పరిషోధనలు!

ఉన్నత విద్యాసంస్థలు ఉత్తమంగా నిలవడానికి.. పరిశోధనలే గుండెకాయలు. నాణ్యమైన బోధనకు తోడు ఎంత ఎక్కువగా పరిశోధనలు నిర్వహిస్తే.. అంతస్థాయిలో ఆ సంస్థలకు గుర్తింపు వస్తుంది. ప్రస్తుత పోటీప్రపంచంలోనూ

Published : 15 Aug 2022 06:25 IST

 విశ్వవిద్యాలయాల్లో ప్రహసనంగా రీసెర్చిలు!

నిధుల లేమి.. ఆచార్యుల పోస్టుల ఖాళీ..

సమస్యలు పరిష్కరిస్తేనే భావి సమాజానికి మేలు

ఈనాడు, హైదరాబాద్‌: ఉన్నత విద్యాసంస్థలు ఉత్తమంగా నిలవడానికి.. పరిశోధనలే గుండెకాయలు. నాణ్యమైన బోధనకు తోడు ఎంత ఎక్కువగా పరిశోధనలు నిర్వహిస్తే.. అంతస్థాయిలో ఆ సంస్థలకు గుర్తింపు వస్తుంది. ప్రస్తుత పోటీప్రపంచంలోనూ అత్యుత్తమైనవిగా వాటికి చోటు లభిస్తుంది. అయితే, తెలుగు రాష్ట్రాల్లోని పలు విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు ప్రహసనంగా మారుతున్నాయి. శాస్త్రవిజ్ఞానానికి సంబంధించిన పరిశోధన పత్రాల ప్రచురణలో ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన నేచర్‌ జర్నల్‌.. ఇటీవల వెలువరించిన నివేదిక ఇదే అంశాన్ని స్పష్టం చేస్తోంది.

గతేడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది మార్చి మధ్య ప్రచురితమైన పరిశోధన పత్రాలను ‘నేచర్‌’ విడుదల చేసింది. అయితే పరిశోధనల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విశ్వవిద్యాలయాలు రాణించలేకపోయాయని ఆ జర్నల్‌ ద్వారా తేటతెల్లమైంది. ఆ జర్నల్‌ను ‘ఈనాడు’ పరిశీలించగా.. కొన్ని విశ్వవిద్యాలయాల నుంచి కేవలం ఒకటి, రెండు పరిశోధన పత్రాలే ప్రచురితమయ్యాయి. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ), ఐఐటీ హైదరాబాద్‌ మినహా.. మిగిలిన వర్సిటీల నుంచి చెప్పుకోదగ్గ స్థాయిలో పరిశోధనలు సాగలేదని స్పష్టమైంది. ఓయూ నుంచి ఒక్క పరిశోధన పత్రం కూడా ఇందులో ప్రచురితమవకపోవడం గమనార్హం.

ఎందుకీ పరిస్థితి..

పీహెచ్‌డీ నోటిఫికేషన్లు వెలువడక పరిశోధక విద్యార్థులకు ప్రవేశాలు కరవవుతున్నాయి. దీనికి తోడు వర్సిటీల్లో 70 నుంచి 80 శాతం ఆచార్య పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒప్పంద అధ్యాపకులు ఉన్నా.. వారికి రీసెర్చిల్లో భాగస్వామ్యం లేదు. దీంతో పరిశోధనలు ముందుకు సాగడంలేదు. పరిశోధనలకు వర్సిటీల బడ్జెట్‌లో 10-15 శాతం నిధులు కూడా కేటాయించడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. ఇవి రీసెర్చిలపై తీవ్రప్రభావం చూపుతున్నాయి. విశ్వవిద్యాలయాల్లో ఖాళీలను భర్తీ చేస్తూ నిధులను కేటాయిస్తేనే భావి సమాజానికి మేలుచేకూర్చే పరిశోధనలు ముందుకు సాగుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాంకేతిక విశ్వవిద్యాలయాల్లో సైన్స్‌ కంటే ఇంజినీరింగ్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని, ఆయా రంగాల్లో జరిగే పరిశోధనలు ఇతర ప్రముఖ జర్నల్స్‌లో ప్రచురితమవుతున్నాయని జేఎన్‌టీయూ ఆర్‌ అండ్‌ డీ సంచాలకుడు ప్రొ.కె.విజయకుమార్‌రెడ్డి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని