నిమ్స్‌లో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు పెరగాలి

నిమ్స్‌లో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు మరిన్ని ఎక్కువగా నిర్వహించాలని, క్యాన్సర్‌ చికిత్సలో బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ సర్జరీలు పెంచాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు.

Published : 15 Sep 2022 04:24 IST

మంత్రి హరీశ్‌రావు ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: నిమ్స్‌లో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు మరిన్ని ఎక్కువగా నిర్వహించాలని, క్యాన్సర్‌ చికిత్సలో బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ సర్జరీలు పెంచాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. రాష్ట్రం ఏర్పాటు నుంచి ఇప్పటివరకూ క్యాన్సర్‌ చికిత్సలపై ప్రభుత్వం రూ.642 కోట్లు ఖర్చు చేసిందని, 2014-15తో పోల్చితే గతేడాది దాదాపు రెట్టింపు ఖర్చు చేశామని వెల్లడించారు. బుధవారం ఆయన నిమ్స్‌, ఎంఎన్‌జే ఆసుపత్రుల పనితీరుపై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థ (ఎంసీహెచ్‌ఆర్‌డీ)లో నెలవారీ సమీక్ష నిర్వహించారు. ‘‘నిమ్స్‌లో 200 పడకలతో మాతాశిశు సంరక్షణ ఆసుపత్రి(ఎంసీహెచ్‌) నిర్మాణ పనులను వేగవంతం చేయాలి. ఎంఎన్‌జేలో త్వరలో కొత్తగా నిర్మిస్తున్న ఆసుపత్రి అందుబాటులోకి రానుంది. దీంతో పడకల సంఖ్య 450 నుంచి 750కి పెరుగుతుంది. క్యాన్సర్‌ పరీక్షలకు అన్ని జిల్లాల్లో మొబైల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించాలి. ఆపరేషన్‌ థియేటర్‌, ఐసీయూ ఇన్‌ఫెక్షన్‌ నియంత్రణకు నిబంధనలు పక్కాగా పాటించాలి’’ అని మంత్రి సూచించారు.

సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ దేశానికి ఆదర్శం
సంక్షేమ కార్యక్రమాల అమలులో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. పశుసంవర్ధక, మత్స్య శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న కార్యక్రమాలు, సాధించిన ఫలితాలపై బుధవారం ఆయన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి ఎంసీహెచ్‌ఆర్‌డీలో సమీక్ష జరిపారు. ‘‘దేశంలో మొదట తెలంగాణలోనే సంచార పశు వైద్యశాలలను ప్రారంభించాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వాటిని ప్రారంభించడం తెలంగాణ ప్రగతికి నిదర్శనం. రూ.370 కోట్ల ఖర్చుతో 58,992 పాడి గేదెలను రాయితీపై పంపిణీ చేశాం. రోజుకు 5 లక్షల లీటర్ల పాల శుద్ధి సామర్థ్యం కలిగిన మెగా డెయిరీ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఉచిత చేప పిల్లల పంపిణీతో మత్స్య సంపద మూడింతలు పెరిగింది. ఈ సంవత్సరం 350 నీటివనరుల్లో రూ.25 కోట్ల ఖర్చుతో 10 కోట్ల రొయ్య పిల్లల విడుదలకు చర్యలు చేపట్టాం’’ అని మంత్రులు తెలిపారు.

ఎస్సీ గురుకులాల విద్యార్థులకు సన్మానం
నీట్‌, జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన 240 మంది ఎస్సీ గురుకులాల విద్యార్థులను మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్‌, శ్రీనివాస్‌యాదవ్‌లు బుధవారం ఎంసీహెచ్‌ఆర్‌డీలో సన్మానించారు. ఐఐటీలో 1439 ర్యాంకు సాధించిన ఎస్సీ గురుకుల విద్యార్థిని జి.వర్షిణి.. శాట్‌ పరీక్షతో విదేశీ యూనివర్సిటీల్లో ప్రవేశానికి అర్హత సాధించానని తెలపగా.. ఆమె చదువుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని మంత్రులు ప్రకటించారు. ఎస్సీ గురుకులాల నుంచి 160 మంది విద్యార్థినులు ఎంబీబీఎస్‌, 130 మంది ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు అర్హత సాధించారని కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. మహిళల ఉన్నత విద్యకోసం 30 మహిళా డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. గౌలిదొడ్డి సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ (సీవోఈ) తరహాలో రాష్ట్రంలో మరో నాలుగు సీవోఈలను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని