Updated : 16 Aug 2022 10:05 IST

Tamilisai: అరగంట ఎదురుచూశాం.. కేసీఆర్‌ ఎందుకు రాలేదో తెలియదు: గవర్నర్‌ తమిళిసై

ఎట్‌హోం కార్యక్రమంపై గవర్నర్‌ తమిళిసై

ఈనాడు, హైదరాబాద్‌: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం రాజ్‌భవన్‌లో ఎట్‌హోం కార్యక్రమానికి రావాలని ఆహ్వానిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యక్తిగతంగా లేఖ రాశానని, ఆయన ఎందుకు హాజరుకాలేదో తనకు తెలియదని గవర్నర్‌ తమిళిసై తెలిపారు. సీఎం సాయంత్రం 6.55 గంటలకు వస్తారని తొలుత ఆయన కార్యాలయం తెలిపిందని, రాకపోవడంపై మాత్రం ఎలాంటి సమాచారం లేదన్నారు. ముఖ్యమంత్రి కోసం తాను, హైకోర్టు సీజే అరగంట పాటు ఎదురుచూశామన్నారు. అతిథులంతా ఎదురుచూస్తుండడంతో ఆ తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించామని గవర్నర్‌ విలేకరులకు తెలిపారు. తేనీటి విందుకు హాజరైన వారికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

గవర్నర్‌ పుదుచ్చేరి నుంచి సాయంత్రం ఆరు గంటలకు రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ దంపతులు అప్పటికే వచ్చేశారు. సీఎం కోసం 7.20 గంటల వరకు ఎదురు చూశారు. ఆయన రాకపోవడంతో గవర్నర్‌ తేనీటివిందును ప్రారంభించారు. గవర్నర్‌ భర్త సౌందరరాజన్‌, మహారాష్ట్ర, తమిళనాడుల మాజీ గవర్నర్లు చెన్నమనేని విద్యాసాగర్‌రావు, పీఎస్‌ రామ్మోహన్‌రావు, ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ హాజరయ్యారు. భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, తెరాస ఎమ్మెల్సీ ఎల్‌.రమణ, మాజీ ఎంపీలు వివేక్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, కిన్నెరమెట్ల కళాకారుడు దర్శనం మొగులయ్య, హైదరాబాద్‌ సీపీ ఆనంద్‌, రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌, స్వాతంత్య్ర సమరయోధులు, నేతలు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరూ హాజరుకాలేదు. కాంగ్రెస్‌, ఇతర పార్టీల నేతలెవరూ కూడా కనిపించలేదు.

విద్యార్థులకు బహుమతులు

ఆజాదీకా అమృత్‌ మహోత్సవాలను పురస్కరించుకొని రాజ్‌భవన్‌ నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలైన 75 మందికి గవర్నర్‌ సోమవారం రాత్రి ప్రశంసాపత్రాలతో పాటు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు తాను అండగా ఉంటానని తెలిపారు. బాసరలో ట్రిపుల్‌ఐటీ సమస్యలు ఒక్కొక్కటే పరిష్కారమవుతాయని చెప్పారు. ఈ సమస్యలపై సీఎం కేసీఆర్‌కు లేఖ రాశానని చెప్పారు. విద్యార్థులు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలనేది తన ఉద్దేశమని చెప్పారు.

చివరి క్షణంలో రద్దు

సోమవారం రాత్రి ఏడు గంటలకు ఎట్‌హోం కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరవుతారని సీఎం కార్యాలయం మీడియాకు సమాచారం ఇచ్చింది. ఆయన పర్యటన మేరకు పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు కూడా చేశారు. కానీ చివరి నిమిషంలో సీఎం రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా రాజ్‌భవన్‌లో తేనీటి విందులను గవర్నర్‌ నిర్వహించడం ఆనవాయితీ. తమిళిసై గవర్నర్‌ అయ్యాక 2020 జనవరి 26న జరిగిన విందుకు సీఎం హాజరయ్యారు. ఆ తర్వాత ఈ విందులకు వెళ్లలేదు. గత జూన్‌లో హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్‌భూయాన్‌ ప్రమాణస్వీకారానికి మాత్రమే కేసీఆర్‌ రాజ్‌భవన్‌కు వెళ్లారు.


Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని