ఆ 42 యూజర్‌ ఐడీలు ఎవరివో?

మొత్తం 42 యూజర్‌ ఐడీలు.. బోధన్‌ వాణిజ్య పన్నులశాఖ కుంభకోణం వీటి ద్వారానే జరిగింది. కానీ, ఈ యూజర్‌ ఐడీలను ఎవరు వాడారన్న విషయం మాత్రం బయటపడటం లేదు. సీఐడీ ఎన్నిసార్లు లేఖలు రాస్తున్నా శాఖ నుంచి

Published : 19 Aug 2022 05:08 IST

సీఐడీకి వివరాలివ్వని వాణిజ్య పన్నులశాఖ

‘బోధన్‌’ కుంభకోణంలో తేలని చిక్కుముడి 

అభియోగపత్రాల దాఖలులో ఆలస్యం

ఈనాడు, హైదరాబాద్‌: మొత్తం 42 యూజర్‌ ఐడీలు.. బోధన్‌ వాణిజ్య పన్నులశాఖ కుంభకోణం వీటి ద్వారానే జరిగింది. కానీ, ఈ యూజర్‌ ఐడీలను ఎవరు వాడారన్న విషయం మాత్రం బయటపడటం లేదు. సీఐడీ ఎన్నిసార్లు లేఖలు రాస్తున్నా శాఖ నుంచి సరైన సమాధానం రావడం లేదు. దాంతో అయిదేళ్ల నుంచి సాగుతున్న దర్యాప్తులో అసలు నిందితులెవరో తేలడం లేదు. మిగతా దర్యాప్తు పూర్తయినా.. వాణిజ్య పన్నులశాఖ నుంచి మధ్యవర్తి శివరాజ్‌ ముఠాకు ఎవరు సహకరించారన్నది మాత్రం ఇంకా మిస్టరీగానే ఉంది. అది తేలేవరకూ దర్యాప్తు కొలిక్కివచ్చే అవకాశం లేకపోవడంతో అభియోగపత్రాల దాఖలులో ఆలస్యమవుతోంది.

అయిదేళ్ల క్రితం ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో జరిగిన వాణిజ్య పన్నుల కుంభకోణం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మధ్యవర్తి శివరాజ్‌తో వాణిజ్య పన్నులశాఖ సిబ్బంది కుమ్మక్కయ్యారు. ఒకే చలానాను నలుగురైదుగురి పేరుపై చూపించేవారు. రికార్డుల్లో వారంతా పన్ను కట్టినట్లు ఉండేది. ఖజానాలో మాత్రం ఒక్కరి పన్ను మాత్రమే జమ అయ్యేది. హైదరాబాద్‌ స్థాయిలో ఉన్న అధికారులూ ఈ అక్రమ వ్యవహారంలో భాగస్వాములయ్యారు. ఏకంగా అయిదేళ్లపాటు దోపిడీ సాగింది. విజిలెన్స్‌ విచారణలో ఇది వెలుగులోకి రావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు 2017లో సీఐడీ కేసు నమోదు చేసింది. శివరాజ్‌ కార్యాలయంలో సోదాలు నిర్వహించగా వేల సంఖ్యలో బిల్లులు బయటపడ్డాయి. వాటన్నింటికీ ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించారు. శివరాజ్‌ ముఠాతోపాటు వాణిజ్య పన్నులశాఖ సిబ్బందినీ అరెస్ట్‌ చేశారు. వేల సంఖ్యలో బిల్లులను తనిఖీ చేసి, వాటి ద్వారా జరిగిన అవకతవకలను నిర్ధారించాల్సి రావడంతో దర్యాప్తు ఏళ్ల తరబడి నడిచింది. అయితే వాణిజ్య పన్నుల శాఖ మొదటి నుంచీ సహాయ నిరాకరణ చేస్తున్నట్లు తెలుస్తోంది. కుంభకోణం జరిగిన సమయంలో ఎలక్ట్రానిక్‌ లావాదేవీలకు సంబంధించిన వివరాలు కావాలని, ఇందుకోసం ఆ శాఖ సర్వర్‌ను తనిఖీ చేయాల్సి ఉంటుందని సీఐడీ అధికారులు చాలాసార్లు అడిగారు. సర్వర్‌ను నిలిపివేస్తే కార్యకలాపాలు ఆగిపోతాయని, పన్ను వసూళ్లు నిలిచిపోతాయంటూ చాలాకాలం తాత్సారం చేశారు. ఎట్టకేలకు సర్వర్‌కు ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించేందుకు వాణిజ్య పన్నుశాఖ అధికారులు ఒప్పుకొన్నారు. 42 యూజర్‌ ఐడీల ద్వారా నకిలీ చలానాల బాగోతం జరిగినట్లు ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో గుర్తించారు. ఆ యూజర్‌ ఐడీలు ఎవరివో తెలిస్తే శివరాజ్‌ ముఠాతో ఉన్న సంబంధాన్ని నిర్ధారించవచ్చు. కానీ, సీఐడీ అధికారులు ఎన్నిసార్లు అడిగినా వాణిజ్య పన్నుల శాఖ నుంచి సరైన సమాధానం రావడం లేదని తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇప్పటివరకూ సీఐడీ అధికారులు 11సార్లు లేఖలు రాశారు. 42 యూజర్‌ ఐడీలకు సంబంధించిన వివరాలు తెలపాలని కోరారు. వాణిజ్య పన్నుల అధికారులు మాత్రం గుండుగుత్తగా 70 మందికిపైగా సిబ్బంది వివరాలు పంపుతున్నారు తప్ప సీఐడీ అడిగిన యూజర్‌ ఐడీలు ఎవరు వాడారన్న విషయాన్ని మాత్రం చెప్పడం లేదని తెలుస్తోంది. దాంతో కేసు దర్యాప్తు సంక్లిష్టంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని