మెస్‌ఛార్జీల పెంపుపై కసరత్తు

రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాల్లో, గురుకులాల్లో విద్యార్థులకు మెస్‌ఛార్జీలు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఐదేళ్ల నాటి ఛార్జీలు సవరించాలని నిర్ణయించింది. కనిష్ఠంగా 30-35 శాతం నుంచి గరిష్ఠంగా 50 శాతం పెంపు ఉండేలా అంచనాలు

Published : 19 Aug 2022 03:52 IST

కనీసం 35 శాతం పెంచాలని సమాలోచనలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాల్లో, గురుకులాల్లో విద్యార్థులకు మెస్‌ఛార్జీలు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఐదేళ్ల నాటి ఛార్జీలు సవరించాలని నిర్ణయించింది. కనిష్ఠంగా 30-35 శాతం నుంచి గరిష్ఠంగా 50 శాతం పెంపు ఉండేలా అంచనాలు తయారవుతున్నాయి. పోస్టుమెట్రిక్‌ విద్యార్థులకు నెలకు కనీసం రూ.2వేలు, ప్రీమెట్రిక్‌ విద్యార్థులకు రూ. 1,500 వరకు ఇవ్వాలనే ప్రతిపాదనలున్నాయి. గురుకులాలు, వసతి గృహాల్లో విద్యార్థులకు మెస్‌ఛార్జీలు పెంచితే.. అదేస్థాయిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ డేస్కాలర్లకు ఉపకారవేతనాల్లో పెరుగుదల ఉండే అవకాశాలున్నాయి. కొన్ని సంక్షేమశాఖలు గతంలోనే ప్రతిపాదనలు పంపగా మరికొన్ని ఇంకా కసరత్తు చేస్తున్నాయి. ఇలా వేర్వేరుగా కాకుండా కమిటీగా ఏర్పడి, ఏకీకృత ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇటీవల ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు త్వరలో సంక్షేమశాఖలన్నీ కలిసి సమావేశం నిర్వహించే అవకాశాలున్నాయి. సంక్షేమశాఖలు రూపొందించిన వాటిని సమీక్షించి ఏకీకృత ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం 2017-18లో మెస్‌ఛార్జీలను పెంచింది. అప్పట్లో తరగతుల వారీగా రూ.750 నుంచి రూ.1,050 వరకు ఉన్న వాటిని రూ.950 నుంచి రూ.1,500కు చేసింది. తరగతుల వారీగా ఒక్కో విద్యార్థికి రోజుకి రూ.31.66 నుంచి రూ.50 పెరుగుదల ఉండేలా చూసింది. ప్రస్తుతం పెరుగుతున్న నిత్యావసర ధరలతో విద్యార్థులకు భోజనం అందించే పరిస్థితి లేకుండా పోయింది. ప్రస్తుత ఆహారపట్టిక ప్రకారం రెండు పూటలా భోజనం, ఉదయం టిఫిన్‌, సాయంత్రం స్నాక్స్‌, రోజూ గుడ్డు ఇవ్వాలి. సాధారణంగా నెలకు నాలుగు రోజులు మాంసాహారం ఇస్తారు. నిధులు చాలక కొన్ని చోట్ల తాత్కాలికంగా కొన్ని పదార్థాలు తొలగిస్తున్నారు. నెలలో చికెన్‌, మటన్‌ అందించే రోజుల సంఖ్య తగ్గింది. కొత్తగా ఏర్పాటైన గురుకులాల్లో ప్రస్తుతం కేటరింగ్‌ సంస్థలు భోజనం అందిస్తున్నాయి. ప్రభుత్వమిచ్చే నిధులతో ఆహార పట్టిక ప్రకారం భోజనం అందించలేమంటూ గుత్తేదారులు తేల్చి చెప్పారు. ఆహార నాణ్యతపై ఫిర్యాదులూ ఎక్కువయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని