‘డిగ్రీ’ పెరిగిన కళాశాలలు

సంప్రదాయ డిగ్రీ కోర్సులుగా పేరుపొందిన బీఏ, బీకాం, బీఎస్‌సీ విద్యార్థుల కోసమూ ఐటీ కంపెనీలు క్యూ కడుతున్నాయి. నాణ్యమైన విద్య అందించే పలు డిగ్రీ కళాశాలల్లో ప్రాంగణ నియామకాలు చేపడుతున్నాయి. బిజినెస్‌ ప్రాసెస్‌ కోసం కొన్ని ఐటీ కంపెనీలు

Updated : 15 Aug 2022 09:46 IST

ప్రాంగణ నియామకాలకు క్యూ కడుతున్న ఐటీ కంపెనీలు

బీకాం విద్యార్థులకు భారీ డిమాండ్‌ 

రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వార్షిక ప్యాకేజీ

ఈనాడు - హైదరాబాద్‌

సంప్రదాయ డిగ్రీ కోర్సులుగా పేరుపొందిన బీఏ, బీకాం, బీఎస్‌సీ విద్యార్థుల కోసమూ ఐటీ కంపెనీలు క్యూ కడుతున్నాయి. నాణ్యమైన విద్య అందించే పలు డిగ్రీ కళాశాలల్లో ప్రాంగణ నియామకాలు చేపడుతున్నాయి. బిజినెస్‌ ప్రాసెస్‌ కోసం కొన్ని ఐటీ కంపెనీలు నాన్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులను కొలువుల్లో నియమించుకునే ప్రక్రియ పదేళ్ల క్రితమే మొదలైనా గత రెండు మూడు సంవత్సరాల నుంచి వారికి కొలువులు మరింత పెరిగాయి.

హైదరాబాద్‌లో అధికం...

సంప్రదాయ డిగ్రీ కాకుండా ఇప్పుడు నాన్‌ ఇంజినీరింగ్‌గా పిలుస్తున్నారు. రాష్ట్రంలో 1100 వరకు ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలు ఉండగా...హైదరాబాద్‌లోనే ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలు 300 వరకు ఉన్నాయి. వాటిల్లో కనీసం 100 కళాశాలల్లో ప్రాంగణ నియామకాలు జరుగుతున్నాయి. వాటికి ఫార్మా, బ్యాంకింగ్‌, రిటైల్‌ మార్కెటింగ్‌ కంపెనీలతోపాటు టీసీఎస్‌, కాగ్నిజెంట్‌, విప్రో, సీజీఎల్‌, ఇన్పోసిస్‌ తదితర కంపెనీలు వచ్చి విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. వార్షిక వేతనం రూ.2 లక్షల నుంచి గరిష్ఠంగా కొన్ని చోట్ల రూ.5 లక్షల వరకు ఇస్తున్నాయి. ఏడాదికి సుమారు 10 వేల మందిని ఐటీ కంపెనీలు, మరో 15 వేల మందిని ఇతర రంగాలకు చెందిన కంపెనీలు నియమించుకుంటున్నాయని అంచనా.

ప్లేస్‌మెంట్‌ అధికారుల నియామకం

తమ కళాశాలలో 90 శాతం మంది ప్రాంగణ నియామకాల్లో ఎంపికవుతున్నారని, ముఖ్యంగా కామర్స్‌ విద్యార్థులకు విపరీతంగా డిమాండ్‌ పెరిగిందని లయోలా అకాడమీ కామర్స్‌ డీన్‌ డాక్టర్‌ వీరాస్వామి చెప్పారు. ‘కనీసం రూ.20 వేలకు తగ్గకుండా వేతనం ఉంటే చేరుతున్నారు...లేకుంటే ఉన్నత విద్యకు వెళుతున్నారు’ అని సిటీ కళాశాల సహాయ ఆచార్యురాలు డాక్టర్‌ నీరజ చెప్పారు. ఇంజినీరింగ్‌ కళాశాలల తరహాలో మేం కూడా ప్లేస్‌మెంట్‌ అధికారులను నియమించుకొని విద్యార్థులకు అవసరమైన శిక్షణ ఇస్తున్నాం అని రాష్ట్ర డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాల సంఘం ప్రధాన కార్యదర్శి పరమేశ్వర్‌ తెలిపారు. నాన్‌ ఇంజినీరింగ్‌కూ ఐటీ కంపెనీల్లో మంచి అవకాశాలున్నాయని టీసీఎస్‌ ఉపాధ్యక్షుడు రాజన్న పేర్కొన్నారు.


సమీప భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు

ఈ విద్యా సంవత్సరం బీఎస్‌సీ ఏఐ అండ్‌ ఎంఎల్‌ లాంటి డిమాండ్‌ ఉన్న కోర్సులను ప్రవేశపెట్టాం. ఫలితంగా సమీప భవిష్యత్తులో బీటెక్‌కు డిగ్రీ ఏమాత్రం తీసిపోని రీతిలో ఉద్యోగావకాశాలు రానున్నాయి.

- ఆచార్య ఆర్‌.లింబాద్రి, ఛైర్మన్‌, రాష్ట్ర ఉన్నత విద్యామండలి


అనుభవం వస్తే వేతనం పెరుగుతుంది

నేను హైదరాబాద్‌లోని జాహ్నవి కళాశాలలో బీకాం జనరల్‌ చదివాను. ప్రాంగణ నియామకాల్లో నేను జెన్‌ప్యాక్ట్‌ సంస్థలో ఉద్యోగానికి ఎంపికయ్యాను. ఏడాదికి రూ.2 లక్షల వేతనం. ఒకటీ రెండేళ్లు అనుభవం వస్తే వేతనం బాగా పెరుగుతుంది.

- రూకేష్‌, బీకాం విద్యార్థి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని