Cyber Crime: దోచుకునేందుకో ఆఫర్‌

సైబర్‌ దొంగలు ముందుగానే పండగ చేసుకుంటున్నారు. దసరా, దీపావళి పేరిట ఎడాపెడా ఆఫర్లు ప్రకటిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. తక్కువకు వస్తున్నాయనే ఆశతో  కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్న కొందరు అసలు విషయం తెలిశాక కళ్లు తేలేస్తున్నారు.

Updated : 15 Sep 2022 05:30 IST

ప్రముఖ ఈ-కామర్స్‌ సైట్ల పేరిట సైబర్‌ నేరస్థుల సందేశాలు
తక్కువ ధరకే వస్తువులంటూ ఊరించి ఊడ్చేస్తున్న ముఠాలు
నమ్మి మోసపోవద్దంటూ పోలీసుల హెచ్చరికలు
ఈనాడు - హైదరాబాద్‌

* సికింద్రాబాద్‌కు చెందిన చైతన్య సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. ఇటీవల ఆయనకో వాట్సప్‌సందేశం వచ్చింది. ‘దసరా ధమాకా’ పేరుతో ఓ ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ ‘ఒక ఐఫోన్‌ కొంటే మరొకటి ఉచితం’గా ఇస్తుందన్నది దాని సారాంశం. అది నమ్మిన ఆ యువకుడు హడావుడిగా డబ్బు కట్టాడు. ఎన్ని రోజులు ఎదురుచూసినా ఫోన్‌ రాకపోవడంతో సదరు సంస్థ కస్టమర్‌కేర్‌కు ఫోన్‌ చేశాడు. అసలు ఆయన పేరుతో ఎలాంటి ఫోనూ బుక్‌ కాలేదని, అలాంటి ఆఫరేదీ తాము ఇవ్వలేదని అక్కడున్నవారు బదులిచ్చారు. సైబర్‌ పోలీసులను ఆశ్రయించగా, ఆయనకు వచ్చిన వాట్సప్‌ సందేశం నకిలీదని వారు తేల్చారు.

* మరో ఘటనలో ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ సంస్థ టీవీలను సగం ధరకే ఇస్తోందని, మూడు కంటే ఎక్కువ యూనిట్లు బుక్‌ చేసుకుంటే మరో పది శాతం డిస్కౌంట్‌ అదనంగా పొందవచ్చనే ప్రకటన వచ్చింది. ఆశపడిన ఓ చిరువ్యాపారి ఒకేసారి 4 టీవీలు కొనేందుకు రూ.లక్షన్నర కట్టాడు.. ఆపై నిలువునా మునిగాడు. ఇలాంటి ఉదంతాలెన్నో.

సైబర్‌ దొంగలు ముందుగానే పండగ చేసుకుంటున్నారు. దసరా, దీపావళి పేరిట ఎడాపెడా ఆఫర్లు ప్రకటిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. తక్కువకు వస్తున్నాయనే ఆశతో  కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్న కొందరు అసలు విషయం తెలిశాక కళ్లు తేలేస్తున్నారు. ఇప్పటికే మొదలైన పండగల సీజన్‌ కారణంగా ఇలాంటి ఫిర్యాదులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆఫర్లకు సంబంధించి అంతర్జాలంలో వచ్చే అనుచిత ప్రకటనలను నమ్మి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
దసరా, దీపావళి పండగల దృష్ట్యా ఇప్పటికే అనేక వాణిజ్య సంస్థలు ఆకట్టుకునేలా ప్రకటనలు గుప్పిస్తున్నాయి. ముఖ్యంగా ఆఫర్లకు పెట్టింది పేరైన ఈ-కామర్స్‌ సంస్థలయితే ఇలాంటి ప్రకటనలతో హోరెత్తిస్తున్నాయి. నిజానికి ఈ సైట్లలో అనేక వస్తువులు తక్కువ ధరకు వస్తాయనే నమ్మకం ప్రజల్లో ఉంది. దీన్ని ఆసరాగా చేసుకొని సైబర్‌ నేరగాళ్ళు మోసాలకు తెరతీస్తున్నారు. ప్రతి పండగల సీజన్‌లోనూ ఇలానే చెలరేగిపోతున్న నేరగాళ్లు ప్రస్తుత పర్వదినాల సమయంలో కొత్త ఎత్తుగడలతో సిద్ధమయ్యారు. బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన సంస్థల పేర్లతో అనూహ్యమైన ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఇవన్నీ ప్రముఖ సంస్థలు కావడంతో జనం సైతం గుడ్డిగా నమ్ముతున్నారు. ఇక్కడ ముఖ్య విషయం ఏమిటంటే ఈ సంస్థలకు చెందిన సొంత యాప్‌లలో షాపింగ్‌ చేసుకుంటే ఏ సమస్యా ఉండదు. కానీ, సైబర్‌ నేరగాళ్లు పంపుతున్న లింకుల్ని క్లిక్‌ చేస్తేనే ఇబ్బంది వస్తుంది. ఈ లింకులకు, అసలు సంస్థలకు ఎలాంటి సంబంధం ఉండదు. కాకపోతే, వాటి పేరుతో రూపొందిస్తున్న నకిలీ వెబ్‌సైట్లు ఇవి. వీటి ద్వారా కొనుగోళ్లు జరిపితే ఇంతే సంగతులు. కొన్న వస్తువు ఇంటికి చేరదు, చెల్లించిన డబ్బు తిరిగి రాదు. సాధారణంగా అన్ని ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థలు ‘పెయిడ్‌ ఆన్‌ డెలివరీ’ సౌకర్యం కల్పిస్తాయి. అంటే వస్తువులు అందాక కూడా డబ్బు చెల్లించవచ్చు. నకిలీ సంస్థలు మాత్రం ముందుగానే డబ్బు చెల్లించాలని చెబుతాయి. ఇలా అడిగాయంటే అనుమానించాల్సిందే.

ఈ జాగ్రత్తలు పాటించండి..

* తక్కువ ధరకే వస్తువులు అని చెబుతూ అంతర్జాలంలో వచ్చే ప్రకటనలు నమ్మవద్దు. ఈ పేరుతో పంపే లింకుల్ని తెరవవద్దు. వీటి ద్వారా నకిలీ యాప్‌లు ఫోన్లోకి చొరబడి, వ్యక్తిగత సమాచారమూ చోరీకి గురయ్యే ప్రమాదం ఉంది.

* ఒకవేళ ఇలాంటి ప్రకటన వస్తే అసలు సంస్థ యాప్‌లోకి వెళ్ళి చెక్‌ చేసుకోవాలి. కొనుగోళ్లూ దాని ద్వారానే చేయాలి.

* ఊరూపేరూ లేని సంస్థల పేర్లతో అతి తక్కువ ధరలకే వస్తువులు అమ్ముతామని వచ్చే ప్రకటనలు అసలు నమ్మొద్దు.

* కొన్ని సంస్థలు వస్తువు అందాకే డబ్బు కట్టొచ్చు అనే సదుపాయం కూడా కల్పిస్తున్నాయి. తీరా డబ్బు చెల్లించాక పార్శిల్‌ విప్పిచూస్తే అందులో పనికిరాని వస్తువులు ఉంటున్నాయి. అందుకే నమ్మకమైన, సుపరిచితమైన సంస్థల్లోనే కొనుగోళ్లు చేయాలి.

* ఒకవేళ మోసపోయామని గ్రహించాక గూగుల్‌లో వెతికి సదరు సంస్థకు చెందిన కాల్‌సెంటర్‌కు ఫోన్‌ చేస్తే మరో మోసం జరిగే అవకాశమూ ఉంది. పోయిన డబ్బు తిరిగి చెల్లిస్తామంటూ బ్యాంకు వివరాలన్నీ సేకరించి ఉన్న డబ్బంతా ఊడ్చేసే ప్రమాదమూ పొంచి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని