11 జంక్షన్లకు ఆమోదం!

హైదరాబాద్‌ అవుటర్‌ రింగు రోడ్డు అవతల నుంచి నిర్మించనున్న ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) తొలిభాగంలో పదకొండు చోట్ల జంక్షన్లను నిర్మించడానికి జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ సూత్రప్రాయ ఆమోదాన్ని తెలిపినట్లు సమాచారం.

Updated : 19 Aug 2022 08:08 IST

ఆర్‌ఆర్‌ఆర్‌ తొలి భాగంలో నిర్మించేందుకు సూత్రప్రాయ అంగీకారం

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ అవుటర్‌ రింగు రోడ్డు అవతల నుంచి నిర్మించనున్న ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) తొలిభాగంలో పదకొండు చోట్ల జంక్షన్లను నిర్మించడానికి జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ సూత్రప్రాయ ఆమోదాన్ని తెలిపినట్లు సమాచారం. జంక్షన్లకు సంబంధించి మూడు నెలల కిందట కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా.. వాటిని పరిశీలించి స్వల్ప మార్పులను సూచించింది. ఈ మేరకు మరోదఫా ప్రతిపాదనలు పంపారు. వాటి అధ్యయన ప్రక్రియ సాగుతోంది. కేంద్రం సూత్రప్రాయంగా పదకొండు ప్రాంతాలకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. 344 కిలోమీటర్ల ప్రాంతీయ రింగురోడ్డులో ఉత్తర భాగానికి కేంద్రం రెండున్నరేళ్ల కిందట ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. సంగారెడ్డి, నర్సాపూర్‌, తూప్రాన్‌, గజ్వేల్‌, జగ్‌దేవ్‌పూర్‌, భువనగిరి, చౌటుప్పల్‌ మీదుగా 158.65 కిలోమీటర్ల మేర తొలిదశలో చేపట్టనున్నారు. దక్షిణ భాగానికి సంబంధించి రెండు దఫాలు ట్రాఫిక్‌ రద్దీ అధ్యయనం చేసినప్పటికీ ఈ మార్గంపై కేంద్ర నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఈ మార్గానికి జాతీయ రహదారి నంబరు కేటాయిస్తేనే సవివర నివేదికకు రంగం సిద్ధం అవుతుంది. ఉత్తర భాగం ఏయే ప్రాంతాల మీదుగా వెళుతుందన్నది గుర్తించేందుకు ఇప్పటికే పెగ్‌ మార్కింగ్‌ చేశారు. భూ సేకరణ కోసం త్వరలో పూర్తిస్థాయి సర్వే నిర్వహించాల్సి ఉంది. ఉత్తర భాగం కోసం సుమారు నాలుగు వేల ఎకరాల వరకు భూ సేకరణ చేయాల్సి ఉంది. భూసేకరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సమానంగా ఖర్చు చేయనున్నాయి. రహదారి నిర్మాణ వ్యయాన్ని భారతమాల పథకం కింద కేంద్రమే పూర్తిగా భరించనుంది.

11 జంక్షన్లు... 780 ఎకరాలు

ఉత్తర భాగంలో 11 జంక్షన్లు నిర్మించేందుకు సుమారు 780 ఎకరాల వరకు భూ సేకరణ చేపట్టాల్సి ఉంటుందని గుర్తించారు. జంక్షన్లకు సంబంధించిన ప్లాన్లకు ఆమోదం లభించిన తరవాత ఎంత మేరకు భూ సేకరణ చేయాలో ఖరారు కానున్నట్లు సమాచారం. గిర్మాపూర్‌, శివంపేట, పెద్దచింతకుంట, ఇస్లాంపూర్‌, నెంటూరు, ప్రజ్ఞాపూర్‌, పీర్లపల్లి, దత్తాయిపల్లి, రాయిగిరి, రెండ్లరేపాక, చౌటుప్పల్‌లలో జంక్షన్లు రానున్నట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని