సర్కారు బడులకు సౌర విద్యుత్తు

రాష్ట్రంలోని ప్రభుత్వ బడులకు దశలవారీగా సౌరవిద్యుత్తు అందించాలని విద్యాశాఖ నిర్ణయించింది. మొదట ఉన్నత పాఠశాలలకు దాన్ని అమలు చేయనున్నారు. పాఠశాలల్లో మోటార్ల వినియోగం, మొక్కలకు నీళ్లు పెట్టడం, మధ్యాహ్న

Published : 19 Aug 2022 05:08 IST

 మొదట 4,500 ఉన్నత పాఠశాలలకు సరఫరా
 టీఎస్‌ రెడ్కోతో విద్యాశాఖ సంప్రదింపులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ బడులకు దశలవారీగా సౌరవిద్యుత్తు అందించాలని విద్యాశాఖ నిర్ణయించింది. మొదట ఉన్నత పాఠశాలలకు దాన్ని అమలు చేయనున్నారు. పాఠశాలల్లో మోటార్ల వినియోగం, మొక్కలకు నీళ్లు పెట్టడం, మధ్యాహ్న భోజనం అమలు, ఆర్‌వో ప్లాంట్లు, ఫ్యాన్లు తదితరాల కారణంగా విద్యుత్తు వినియోగం పెరుగుతోంది. ఒక్కో పాఠశాలలో కరెంట్‌ బిల్లు రూ.వెయ్యి నుంచి రూ.4వేల వరకు వస్తోంది. విద్యాశాఖ బడులకు ఇచ్చే స్కూల్‌ గ్రాంట్‌ మొత్తం విద్యుత్తు బిల్లులకే సరిపోతున్న పరిస్థితి. ఒక్కో జిల్లాల్లో రూ.పదుల సంఖ్యలో బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇటీవలే కరీంనగర్‌ జిల్లాలో పాఠశాలల పెండింగ్‌ బిల్లు రూ.73 లక్షల మొత్తాన్ని కలెక్టర్‌ చెల్లించడం గమనార్హం. ‘మన ఊరు-మన బడి’ కింద ప్రతి తరగతి గదిలో రెండు ఫ్యాన్లు అమర్చాలన్నది ప్రణాళిక. తద్వారా కరెంట్‌ బిల్లు మరింత పెరుగుతుంది. ఆ భారాన్ని తగ్గించుకోవడంతోపాటు సౌరవిద్యుత్తు వల్ల పర్యావరణ కాలుష్యమూ ఉండదనే ఉద్దేశంతో విద్యాశాఖ దాని పట్ల మొగ్గుచూపింది. ఉన్నత పాఠశాలల్లో కనీసం అయిదు తరగతి గదులు, సిబ్బంది, హెచ్‌ఎం గది ఉంటాయి. దానివల్ల అధికంగా బిల్లులు వస్తున్నాయి. విద్యాశాఖ ఆధ్వర్యంలో మొత్తం 26,072 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా..అందులో 4,500 హైస్కూళ్లకు తొలుత సౌరవిద్యుత్తు అందించనున్నామని పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

సౌరవిద్యుత్తు సౌకర్యం కల్పించే నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల సంస్థ(టీఎస్‌ రెడ్కో) అధికారులతోనూ చర్చించారు. ప్రస్తుతం ఒక్కో బడికి సగటు విద్యుత్తు వినియోగం, వచ్చే బిల్లు, అక్కడ విద్యార్థులు, గదుల సంఖ్య తదితర వివరాలను రెడ్కో అధికారులకు అందజేశారు. దీనిపై ఏ బడిలో ఎంత కేవీ సామర్థ్యం అవసరమో పరిశీలిస్తున్నామని రెడ్కో ఎండీ జానయ్య చెప్పారు. ఒక్కో కేవీకి రూ.50వేల నుంచి రూ.60వేల వరకు ఖర్చవుతుందని తెలిపారు. ఒక్కోచోట కేవీ నుంచి 5కేవీల సామర్థ్యంగల సౌరఫలకలు అవసరం అవుతాయని భావిస్తున్నారు.

ఉన్నవి అటకెక్కుతూ...

రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో సౌరవిద్యుత్తు సౌకర్యం ఉంది. రాష్ట్రంలో 2018-19 విద్యాసంవత్సరానికి 3,356  ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు సౌరవిద్యుత్తు ఉండగా...అది 2019-20 నాటికి 2,770, 2020-21 నాటికి 2424 బడులకు తగ్గిపోయింది. కేవలం విద్యాశాఖ పరిధిలోని బడుల్లో చూస్తే 2020-21లో 1957 చోట్ల సౌకర్యం ఉంటే 2020-21కి 1127 పాఠశాలలకు తగ్గిపోయినట్లు ప్రభుత్వ గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది. నిర్వహణ సమస్యలు ఇందుకు మూలకారణం అవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని