Published : 18 Aug 2022 05:36 IST

ఘనంగా స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు..

22న ఎల్‌బీ స్టేడియంలో భారీ సభ
కమిటీ ఛైర్మన్‌ కేశవరావు

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో ఈ నెల 22న భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తామని ఉత్సవాల కమిటీ ఛైర్మన్‌, ఎంపీ కేశవరావు వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ వేడుకల్లో స్వాతంత్య్ర పోరాటం, దేశభక్తి, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు వెల్లివిరిసేలా కార్యక్రమాలుంటాయని తెలిపారు. అన్ని జిల్లాల నుంచి ప్రజలు హాజరవుతారని ఆయన పేర్కొన్నారు. బీఆర్కే భవన్‌లో బుధవారం కేకే అధ్యక్షతన వజ్రోత్సవాల కమిటీ ముగింపు కార్యక్రమాలపై సమావేశం జరిగింది. మంత్రులు తలసాని, శ్రీనివాస్‌గౌడ్‌, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, విప్‌ ప్రభాకర్‌రావు, ‘సాంస్కృతిక సారథి’ ఛైర్మన్‌ రసమయి బాల కిషన్‌, సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌, హైదరాబాద్‌ మేయర్‌ విజయలక్ష్మి సహా పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడారు. ‘సీఎం కేసీఆర్‌ నిర్ణయం మేరకు ఈ నెల 8వ తేదీ నుంచి నిర్వహిస్తున్న స్వాతంత్య్ర వజ్రోత్సవాలకు అద్భుత స్పందన లభించింది. 21న పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం ఉంటుంది. 22న ఎల్‌బీ స్టేడియంలో జరిగే ముగింపు ఉత్సవాల్లో ప్రముఖ సినీ గాయకుడు శంకర్‌ మహదేవన్‌ గానం, శివమణి డ్రమ్స్‌, దీపికారెడ్డి బృందం నృత్యం, తెలంగాణ జానపద కళారూపాలు, లేజర్‌ షో వంటి ప్రదర్శనలుంటాయి. పెద్దఎత్తున బాణసంచాను కాలుస్తారు’ అని కేశవరావు వివరించారు.

21న వజ్రోత్సవ హరితహారం

వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 21న ప్రత్యేకంగా తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు.  రాష్ట్రవ్యాప్తంగా సామూహికంగా ఈ కార్యక్రమం చేపట్టనున్నామని.. ప్రజాప్రతినిధులు, అధికారులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ అంశంపై బుధవారం ఆయన హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అటవీశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పట్టణాలు, పల్లెల్లోని సామూహిక ప్రాంతాలు, ఖాళీ స్థలాలు, చెరువులు, సాగునీటి ప్రాజెక్టుల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సంరక్షణకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. హరితహారంలో ఇప్పటివరకు 264 కోట్ల మొక్కలు నాటినట్లు వివరించారు. ఈ ఏడాది ఎనిమిదో విడత హరితహారం లక్ష్యంగా 19.54 కోట్ల మొక్కలు నాటాల్సి ఉందని అటవీ అధికారులు పేర్కొన్నారు. సమావేశంలో అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని