ఆత్మగౌరవ భవనాలు అభివృద్ధికి వేదికలు

రాష్ట్రంలోని గిరిజనుల అభ్యున్నతికి, సమస్యల పరిష్కారానికి, హక్కుల పరిరక్షణకు గిరిజన, ఆదివాసీ ఆత్మగౌరవ భవనాలు వేదికగా నిలుస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు.

Published : 18 Sep 2022 03:23 IST

ఇక్కడి నుంచి మేధావులు ఆలోచనలు చేయాలి

ఆదివాసి, బంజారా భవనాల ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్‌

బంజారాహిల్స్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని గిరిజనుల అభ్యున్నతికి, సమస్యల పరిష్కారానికి, హక్కుల పరిరక్షణకు గిరిజన, ఆదివాసీ ఆత్మగౌరవ భవనాలు వేదికగా నిలుస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. బంజారాహిల్స్‌లో శనివారం కుమురం భీం ఆదివాసీ, సేవాలాల్‌ బంజారా భవనాలను గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావులతో కలిసి సీఎం ప్రారంభించారు. తొలుత ఆదివాసీ భవనాన్ని ప్రారంభించి, పూజలు నిర్వహించారు. భవనంలో కుమురం భీం విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. అక్కడ నెలకొల్పిన సదుపాయాలు, ఆర్ట్‌ గ్యాలరీని తిలకించారు. అనంతరం సేవాలాల్‌ బంజారా భవనాన్ని ప్రారంభించారు. అక్కడ కూడా పూజలు చేసి, సేవాలాల్‌ మహారాజ్‌కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయా భవనాల్లో ఏర్పాటు చేసిన సభల్లో మాట్లాడారు. ఆదివాసీ భవన్‌లో సంప్రదాయ పద్ధతిలో ‘సందీర్‌కున్‌ రామ్‌ రామ్‌’ అని, బంజారాభవన్‌లో ‘యాడీన్‌ బాపూ రామ్‌రామ్‌’ అని అందరికీ నమస్కారాలు తెలిపారు. సీఎం మాట్లాడుతూ.. ‘దేశంలో ఎక్కడా లేని విధంగా ఆదివాసీ భవన్‌ నిర్మించుకున్నాం. ఈ భవనం కట్టుకోగానే అయిపోలేదు. ఆదివాసీల అభ్యున్నతికి ఇప్పుడిప్పుడే అడుగులు పడుతున్నాయి. ఉన్నత చదువులు, విదేశీవిద్య ఇప్పుడే మొదలయ్యాయి. ఇంకా ఎన్నో సమస్యలున్నాయి.

ఆదివాసీ మేధావులు ఏకమై వాటి పరిష్కారానికి కృషి చేయాలి. వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది. బంజారాహిల్స్‌లో నివసించిన బంజారాలకు గజం స్థలం లేదు. ఇప్పుడు ఇక్కడే బంజారా భవన్‌ నిర్మించాం. దేశంలోని గిరిజన జాతులకు ఈ భవనాలు స్ఫూర్తిగా ఉంటాయి. బంజారాలు ఇక్కడ ఎస్టీలుగా ఉన్నప్పటికీ, మహారాష్ట్రలో బీసీలుగా, ఇంకోచోట ఓసీలుగా ఉన్నారు. అందరికీ సమానహోదా కోసం జాతీయస్థాయిలో పోరాటం చేద్దాం. అడవులు, తండాల్లో బిడ్డలు ఎలా అభివృద్ధి చెందాలన్న విషయమై ఇక్కడి నుంచి ఆలోచనలు చేయాలి. ఈ భవనాలు శుభకార్యాలు నిర్వహించడానికి కాదు. సమస్యల పరిష్కారానికి వేదికలుగా ఉండాలి. రాష్ట్రంలో గిరిజన బిడ్డకు అన్యాయం జరిగితే ఇక్కడి నుంచి పోరాటం జరగాలి’ అని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌ యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీలు కేశవరావు, మాలోత్‌ కవిత, ఎమ్మెల్యేలు సక్రు, దానం నాగేందర్‌, హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టీనా జెడ్‌ చోంగ్తు, అదనపు సంచాలకులు సర్వేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

సీఎం కాన్వాయ్‌ని అడ్డుకునే ప్రయత్నం
ఆదివాసీ, బంజారా భవనాల ప్రారంభ సమయంలో గిరిజన రిజర్వేషన్ల పోరాట సమితి (టీఆర్‌పీఎస్‌) ఆందోళన కార్యక్రమం చేపట్టింది. గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు కల్పించాలని సమితి కార్యకర్తలు ప్లకార్డులు చేతబూని, నినాదాలు చేశారు. సీఎం కాన్వాయ్‌కి అడ్డుతగిలేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు పక్కకు తొలగించారు. ఈ సందర్భంగా నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. టీఆర్‌పీఎస్‌ నాయకులు, కార్యకర్తలు అక్కడే బైఠాయించారు. ఆందోళనకారుల్ని పోలీసులు అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని