మెట్రోకు ప్రత్యామ్నాయం నియో

‘నగరాల సమీపంలో వేగంగా జరుగుతున్న విస్తరణతో మున్ముందు వలసలు మరింత పెరుగుతాయి. జనాభాకు తగ్గట్టుగా ప్రజారవాణా సదుపాయాల విస్తరణకు ప్రాధాన్యం ఇవ్వాలి. అయిదు నిమిషాల్లోనే ఏదో ఒక స్టేషన్‌ చేరుకునేలా ప్రజారవాణా

Updated : 19 Aug 2022 14:37 IST

రాజధాని శివార్లలో తక్కువ ఖర్చుతో బీఆర్‌టీఎస్‌

ప్రజారవాణాతోనే నగరాలకు మనుగడ

‘ఈనాడు-ఈటీవీ’ ముఖాముఖిలో హైదరాబాద్‌ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: ‘నగరాల సమీపంలో వేగంగా జరుగుతున్న విస్తరణతో మున్ముందు వలసలు మరింత పెరుగుతాయి. జనాభాకు తగ్గట్టుగా ప్రజారవాణా సదుపాయాల విస్తరణకు ప్రాధాన్యం ఇవ్వాలి. అయిదు నిమిషాల్లోనే ఏదో ఒక స్టేషన్‌ చేరుకునేలా ప్రజారవాణా వ్యవస్థను తీర్చిదిద్దుకోగల్గితే మున్ముందు ట్రాఫిక్‌, కాలుష్య సమస్యలు లేకుండా చూసుకోవచ్చు. పాతికేళ్లలో హైదరాబాద్‌ను ప్రపంచ అగ్రశ్రేణి 20 నగరాల్లో ఒకటిగా చూడొచ్చు’ అని హైదరాబాద్‌ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి అన్నారు. నగరంలో ఎంఎంటీఎస్‌, మెట్రో వంటి ప్రజారవాణా వ్యవస్థలను పట్టాలెక్కించిన అనుభవం ఆయన సొంతం. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల సందర్భంగా వచ్చే పాతికేళ్లలో హైదరాబాద్‌లో ప్రజారవాణా ఎలా ఉండాలి? గత అనుభవాలు ఏం చెప్తున్నాయి? అనే అంశాలను ఆయన ‘ఈనాడు-ఈటీవీ’ ముఖాముఖిలో వివరించారు.

నగరంలో ప్రజారవాణాపై ఆధారపడేవారి శాతం తగ్గుతోంది. ట్రాఫిక్‌, కాలుష్యం పెరుగుతోంది..వచ్చే పాతికేళ్లలో ఎలా ఉండబోతుంది?

హైదరాబాద్‌లో ప్రజారవాణా ద్వారా ప్రయాణించేవారు 40 శాతం కంటే తక్కువే ఉన్నారు. ఇది ఆందోళన కల్గించే అంశం. నగరంలో ఇప్పటికే కోటి జనాభా నివసిస్తోంది. వచ్చే పాతికేళ్లలో ప్రధాన నగరంలో కోటిన్నరకుపైగా, హెచ్‌ఎండీఏ పరిధిలో రెండుకోట్ల జనాభా నివసించే అవకాశం ఉంది. సిటీలో ప్రస్తుతం 50 లక్షలకు పైగా వాహనాలు ఉన్నాయి.  వ్యక్తిగత వాహనాలు పెరుగుతూ పోతే మున్ముందు అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి వస్తుంది. కాలుష్యం పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రపంచవ్యాప్తంగా గతంలో ఇదే జరిగింది.ఆ అనుభవాల నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. వాహనాలు పెరిగేకొద్దీ రహదారులు విస్తరించడం, ఫ్లైఓవర్లు కట్టడం స్వల్ప కాలానికి ఉపయోగపడుతుంది.  ప్రజారవాణా వ్యవస్థను మెరుగుపర్చుకోవడమే శాశ్వత పరిష్కారం.

మెట్రో, మెట్రో నియో విస్తరణ ప్రణాళికలు ఎంతవరకు వచ్చాయి? మన నగరానికి ఏది అనుకూలం?

భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ స్టడీ పేరుతో లీ అసోసియేట్స్‌ గతంలో 2041కి నివేదిక ఇచ్చింది. దీని ప్రకారం మెట్రో 335 కి.మీ., ఎంఎంటీఎస్‌ 270 కి.మీ.మేరకు అవసరం పడుతుందని అంచనా వేసింది. ప్రాధాన్యాన్ని బట్టి మెట్రో రెండోదశలో కొన్ని మార్గాలను చేర్చాం. సీఎం సూచనల మేరకు రాయదుర్గం నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు మెట్రోను ప్రతిపాదించాం. ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు నిర్మించే ఆలోచన చేశాం. బీహెచ్‌ఈఎల్‌ నుంచి గచ్చిబౌలి మీదుగా లక్డీకాపూల్‌, నాగోల్‌ నుంచి ఎల్బీనగర్‌ మార్గాలు పరిశీలనలో ఉన్నాయి.ఇవి కాకుండా బీహెచ్‌ఈఎల్‌-పటాన్‌చెరు, జేఎన్‌టీయూ-ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, ఎల్బీనగర్‌-రామోజీ ఫిల్మ్‌సిటీ, జేబీఎస్‌-కూకట్‌పల్లి వై జంక్షన్‌, తార్నాక-కీసర-ఓఆర్‌ఆర్‌, నానక్‌రాంగూడ-బీహెచ్‌ఈఎల్‌, బోయిన్‌పల్లి-మేడ్చల్‌, ఎల్బీనగర్‌-చాంద్రాయణగుట్ట-విమానాశ్రయం, ఎంజీబీఎస్‌-ఘట్‌కేసర్‌ వరకు ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే మెట్రో వేయాలంటే కి.మీ.కు రూ.300 కోట్లు ఖర్చు అవుతుంది. అన్ని నిధులు వెచ్చించడం కష్టం కాబట్టి కొన్ని ప్రాంతాల్లో ఎలివేటెడ్‌ బస్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టం (ఈబీఆర్‌టీఎస్‌) నిర్మించబోతున్నాం. దీనికి కేంద్రం మెట్రో నియోగా ఆమోదం తెలిపింది. కేపీహెచ్‌బీ నుంచి ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌-కోకాపేట వరకు ఈ-బీఆర్‌టీఎస్‌ను ప్రతిపాదించాం. చాంద్రాయణగుట్ట నుంచి విమానాశ్రయం వరకు బీఆర్‌టీఎస్‌కు అవకాశం ఉంది. ఇది ఒక్కటే అనుకూలమని చెప్పలేం. అవసరాన్ని బట్టి నిర్మించుకోవాలి.

మనకు నిధుల సమస్య పెద్ద అవరోధంగా ఉంది. దీన్ని అధిగమించేందుకు గతంలో పీపీపీలో మెట్రో చేశారు.  కొత్తగా మరేమైనా ప్రణాళికలు ఉన్నాయా?

గతంలో మెట్రోను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్మించాం. కొవిడ్‌తో పీపీపీ ఆశలు సన్నగిల్లాయి. అందుకే ఈ-బీఆర్‌టీఎస్‌ను హైబ్రీడ్‌ యాన్యుటీ మోడల్‌లో చేయాలని అందుకు అనుమతి కోసం ప్రభుత్వానికి పంపించాం. ప్రాజెక్టు చేపట్టేందుకు ముందుకొచ్చే సంస్థలకు నిర్మాణ సమయంలో కొంత, నిర్వహణ సమయంలో కొంత నిధుల తోడ్పాటు అందిస్తాం.

విదేశాల్లో అభివృద్ధి చెందిన నగరాల్లో ప్రజారవాణా వ్యవస్థ ఎలా ఉంది? అక్కడి నుంచి మనం తీసుకోవాల్సిన అంశాలేమైనా ఉన్నాయా?

లండన్‌లో ఇంటినుంచి అయిదు నిమిషాల దూరం నడిచి వెళితే చాలు ట్యూబ్‌ స్టేషన్‌ వస్తుంది. పారిస్‌, సింగపూర్‌, హాంకాంగ్‌, టోక్యోలలో మెరుగైన ప్రజారవాణా ఉంది. మన దగ్గర పాదచారుల బాటలపై అక్రమణలు తొలగిస్తే బస్సుస్టాప్‌, ఎంఎంటీఎస్‌, మెట్రో స్టేషన్ల వరకు నడిచి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. స్కైవాక్స్‌ కట్టుకోవాలి. శివార్లలో సైక్లింగ్‌ ట్రాక్‌లు ఉండాలి. బస్సులు సంఖ్య పెంచడం, ఎంఎంటీఎస్‌ విస్తరణ, మెట్రో రెండోదశ, కొత్తగా వచ్చే మెట్రోనియో, బీఆర్‌టీఎస్‌ల అనుసంధానం జరగాలి. కామన్‌ మొబిలిటీ కార్డు ఉండాలి. దీనిపై ఆర్టీసీతో కలిసి మెట్రో ప్రయత్నాలు చేస్తోంది.


ఏమిటీ మెట్రో నియో

ఈ విధానంలో మెట్రో మాదిరే రహదారి మధ్యలో పిల్లర్లపై ఎలివేటెడ్‌ కారిడార్‌ ఉంటుంది. ట్రాక్‌ బదులు రోడ్డు ఉంటుంది. రైళ్ల స్థానంలో బ్యాటరీ బస్సులు నడుస్తాయి. కిలోమీటర్‌కు రూ.110 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించవచ్చు. 


బీఆర్‌టీఎస్‌ విధానంలో..

రహదారి మధ్యలో బస్సులకోసం రెండు లేన్లను ప్రత్యేకిస్తారు. ఒకవైపు రావడానికి, మరోవైపు వెళ్లడానికి వీలుగా ఉంటుంది. దీన్ని కిలోమీటర్‌కు రూ.20 కోట్లతో నిర్మించొచ్చు. మెట్రోకు మాత్రం కిలోమీటర్‌కు రూ.300కోట్ల వ్యయం అవుతుంది.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని