Bhadrachalam: రాములోరి భూమిలో భారీ ఆక్రమణకు ప్రయత్నం

భద్రాచలం రాముడి భూముల్లో ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. ఇటీవల ఇక్కడి భూమిలో ఓ వ్యక్తి ఏకంగా పక్కా భవనం నిర్మించుకున్న విషయం వెలుగుచూసింది. రెండు రోజుల కిందట కొందరు గిరిజనులు పాకలు నిర్మించుకొని ఆ స్థలాన్ని

Updated : 16 Aug 2022 10:35 IST

ఏపీ-తెలంగాణ సరిహద్దులో ఉద్రిక్తత

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం రాముడి భూముల్లో ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. ఇటీవల ఇక్కడి భూమిలో ఓ వ్యక్తి ఏకంగా పక్కా భవనం నిర్మించుకున్న విషయం వెలుగుచూసింది. రెండు రోజుల కిందట కొందరు గిరిజనులు పాకలు నిర్మించుకొని ఆ స్థలాన్ని తమకు కేటాయించాలని కోరారు. తాజాగా సోమవారం తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు ప్రాంతాల వాసులు వందల మంది భూ ఆక్రమణకు ప్రయత్నించడం సంచలనమైంది. వివరాలు.. భద్రాచలం రామాలయానికి 900 ఎకరాల భూమి.. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది. ఇక్కడి 15 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర విభజనకు ముందు రామాయణ థీమ్‌ పార్కు కోసం దేవాదాయ శాఖ కేటాయించింది. అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో రూ.50కోట్ల విలువైన ఈ స్థలం ఖాళీగా ఉంది. ఇందులో ఇళ్లను నిర్మించుకోవాలనే ఉద్దేశంతో పిల్లలు, మహిళలు, వృద్ధులు వందల మంది సోమవారం దండుగా కదిలివచ్చారు. ఈ జాగా ఏపీలో ఉన్నా భద్రాచలం పట్టణానికి ఆనుకుని ఉండడంతో సరిహద్దు ప్రాంతాలవారు నచ్చిన ప్రాంతాన్ని సొంతం చేసుకునేందుకు ప్రయత్నించారు. తలా 5 నుంచి 10 సెంట్ల వరకు ఆపుకొని అక్కడే పొద్దుపోయే వరకు ఉన్నారు. నిరుపేదలమని, ఖాళీగా ఉన్న దేవుడి భూమిని తమకు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఇందులో భద్రాచలంలోని పలు కాలనీల వారితో పాటు ఏపీలోని ఎటపాక మండలం వాసులు కూడా ఉన్నారు. రామాలయం ఈవో శివాజీ ఈ సమాచారాన్ని ఎటపాక పోలీసులకు, రెవెన్యూ అధికారులకు తెలియజేసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దేవుడి భూమిలో ఆక్రమణలు తగవని, ఖాళీ చేయాలని అక్కడ ఉన్నవారికి వివరించారు. పొద్దు పోయిందని మంగళవారం దీని గురించి మాట్లాడదామని మైకుల్లో పోలీసులు చెప్పినా ఆక్రమణదారులు అక్కడ నుంచి కదలలేదు. ఎటపాక పోలీసుల సాయంతో ఆక్రమణదారులను తొలగించే చర్యలు చేపట్టినా రాత్రి 9 వరకు పరిస్థితిలో మార్పు రాలేదు. కేసు నమోదు కాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని