న భారత్‌ను ప్రపంచం చూసింది. కొవిడ్‌ మహమ్మారిని ఎదుర్కోవడంలో మనం స్పందించిన తీరుకు ప్రపంచవ్యాప్త అభినందనలు లభించాయి. మహమ్మారిని ఎదుర్కోవడంలో మనం సాధించిన లక్ష్యాలు అభివృద్ధి చెందిన దేశాల కంటే మెరుగ్గా ఉన్నాయి. శాస్త్రవేత్తలు, వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బందికి రుణపడి ఉన్నాం. ప్రపంచం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొని విలవిల్లాడుతున్నప్పుడు భారత్‌ మాత్రం కలిసికట్టుగా చర్యలు చేపట్టి ముందడుగు వేసింది.

వేగంగా అడుగులు వేస్తున్న ఆర్థిక వ్యవస్థ
ప్రపంచంలో వేగంగా అడుగులేస్తున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌ మారింది. అడ్డంకులను అధిగమించి మన ఆర్థిక వ్యవస్థ వికసించడానికి మన విధాన రూపకర్తలే కారణం. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో భారతదేశ పేదరికం, నిరక్షరాస్యతల దృష్ట్యా ప్రజాస్వామ్య రూపంలో ప్రభుత్వం మనగలుగుతుందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అది తప్పు అని రుజువు చేశాం. ప్రజాస్వామ్యం ఇక్కడ వేళ్లూనుకుంది, పరిఢవిల్లింది. దేశవ్యాప్తంగా అభివృద్ధి కళ కనిపిస్తోంది. వృద్ధి సమ్మిళితంగా సాగుతోంది.

ఆర్థిక సంస్కరణలతో భవిష్యత్తుకు బాటలు
ఆర్థిక సంస్కరణలు, విధాన నిర్ణయాలు దీర్ఘకాల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాయి. మేథోపరమైన ఆర్థిక వ్యవస్థకు డిజిటల్‌ ఇండియా పునాది వేసింది. సొంతింటి కల ఎంతోమందికి సాకారమైంది. ప్రజలు తమ బాధ్యతలను తెలుసుకొని దేశాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి త్రికరణ శుద్ధిగా పనిచేయాలి.

ఆడబిడ్డలే ఆశాదీపాలు
దేశమే అన్నింటికంటే ముందు అన్న స్ఫూర్తితో పనిచేసినప్పుడు దాని ఫలితం    ప్రతి నిర్ణయంలో ప్రతిఫలిస్తుంది. ప్రపంచం సరసన భారత్‌ నిలవడంలోనూ అది కనిపిస్తోంది. సామాజిక, రాజకీయ ప్రక్రియలో పెరుగుతున్న మహిళా భాగస్వామ్యం ఎన్నో విజయాలకు దారి తీసింది. ఆడబిడ్డలే దేశ ఆశా దీపాలు. ఇటీవలి కామన్వెల్త్‌ క్రీడల్లో వారు మన దేశానికి ఎన్నో కీర్తి ప్రతిష్ఠలు తీసుకొచ్చారు. అన్నిరకాల అంతర్జాతీయ పోటీల్లో భారతీయ క్రీడాకారులు అద్భుతంగా రాణిస్తూ దేశం గర్వపడేలా చేస్తున్నారు.

భిన్నత్వమే.. కానీ ఏకత్వం
యుద్ధ విమాన పైలట్ల నుంచి అంతరిక్ష   శాస్త్రవేత్తల వరకు మన ఆడబిడ్డలు ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్నారు. మన దేశం భిన్నత్వాలతో నిండింది. కానీ అందరిలో ఏదో ఒకటి ఉమ్మడిగా ఉంది. ఆ దారమే మనల్ని ఒక్కటిగా కట్టి పడేసి ‘ఏక్‌భారత్‌- శ్రేష్ఠ్‌ భారత్‌’ స్ఫూర్తితో ముందడుగు వేసేందుకు స్ఫూర్తినిస్తోంది. మాతృదేశంతో పాటు, తోటి భారతీయుల అభ్యున్నతి కోసం మనం త్యాగాలకు సిద్ధం కావాలి. 2047 కల్లా భవ్య భారత్‌ నిర్మాణానికి యువత నడుం బిగించాలని నేను ప్రత్యేకంగా పిలుపునిస్తున్నా’’ అని రాష్ట్రపతి అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని