Assembly Seats: జమ్మూకశ్మీర్‌లో పెంచారు.. తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు పెంచరు?

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై దాఖలైన రిట్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. అసెంబ్లీ సీట్లు పెంచకపోవడాన్ని సవాల్‌ చేస్తూ పర్యావరణ నిపుణులు ప్రొఫెసర్‌ కె.పురుషోత్తంరెడ్డి దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై సోమవారం

Updated : 20 Sep 2022 09:26 IST

 అసెంబ్లీ సీట్లపై సుప్రీంకోర్టులో పిటిషన్‌

కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి నోటీసులు

ఈనాడు, దిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై దాఖలైన రిట్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. అసెంబ్లీ సీట్లు పెంచకపోవడాన్ని సవాల్‌ చేస్తూ పర్యావరణ నిపుణులు ప్రొఫెసర్‌ కె.పురుషోత్తంరెడ్డి దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై సోమవారం జస్టిస్‌ కేఎం జోసెఫ్‌, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘‘విభజన చట్టంలో పేర్కొన్నారన్న పేరుతో జమ్మూకశ్మీర్‌లోని అసెంబ్లీ సీట్లను 107 నుంచి 114కి (పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న 24 సీట్లు సహా) పెంచిన కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం.. అదే సూత్రాన్ని తెలుగు రాష్ట్రాలకు వర్తింపజేయలేదు. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోని సెక్షన్‌ 26 ప్రకారం ఏపీలో అసెంబ్లీ సీట్లను 175 నుంచి 225కి, తెలంగాణలో 119 నుంచి 153కి పెంచాల్సి ఉంది. 2020 మార్చి 6న ఏర్పాటుచేసిన డీలిమిటేషన్‌ కమిషన్‌లో జమ్మూకశ్మీర్‌ను మాత్రమే చేర్చి ఏపీ, తెలంగాణలను చేర్చకపోవడం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, 19, 21ను విస్మరించడమే. విభజన చట్టం నిబంధనలను అమలు చేసేలా కేంద్రాన్ని ఆదేశించండి’’ అని ధర్మాసనాన్ని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోరారు. పిటిషన్‌లో ప్రతివాదులుగా పేర్కొన్న ఏపీ, తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు, కేంద్ర ఎన్నికల సంఘానికి ధర్మాసనం నోటీసులు జారీచేసింది. ఈ రిట్‌ పిటిషన్‌ను జమ్మూకశ్మీర్‌ నియోజకవర్గాల పిటిషన్‌కు జతచేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని