అమృత ఘడియ

రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తూ.... భారతావని స్వతంత్ర దేశంగా రెక్కలు విప్పుకున్న వేళ... నేటి తరంలోని చాలామంది పుట్టి ఉండకపోవచ్చు! ఆ మధుర క్షణాలను

Updated : 15 Aug 2022 07:09 IST

స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ ఆసేతు హిమాచలం పులకింత

వేడుకలకు జాతి సిద్ధం

సర్వాంగ సుందరంగా ముస్తాబైన ఎర్రకోట

వరుసగా తొమ్మిదోసారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ

హీల్‌ ఇన్‌ ఇండియా, హీల్‌ బై ఇండియా ప్రాజెక్టుల ప్రకటన!

రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తూ.... భారతావని స్వతంత్ర దేశంగా రెక్కలు విప్పుకున్న వేళ... నేటి తరంలోని చాలామంది పుట్టి ఉండకపోవచ్చు! ఆ మధుర క్షణాలను అస్వాదించి ఉండకపోవచ్చు! వాటి ప్రతిరూపమైన నేటి వజ్రోత్సవమూ అందుకు ఏమాత్రం తీసిపోదు! అద్భుతమైన ఈ అమృత ఘడియల్లో... మన స్వాతంత్య్ర స్ఫూర్తికి అమరుల దీప్తికి భారతీయుల శక్తికి అవలక్షణాల నుంచి విముక్తికి సురాజ్య భానూదయానికి నవసంకల్పం తీసుకుందాం.

స్వాతంత్య్ర అమృతోత్సవాలను ఘనంగా నిర్వహించుకునేందుకు ఆసేతు హిమాచలం సిద్ధమైంది. రాజధాని దిల్లీ నుంచి మారుమూల గ్రామం దాకా వీధివీధీ జెండా పండగకు ముస్తాబయ్యాయి. పతాకావిష్కరణ కార్యక్రమాలకు కోట్లాది మంది దేశవాసులు ఘనంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సోమవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిల్లీలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ వేడుకల కోసం ఎర్రకోటను సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. ఆగస్టు 15ను పురస్కరించుకుని ఆయన ఇక్కడ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం వరుసగా ఇది తొమ్మిదోసారి. ఉగ్రవాదులు, విద్రోహశక్తుల నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. జమ్మూ-కశ్మీర్‌ సహా దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు, స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఇప్పటికే ప్రభుత్వం ‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌’ పేరుతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వేడుకలకు కొత్త శోభను తీసుకొచ్చింది. హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగస్వాములవుతూ ప్రజలు తమ నివాసాలపై మువ్వన్నెల పతాకాలను రెపరెపలాడిస్తూ మురిసిపోతున్నారు. గత రెండు స్వాతంత్య్ర దినోత్సవాలు కొవిడ్‌-19 కారణంగా ఒకింత ఆంక్షల నడుమ జరిగాయి. ఈసారి రెట్టించిన ఉత్సాహంతో జెండా పండగను జాతి యావత్తూ ఘనంగా నిర్వహించుకోనుంది. ఇప్పుడు ఆ భయాలు దాదాపు తొలగిపోయిన స్థితికి చేరుకోవడం, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో రెట్టింపు ఉత్సాహంతో వేడుకలు చేసుకునేందుకు ప్రజలు సిద్ధం అవుతున్నారు.

జాతీయ టీకాల కార్యక్రమంలో హెచ్‌పీవీ?
ప్రధాని మోదీ ప్రతి ఏడాది పంద్రాగస్టు ప్రసంగంలో అనేక కీలక అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తుంటారు. దేశాభివృద్ధికి తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, వివిధ వర్గాల కోసం చేపట్టిన కార్యక్రమాలను, త్వరలో చేపట్టబోయే పనులను వివరిస్తారు. ఈసారి 100 ఏళ్ల స్వాతంత్య్ర భారత లక్ష్యాలు, ఆత్మనిర్భర భారత్‌, దేశాభివృద్ధి, రక్షణ, ఆరోగ్యం, వ్యవసాయం, రైల్వేలు, ఇంధనం, క్రీడలు, సంక్షేమ పథకాలు, నూతన ఆవిష్కరణలు వంటి కీలక అంశాలను ప్రస్తావించే అవకాశముంది. ఈ సందర్భంగా ఆరోగ్య రంగంలో చేపట్టనున్న చర్యలను ప్రధాని వివరిస్తారని, ‘హీల్‌ ఇన్‌ ఇండియా’, ‘హీల్‌ బై ఇండియా’ ప్రాజెక్టులను ప్రకటించే అవకాశముందని భావిస్తున్నారు. అలాగే 2047 కల్లా ‘సికిల్‌ సెల్‌ డిసీజ్‌’ను నిర్మూలించడమే లక్ష్యంగా ప్రధాని రోడ్‌మ్యాప్‌ వెల్లడిస్తారని అధికారవర్గాలు వెల్లడించాయి. గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్‌ రాకుండా వేసే క్వాడ్రావలెంట్‌ హ్యూమన్‌ పాపిలోమావైరస్‌ వ్యాక్సిన్‌ (క్యూహెచ్‌పీవీ)ని జాతీయ టీకాల కార్యక్రమంలో చేర్చడం, ప్రస్తుతం ఉన్న జాతీయ ఆరోగ్య మిషన్‌ను ‘పీఎం సమగ్ర స్వాస్థ్య మిషన్‌’ కింద విస్తరించడం వంటివి ప్రధాని ప్రసంగంలో ఉండొచ్చని వివరించాయి. జిల్లాస్థాయి ఆసుపత్రుల్లో అత్యాధునిక వైద్య సంరక్షణ సామర్థ్యాలను (టెర్షియరీ కేర్‌) అభివృద్ధి చేసేందుకు జాతీయ ఆరోగ్య మిషన్‌ను విస్తరిస్తున్నారని, ఇందులో భాగంగా ప్రతి రాష్ట్రంలో 5 శాతం వనరులను ఇందుకు కేటాయిస్తారని తెలిపాయి.

* వైద్యం, వెల్‌నెస్‌ టూరిజానికి సంబంధించి భారత్‌ను ప్రపంచ కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా చేపడుతున్న హీల్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమం కింద 12 రాష్ట్రాల్లోని 37 ఆసుపత్రుల్లో వైద్య మౌలిక వసతులను పెంచుతారు. దీంతోపాటు భారత్‌లో చికిత్స చేయించుకునేందుకు వచ్చే రోగులు, వారి సహాయకుల సౌకర్యార్థం.. ప్రత్యేకంగా గుర్తించిన పది విమానాశ్రయాల్లో ప్రత్యేక డెస్కులు, బహుళ భాషా పోర్టల్‌, సరళీకృత వీసా నిబంధనలు వంటి చర్యలు చేపడతారు. వైద్య అవసరాల నిమిత్తం భారత్‌కు వస్తున్న వారిలో ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా, సార్క్‌, గల్ఫ్‌ ప్రాంతాలకు  చెందిన 44 దేశాల పౌరులు ఎక్కువగా ఉంటున్నట్లు ప్రభుత్వం గుర్తించింది.

* భారత్‌ను ఆరోగ్య సంరక్షణ రంగంలో శిక్షణ పొందిన మానవ వనరుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ‘హీల్‌ బై ఇండియా’ కార్యక్రమం చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఆరోగ్య మంత్రిత్వశాఖ ఓ ఆన్‌లైన్‌ వేదికను అభివృద్ధి చేస్తుంది. ఇందులో వైద్యులు, నర్సులు, ఫార్మసిస్టులు, ఇతర సిబ్బంది వివరాలు అందుబాటులో ఉంటాయి. విదేశాల్లోని రోగులు, దేశంలో, విదేశాల్లోని హెచ్‌ఆర్‌ నిపుణులు వారి అవసరాలకు సరిపోయే సిబ్బందిని ఈ వేదికలో వెతుక్కుని ఎంపిక చేసుకోవచ్చు.

* భారత్‌కు స్వాతంత్య్రం సిద్ధించి వందేళ్లు అయ్యే 2047 నాటికల్లా సికిల్‌ సెల్‌ డిసీజ్‌ను నిర్మూలించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ గిరిజన వ్యవహారాల శాఖ సహకారంతో రోడ్‌మ్యాప్‌ రూపొందిస్తుంది. ఇందులో భాగంగా దేశంలో రానున్న 25 ఏళ్లలో ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు 17 రాష్ట్రాల పరిధిలోని 200 జిల్లాల్లో 40 ఏళ్లలోపు వయసున్న ఏడు కోట్ల మందికి రానున్న మూడేళ్లలో పరీక్షలు నిర్వహిస్తారు.

* గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ రాకుండా తీసుకునే హ్యూమన్‌ పాపిలోమావైరస్‌ వ్యాక్సిన్‌ (క్యూహెచ్‌పీవీ)ను దేశంలోని 9 ఏళ్ల నుంచి 14 ఏళ్ల వయసున్న బాలికలకు జాతీయ టీకాల కార్యక్రమం కింద అందజేసేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రణాళిక రచిస్తోంది. ఈ కార్యక్రమానికి ఆరు నెలలు పట్టొచ్చు. దేశంలో ఏటా 1,22,844 మంది మహిళలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ సోకుతుండగా వారిలో 64,477 మంది మృత్యువాత పడుతున్నారు. హ్యూమన్‌ పాపిలోమావైరస్‌ వ్యాక్సిన్‌ (క్యూహెచ్‌పీవీ)ను భారత్‌కే చెందిన సీరం సంస్థ రూపొందించింది. ఇప్పటి వరకు ఈ టీకా కోసం మనం విదేశాలపై ఆధారపడేవాళ్లం.

భద్రత కట్టుదిట్టం..
స్వాతంత్య్ర వేడుకల నేపథ్యంలో దిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధాని మోదీ పతాకావిష్కరణ చేయనున్న ఎర్రకోట చుట్టూ 10 వేల మంది పోలీసులు, భద్రతా బలగాలను మోహరించారు. వేడుకలకు హాజరయ్యే ఏడువేల మంది కోసం బహుళ అంచెల భద్రత ఏర్పాటుచేస్తున్నారు. ఇందులో భాగంగా ముఖ కవళికలను గుర్తించే కెమెరాలు, వెయ్యి సీసీ కెమెరాలు, మొబైల్‌ కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేశారు. ఎర్రకోట చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో ‘నో కైట్‌ ఫ్లై జోన్‌’గా ప్రకటించారు. వేడుకలు జరిగే వేదిక వద్దకు ఎలాంటి గాలిపటాలు, బుడగలు, చైనా లాంతర్లు వంటివి రాకుండా చూసేందుకు ప్రత్యేకంగా 400 మంది సిబ్బందిని వ్యూహాత్మక ప్రాంతాల్లో అవసరమైన పరికరాలతో సిద్ధంగా ఉంచారు. 100 పోలీసు వాహనాలు, పీసీఆర్‌ వ్యాన్లు, తక్షణ స్పందన బృందాలను మోహరించారు. ఎర్రకోట పరిసరాల్లో షార్ప్‌ షూటర్స్‌, ఎన్‌ఎస్‌జీ స్నైపర్లు, మెరికల్లాంటి స్వాట్‌ కమాండోలు, డాగ్‌ స్క్వాడ్స్‌ను రంగంలోకి దించారు. డ్రోన్‌ దాడులను తిప్పికొట్టేందుకు యాంటీ డ్రోన్‌ వ్యవస్థ ఏర్పాటు చేశారు. 4 కిలోమీటర్ల దూరంలోని డ్రోన్‌లను గుర్తించి, నేలకూల్చేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎర్రకోట పరిసరాలు బయటకు కనిపించకుండా, ఇతరులు లోపలికి వెళ్లకుండా చర్యలు చేపట్టారు. ఎర్రకోట చుట్టూ ఉన్న 8 మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి సోమవారం ఉదయం 10 గంటల వరకు సెంట్రల్‌ దిల్లీలో ఆంక్షలు అమల్లో ఉంటాయి. పారా గ్లైడింగ్‌, హాట్‌ ఎయిర్‌ బెలూన్‌, రిమోట్‌ పైలట్‌ ఎయిర్‌ క్రాప్ట్‌లపై మంగళవారం వరకు నిషేధం విధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని