మావోయిస్టు పార్టీకి చంద్రన్న సారథ్యమే?

తెలంగాణ మావోయిస్టు కమిటీ సారథి నియామక ప్రక్రియపై ఉత్కంఠ కొనసాగుతోంది. గత ఏడాది జూన్‌లో రాష్ట్ర కమిటీ అప్పటి కార్యదర్శి యాప నారాయణ అలియాస్‌ హరిభూషణ్‌ కరోనాతో దండకారణ్యంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. అప్పటి

Published : 19 Aug 2022 03:52 IST

 కొత్త కార్యదర్శి నియామకంపై నిర్ణయం వాయిదా!

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ మావోయిస్టు కమిటీ సారథి నియామక ప్రక్రియపై ఉత్కంఠ కొనసాగుతోంది. గత ఏడాది జూన్‌లో రాష్ట్ర కమిటీ అప్పటి కార్యదర్శి యాప నారాయణ అలియాస్‌ హరిభూషణ్‌ కరోనాతో దండకారణ్యంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పూర్తిస్థాయి బాధ్యతలు ఎవరికీ అప్పగించలేదు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్‌ చంద్రన్నకే తాజాగా సారథ్యం అప్పగించినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడ్కాపూర్‌ గ్రామానికి చెందిన చంద్రన్న 1980 దశకంలోనే అప్పటి పీపుల్స్‌వార్‌ (ప్రస్తుతం మావోయిస్టు పార్టీ)లో చేరారు. తొలుత కొంతకాలం ఉమ్మడి కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో పనిచేసిన తర్వాత దండకారణ్యానికి వెళ్లిపోయారు. సుదీర్ఘకాలం అక్కడే ఉండి పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత మావోయిస్టు రాష్ట్ర కమిటీ ఏర్పాటుతో కేంద్ర కమిటీ సభ్యుడి హోదాలో మార్గదర్శకత్వం వహిస్తున్నారు. తెలంగాణ కమిటీకి కార్యదర్శిగా ఉన్న హరిభూషణ్‌ స్థానంలో ఎవరిని నియమించాలనే అంశంపై పార్టీలో చర్చ జరిగింది. ఆ సమయంలో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్న బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్‌కు తాత్కాలికంగా ఆ బాధ్యతలు అప్పగించారు. విశ్వసనీయ సమాచారం మేరకు కొద్ది రోజుల కిందట దండకారణ్యంలో జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశాల సందర్భంగా పార్టీ సారథి అంశం చర్చకు వచ్చింది. ప్రస్తుతం రాష్ట్ర కమిటీలో దామోదర్‌తో పాటు బండి ప్రకాశ్‌ అలియాస్‌ ప్రభాత్‌, మైలారపు అడెల్లు అలియాస్‌ భాస్కర్‌, కంకణాల రాజిరెడ్డి అలియాస్‌ వెంకటేశ్‌ సభ్యులుగా ఉన్నారు. వీరిలో ప్రభాత్‌, దామోదర్‌ పేర్లు ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లికి చెందిన దామోదర్‌ ప్రస్తుతం తెలంగాణ మిలిటరీ చీఫ్‌గా ఉన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రాంతానికి చెందిన ప్రభాత్‌ ప్రెస్‌ టీం బాధ్యతలు నిర్వర్తిస్తూనే సింగరేణి కోల్‌బెల్ట్‌ ఏరియా కమిటీకి సారథ్యం వహిస్తున్నారు. వీరి గురించి చర్చించిన అగ్రనేతలు.. కార్యదర్శి నియామకంలో కొంతకాలం వేచి ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్లు, ప్రస్తుతానికి చంద్రన్న సారథ్యంలోనే కార్యకలాపాలు సాగించాలని తీర్మానించినట్లు తెలుస్తోంది.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని