బతుకమ్మ చీరలు పంపిణీకి సిద్ధం

రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ కానుకగా ఉచితంగా ఇస్తున్న కోటి చీరల పంపిణీకి రంగం సిద్ధమవుతోంది. వచ్చే నెల 17 నుంచి వీటిని అన్ని గ్రామాల్లో, వార్డుల్లో లబ్ధిదారులకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా

Published : 18 Aug 2022 05:35 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ కానుకగా ఉచితంగా ఇస్తున్న కోటి చీరల పంపిణీకి రంగం సిద్ధమవుతోంది. వచ్చే నెల 17 నుంచి వీటిని అన్ని గ్రామాల్లో, వార్డుల్లో లబ్ధిదారులకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా 1.10 కోట్ల చీరలను ఈ నెల 22 నుంచి జిల్లాలకు చేరవేసేందుకు రాష్ట్ర చేనేత సహకార సంస్థ సన్నాహాలు ప్రారంభించింది. తెలంగాణ మహిళల పండుగైన బతుకమ్మ సందర్భంగా చీరల పంపిణీని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ ఏడాది పథకానికి రూ.333 కోట్లు కేటాయించింది. గతంలోకంటే వేగంగా ఈ ఏడాది పంపిణీ చేపట్టేందుకు జనవరిలోనే తయారీని ప్రారంభించింది. ప్రతి నెలా పది లక్షల చొప్పున ఇప్పటివరకు 90 లక్షల చీరలను తయారు చేశారు. మరో నాలుగురోజుల్లో 20 లక్షల చీరలు ఉత్పత్తి కానున్నాయి. సిరిసిల్లలోని 16 వేల మంది నేత కార్మికులకు పనులను అప్పగించింది. ఈసారి సరికొత్తగా 17 రంగులు, 17 డిజైన్లతో కలిపి మొత్తం 289 వర్ణాలతో రూపొందించారు. ఈ సారి చీరల ప్రత్యేకత డాబీ అంచు ఉండటం. సిద్ధమైనవాటిని ఈ నెల నాలుగో వారం నుంచి జిల్లాలకు సరఫరా చేస్తారు. వచ్చే నెల 25 నుంచి బతుకమ్మ పండుగ ఉంది. అంతకంటే నాలుగు రోజుల ముందే పంపిణీని పూర్తి చేయాలని ఆదేశించింది. గతంలో మాదిరిగానే 18 ఏళ్లు దాటిన నిరుపేద మహిళలకు వీటిని పంపిణీ చేస్తారు.

15012  కేంద్రాల ద్వారా...

ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దీంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, పురపాలక వార్డులు, నగరపాలక డివిజన్ల వారిగా రేషన్‌ షాపులకు సమీపంలో మొత్తం 15012 పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. గ్రామాల్లో రేషన్‌ డీలరు, పంచాయతీ కార్యదర్శి, మహిళా సంఘం ప్రతినిధులతో కూడిన కమిటీలు, నగరాలు, పట్టణాల్లో రేషన్‌ డీలరు, పురపాలక బిల్‌ కలెక్టర్‌, మహిళా సంఘం ప్రతినిధులతో కూడిన కమిటీల ఆధ్వర్యంలో పంపిణీ జరుగుతాయి.

గోదాముల్లో ప్రత్యేక జాగ్రత్తలు

గత సంవత్సరం వరంగల్‌ జిల్లాలోని టెస్కో గోదాములో అగ్ని ప్రమాదం జరిగింది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ముందుజాగ్రత్తగా అన్ని గోదాముల్లో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించింది. మండలస్థాయి గోదాముల వద్ద సైతం జాగ్రత్తగా ఉండాలని నిర్దేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని