సమీక్ష కేసుల్లో పాత వాదనల్నే మళ్లీ అనుమతించలేం

పునఃసమీక్ష పిటిషన్‌ పేరుతో మునుపటి తీర్పులోని వాదనల్ని, తోసిపుచ్చిన అంశాలను మళ్లీ వినిపించడాన్ని అనుమతించలేమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ కృష్ణ మురారి, జస్టిస్‌ హిమాకొహ్లిల ధర్మాసనం స్పష్టం

Published : 19 Aug 2022 03:06 IST

సీజేఐ ధర్మాసనం స్పష్టీకరణ

తెలంగాణ భూ వివాదంలో హైకోర్టు తీర్పు కొట్టివేత

దిల్లీ: పునఃసమీక్ష పిటిషన్‌ పేరుతో మునుపటి తీర్పులోని వాదనల్ని, తోసిపుచ్చిన అంశాలను మళ్లీ వినిపించడాన్ని అనుమతించలేమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ కృష్ణ మురారి, జస్టిస్‌ హిమాకొహ్లిల ధర్మాసనం స్పష్టం చేసింది. ఇలాంటి అంశాలను ప్రస్తావించి, మునుపటి తీర్పును తిరగతోడాలనుకోవడం తగదంది. మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌ మండలం కమ్మదనం గ్రామానికి చెందిన భూవివాదం కేసును పరిష్కరిస్తూ ఈ వ్యాఖ్య చేసింది. ఈ వివాదం 1967 నుంచి నలుగుతోంది. సమీక్ష, అపీలు విషయంలో కోర్టుకున్న పరిధి ఒకటి కాదని ధర్మాసనం చెప్పింది.

అలాంటి పొరపాట్లు ఉంటే సమీక్షలో పరిశీలించవచ్చు

‘‘రికార్డుల పరంగా పొరపాట్లు ఉన్నట్లయితే ఒక తీర్పును సమీక్ష నిమిత్తం పరిశీలించవచ్చు. సమీక్షకు ఉన్న అధికారం ద్వారా న్యాయస్థానం ఒక తప్పిదాన్ని సరిచేయగలదు. అంతేగానీ మునుపటి అభిప్రాయానికి ప్రత్యామ్నాయాన్ని ఇవ్వలేదు.  దిగువ కోర్టుల తప్పుల్ని అప్పీలేట్‌ అధికారాల ద్వారా ఉన్నత న్యాయస్థానం సరిచేస్తుంది’’ అని 31 పేజీల తీర్పులో సీజేఐ ధర్మాసనం వివరించింది. ఒకే ఉత్తర్వుపై ఒకదాని తర్వాత ఒకటిగా రివ్యూ పిటిషన్లు వేయడాన్ని అనుమతించలేమంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 29న ఓ భూ వివాదంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని