కవుల నేలకు పర్యాటక కళ

భాగవతామృతాన్ని అచ్చతెలుగులోకి అనువదించి అపార సాహితీ సంపదను తెలుగువారికి అందించారు బమ్మెర పోతన. పండితారాధన చరిత్రకు రూపమిచ్చి తెలుగులో తొలి కవిగా

Published : 16 Sep 2022 05:06 IST

బమ్మెర పోతన, పాల్కురికి సోమనల పేరిట స్మృతివనాలు

ప్రసిద్ధ ఆలయాలు, కోటలకు హంగులు

పర్యాటక వలయం ఏర్పాటుకు చురుగ్గా పనులు

ఈనాడు, వరంగల్‌: భాగవతామృతాన్ని అచ్చతెలుగులోకి అనువదించి అపార సాహితీ సంపదను తెలుగువారికి అందించారు బమ్మెర పోతన. పండితారాధన చరిత్రకు రూపమిచ్చి తెలుగులో తొలి కవిగా పేరొందారు పాల్కురికి సోమనాథుడు. పక్కపక్కనే ఉన్న ఈ కవులు నడయాడిన గ్రామాలు ఇపుడు పర్యాటక కళను సంతరించుకొంటున్నాయి. జనగామ జిల్లాలో త్వరలో అనేక పర్యాటక ప్రాంతాలు కొత్త హంగులతో కనువిందు చేయనున్నాయి. 2017 ఏప్రిల్‌ 28న బమ్మెర గ్రామంలో పోతన స్మృతివనం నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. ఇదికాక జిల్లాలోని ఆరు ప్రాంతాల్లో ఆలయాలు, కోటలను పర్యాటక వలయంగా తీర్చిదిద్దేందుకు రూ.40కోట్లు మంజూరయ్యాయి. ఇటీవల అదనంగా మరో రూ.15కోట్లు రావడంతో పనులు జోరందుకున్నాయి.

ప్రత్యేక ఆకర్షణగా స్మృతివనాలు
బమ్మెర గ్రామ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రయోజన వాహకాన్ని ఏర్పాటుచేశారు. పనులను కాకతీయ హెరిటేజ్‌ ట్రస్టు వారికి అప్పగించారు. ఇక్కడ పోతన స్మృతివనం పనులు 80 శాతం పూర్తి కావచ్చాయి. 18 అడుగుల పోతన కాంస్య విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. పోతనామాత్యుని రచనలు, ఇతర సాహితీ గ్రంథాలను భద్రపరిచేందుకు గ్రంథాలయం, ఆడిటోరియం, ఉద్యానవనాలు ఏర్పాటుచేయనున్నారు. మిగతా పనులను రహదారులు, భవనాల శాఖ, పురావస్తు శాఖలు చేపడుతున్నాయి.

* పోతన సమాధి, స్నానం చేసిన బావి మరమ్మతులను రాష్ట్ర పురావస్తు శాఖకు అప్పగించారు. రూ.70లక్షల నిధులు దీనికి కేటాయించారు.

* పాలకుర్తి సోమేశ్వరాలయానికి మరమ్మతులు చేసి సుందరీకరిస్తున్నారు. సమీపంలో పాల్కురికి  సోమనాథుడి స్మృతివనం పనులు దాదాపు కొలిక్కి వచ్చాయి. సోమన 11 అడుగుల రాతి విగ్రహం ఇప్పటికే నిలబెట్టారు. దీనికి దగ్గరలో కల్యాణమండపాన్ని నిర్మించారు.

* పాలకుర్తి మండలంలోని వల్మిడి గుట్టను తీర్చిదిద్దుతున్నారు. అక్కడ రాళ్లతో రామమందిరాన్ని అద్భుతంగా నిర్మిస్తున్నారు. గుట్టపైకి వాహనాలు వెళ్లేందుకు సీసీ రహదారి ఏర్పాటుచేశారు.

* ఖిలా షాపూర్‌ కోట మరమ్మతులు పూర్తి కావస్తున్నాయి. సర్దార్‌ పాపన్న కట్టించిన ఈ కోట గోడలను రాళ్లతో పునర్నిర్మించారు.

* ఎలుగుబంట్లకు నిలయమైన జఫర్‌గఢ్‌ కోటపైకి వెళ్లేందుకు మెట్లు, సీసీ రహదారిని నిర్మిస్తున్నారు.

* పెంబర్తి వద్ద కాకతీయ స్వాగత తోరణానికి రంగులద్ది ముస్తాబు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని