Published : 16 Aug 2022 06:17 IST

ఆందోళన రేకెత్తిస్తున్న రాజకీయ హత్యలు

రెండు రోజుల్లో రెండు ఘటనలు

కట్టడి దిశగా పోలీసుల కసరత్తు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో రెండు రోజుల వ్యవధిలో జరిగిన రెండు రాజకీయ హత్యలు కలకలం రేపుతున్నాయి. గత కొన్ని సంవత్సరాల్లో తెలంగాణలో రాజకీయ హత్యలు లేవు. ఉన్నట్టుండి ఒకేసారి.. స్థానికంగా నెలకొన్న స్పర్థలు హత్యలకు దారి తీయడంతో పోలీసులు ప్రత్యేక దృష్టిసారించారు. ఇలాంటి ఘటనలు గ్రామాల్లో వర్గవిబేధాలను మరింత పెంచే ప్రమాదం ఉందని, ఎన్నికలూ సమీపిస్తున్న నేపథ్యంలో.. ఆదిలోనే కట్టడి చేయాలని భావిస్తున్నారు. 

గత శనివారం నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో విజయ్‌రెడ్డిని దుండగులు హత్య చేసిన సంగతి తెలిసిందే. ఆయన భార్య అధికార పార్టీ తరఫున సర్పంచిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న కారణంగా విజయ్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. న్యాయవాది అయిన విజయ్‌రెడ్డి రాజకీయంగా చురుగ్గా ఉండేవారు. ఈ పరిస్థితుల్లో అనూహ్యంగా శనివారం హత్యకు గురవడం చర్చనీయాంశంగా మారింది. ఇది మరుగున పడకముందే సోమవారం మధ్యాహ్నం ఖమ్మం రూరల్‌ మండలం పరిధిలోని తెల్దారుపల్లిలో తెరాస నేత తమ్మినేని కృష్ణయ్యను దుండగులు దారుణంగా హత్య చేశారు. తొలుత సీపీఎం పార్టీలో ఉన్న కృష్ణయ్య.. మూడేళ్లుగా అధికార పార్టీ తరఫున కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇది గిట్టని ప్రత్యర్థులే కృష్ణయ్యను హత్య చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా ఎంత ఉద్రిక్త పరిస్థితులున్నా.. ఈ మధ్యకాలంలో హత్యలకు దారితీసిన ఉదంతాలు లేవనే చెప్పాలి. ముఖ్యంగా గ్రామస్థాయిలో ఎన్నికలప్పుడు ఘర్షణలు చెలరేగినా ఆ తర్వాత చల్లబడేవి. గత ఏడాది రాష్ట్రంలో మొత్తం 838 హత్యలు జరగ్గా.. వాటిలో అత్యధికంగా 401 హత్యలకు కుటుంబ కలహాలే కారణం. భూవివాదాల కారణంగా 146 హత్యలు జరిగాయి. ఇందులో రాజకీయ కారణాలతో జరిగినవి లేవనే చెప్పాలి.

తాజా రాజకీయ హత్యల నేపథ్యంలో గ్రామాల్లో వర్గవిభేదాలు ముదిరి ఎక్కడకు దారితీస్తాయోనని ఆయా గ్రామస్థులు, పోలీసులు ఆందోళన చెందుతున్నారు. కృష్ణయ్య హత్య తర్వాత ఆయన అనుచరులు గ్రామంలోని ప్రత్యర్థుల ఆస్తులను ధ్వంసం చేయడమే ఇందుకు నిదర్శనం. రాష్ట్రంలో చాలాచోట్ల రాజకీయంగా వైరి వర్గాల మధ్య ఆధిపత్య ధోరణి కనిపిస్తోంది. ఇదిమరిన్ని అనర్థాలకు దారితీయకుండా చూడటంపై పోలీసులు దృష్టిపెట్టారు. కృష్ణయ్య హత్య జరిగిన వెంటనే ఉన్నతాధికారులు ఖమ్మం ఎస్పీతో మాట్లాడారు. ఇతర ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని