‘ఘీ’పెట్టి అడిగినా.. లేదంటున్నారే!

రాష్ట్రంలో పాల కొరత దాని ఉత్పత్తులనూ ప్రభావితం చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వ డెయిరీ ‘విజయ’ బ్రాండు పేరుతో విక్రయించే ‘నెయ్యి’కి దేశవ్యాప్తంగా డిమాండున్నా సరఫరా చేయలేక చేతులెత్తేస్తున్నారు. ముంబయి,

Published : 19 Aug 2022 05:08 IST

‘విజయ’ నెయ్యికి మార్కెట్‌లో ఎంతో డిమాండు

అధికంగా ప్యాకెట్లు పంపాలని ముంబయి, దిల్లీ ఆర్డర్లు

గేదెపాలు దొరక్క ఉత్పత్తి లేదంటూ సరఫరా తగ్గింపు

కర్ణాటక నుంచి తప్పని ఆవుపాల కొనుగోలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో పాల కొరత దాని ఉత్పత్తులనూ ప్రభావితం చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వ డెయిరీ ‘విజయ’ బ్రాండు పేరుతో విక్రయించే ‘నెయ్యి’కి దేశవ్యాప్తంగా డిమాండున్నా సరఫరా చేయలేక చేతులెత్తేస్తున్నారు. ముంబయి, దిల్లీల నుంచి రోజూ ఆర్డర్లు వస్తున్నా పంపలేకపోతున్నారు. రైతుల నుంచి పాల సేకరణ, ప్రజలకు పాల విక్రయంలో వెనుకబడిన డెయిరీ.. నెయ్యి, వెన్న తదితర పాల ఉత్పత్తుల అమ్మకాలనూ పెంచుకోలేకపోతోంది. రోజువారీ అవసరాలకు 3.50 లక్షల లీటర్ల పాలు అవసరం కాగా కర్ణాటక నుంచి రోజుకు 50వేల నుంచి లక్ష లీటర్లు కొంటోంది. ఇవన్నీ ఆవుపాలు కావడంతో నెయ్యి ఉత్పత్తిపై ప్రభావం పడుతోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో గేదెలు తక్కువగా ఉన్నందున, తెలుగు రాష్ట్రాల్లో వాటి పాలసేకరణ గతంలో అధికంగా ఉండేది. అందుకే గేదెనెయ్యికి భారీ డిమాండుంది. మిఠాయిల తయారీకి చిక్కని, స్వచ్ఛమైన ‘విజయ’ నెయ్యిని ముంబయి, దిల్లీ వ్యాపారులు టోకుగా ఎప్పటి నుంచో కొంటున్నారు. కానీ, తెలంగాణలో గేదెల సంఖ్య తగ్గి క్రమంగా ఆవులు అధికం కావడంతో నెయ్యి ఉత్పత్తీ తగ్గుతోంది. గేదెపాలు చిక్కగా ఉండి, వెన్న శాతం 10 వరకూ లభిస్తుంది. ఆవుపాలు కాస్త పలచన. వెన్న 5 శాతం మించదు. ప్రస్తుతం చిల్లర మార్కెట్‌లో డెయిరీలు నెయ్యి ధరలను కిలోకు రూ.50 నుంచి 80 దాకా అదనంగా పెంచాయి. విజయ బ్రాండు సాధారణ నెయ్యి లీటరు ధర రూ.572కి చిల్లర వ్యాపారులు విక్రయిస్తున్నారు. గతంలో రూ.540కి అమ్మేవారు. ఖర్చులు పెరగడంతో పాటు, కొరత, డిమాండు కారణంగా నెయ్యి ధరలు పెంచినట్లు అధికారులు తెలిపారు.

పడిపోయిన గేదెపాల ఉత్పత్తి..

ఒకప్పుడు తెలంగాణలో రోజుకు 2లక్షల లీటర్ల వరకూ గేదెపాలను నిత్యం విజయ డెయిరీకి రైతులు సరఫరా చేసేవారు. ఇప్పుడది 70-80వేల లీటర్లకు మించటం లేదు. పాల సేకరణపై శ్రద్ధ చూపకపోవడం, నెయ్యి, పాల ఉత్పత్తులను కాపాడుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేయకపోవడం వల్ల విజయ డెయిరీ వెలవెలబోతోంది. రాష్ట్రంలో గేదెలకు బదులు అధికంగా పాలిచ్చే సంకరజాతి ఆవుల పెంపకం ఎక్కువగా చేపడుతున్నందున నెయ్యి ఉత్పత్తికి చిక్కనైన పాలు దొరకడం లేదని డెయిరీ వర్గాలు ‘ఈనాడు’కు చెప్పాయి. ఈ డెయిరీకి ఏడాదికాలంగా శాశ్వత మేనేజింగ్‌ డైరెక్టర్‌(ఎండీ) లేరు. రిటైర్డ్‌ అధికారికి బాధ్యతలు అప్పగించడంతో పాలసేకరణ, నెయ్యి ఉత్పత్తిపై అధికారులు శ్రద్ధ చూపడం లేదు. గతంలో ఒక గేదెను కొంటే దాని ధరలో రూ.10వేలను డెయిరీ రాయితీగా ఇచ్చేదని, ఇప్పుడు మానేసిందని జనగామ జిల్లా పాడి రైతుల సహకార సంఘం అధ్యక్షుడు సోమిరెడ్డి చెప్పారు. ఒక్క జనగామ జిల్లాలోనే 300 మంది రైతులు పాడిగేదెలు కొనడానికి రుణాలు, రాయితీలు కావాలని దరఖాస్తులు చేసుకుంటే ఇంతవరకూ మంజూరు కాలేదని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని