ప్రత్యేక బ్రాండు సృష్టించేదెన్నడు..!?

‘ఒక జిల్లా- ఒక ఉత్పత్తి’ (ఓడీఓపీ) పథకం రాష్ట్రంలో పడకేసింది. దేశవ్యాప్తంగా ఓడీఓపీ కింద ప్రతి జిల్లాలో అధికంగా పండే పంట లేదా వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులను గుర్తించి వాటిని ప్రోత్సహించాలని కేంద్రం

Published : 19 Aug 2022 05:08 IST

 33 జిల్లాల్లో 13 రకాల పంటలు, ఉత్పత్తుల గుర్తింపు

ఒక్కదానికీ ప్రోత్సాహం ఇవ్వక పథకం నత్తనడక

ఈనాడు, హైదరాబాద్‌: ‘ఒక జిల్లా- ఒక ఉత్పత్తి’ (ఓడీఓపీ) పథకం రాష్ట్రంలో పడకేసింది. దేశవ్యాప్తంగా ఓడీఓపీ కింద ప్రతి జిల్లాలో అధికంగా పండే పంట లేదా వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులను గుర్తించి వాటిని ప్రోత్సహించాలని కేంద్రం రెండేళ్ల క్రితం అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో జిల్లాస్థాయిలో ఈ పథకం విజయవంతమైంది. ఆ స్ఫూర్తితో ఇప్పుడు ‘ఒక తాలుకా-ఒక ఉత్పత్తి’ (ఓటీఓపీ) అంటూ మరో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 15 రకాల పంటలు, ఇతర ఉత్పత్తులను పెంచి రైతులను ప్రోత్సహించాలని నిర్ణయించారు. అందుకు ప్రణాళిక తయారుచేసినా ముందడుగు పడలేదు.

ఇతర రాష్ట్రాల ఉదాహరణలివి..

దేశవ్యాప్తంగా ఓడీఓపీ కింద ఆరు ప్రత్యేక బ్రాండ్లను ఆరు రాష్ట్రాల వ్యవసాయ, ఆహారశుద్ధి శాఖలు సృష్టించాయి.

* ఉత్తర్‌ప్రదేశ్‌లోని షహరన్‌పూర్‌ జిల్లాలో తేనె ఉత్పత్తి పెంచి ‘మధుమంత్ర’ అనే పేరుతో ప్రత్యేక బ్రాండు సృష్టించారు.

* మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలో రాగుల పిండిని అరకిలో చొప్పున ప్యాక్‌ చేసి ‘సోమ్‌ధన’ పేరుతో అమ్ముతున్నారు.

* రాజస్థాన్‌లోని కోట జిల్లాలో కొత్తిమీర సాగును ప్రోత్సహిస్తున్నారు. దాని నుంచి పొడిని తయారుచేసి ‘కోరి గోల్డ్‌’ అనే బ్రాండుతో విక్రయిస్తున్నారు.

మార్కెటింగ్‌ బాధ్యత నాఫెడ్‌కు

ఇలా ఓడీఓపీ కింద సృష్టించే ప్రత్యేక బ్రాండ్ల ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సదుపాయాలు పెంచే బాధ్యతలను ‘జాతీయ సహకార మార్కెటింగ్‌ సమాఖ్య’ (నాఫెడ్‌)కు కేంద్రం అప్పగించింది. ఈ ఉత్పత్తులు ‘ఈ-కామర్స్‌’ మార్కెట్లలో సైతం ప్రజలకు లభించేలా చూస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల ప్రత్యేకత దేశమంతా తెలుస్తోంది.

రాష్ట్రంలో లోపించిన చొరవ

తెలంగాణలో సైతం చిరుధాన్యాలను కుమురంభీం, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ప్రోత్సహించి వాటి ఉత్పత్తులను తయారుచేసి ప్రత్యేక బ్రాండు సృష్టించి మార్కెట్లలోకి తేవాలని కేంద్రం గతంలో సూచించింది. కానీ ఈ పంటల సాగు పెంచడంలో వ్యవసాయశాఖ, ఉత్పత్తుల తయారీ, శుద్ధి ప్లాంట్ల ఏర్పాటులో ఆహారశుద్ధి శాఖలు పెద్దగా చొరవ చూపలేదు. ప్రతీ జిల్లాలో ఒక పంటను ప్రత్యేకంగా సాగుచేయించి ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకూ రైతులకు ఎలాంటి రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదని, నిధుల కొరత పెద్ద సమస్యగా ఉందని సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. ఉత్పత్తులు ప్రారంభమైతే తప్ప ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా ప్రత్యేక బ్రాండు సృష్టించి మార్కెట్లలోకి తీసుకురాలేమని ఆయన వివరించారు. దేశంలోనే మేలైన బత్తాయి పండ్లు నల్గొండ జిల్లాలో పండుతాయి. వీటి నుంచి పండ్ల రసాలు, ఇతర ఉత్పత్తుల తయారీకి  రైతులను ప్రోత్సహించి  దేశం నలుమూలలకు, విదేశాలకు పంపడానికి అవసరమైన అతిపెద్ద మార్కెట్లు ఏర్పాటుచేయాలి. కానీ ఇంతవరకూ ఏమీ జరగలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని