KTR: ధాన్యం సేకరణనూ ప్రైవేటీకరించేందుకు కేంద్రం కుట్ర

‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్న దాశరథి మాటలను నిజం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్రంలో వ్యవసాయం కొత్తపుంతలు తొక్కుతోంటే.. మోదీ

Updated : 23 Sep 2022 04:04 IST

మంత్రి కేటీఆర్‌ ధ్వజం

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల: ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్న దాశరథి మాటలను నిజం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్రంలో వ్యవసాయం కొత్తపుంతలు తొక్కుతోంటే.. మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతులపై కత్తికడుతోందని మంత్రి కేటీఆర్‌ ధ్వజమెత్తారు. రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘వ్యవసాయాన్ని కార్పొరేట్‌ సంస్థల చేతుల్లో పెట్టే కార్యక్రమానికి కేంద్రం తెరతీసింది. ఇప్పటికే ప్రభుత్వరంగ సంస్థలను విక్రయిస్తుండగా.. కొత్తగా వ్యవసాయం, విద్యుత్తు రంగాలపైనా కత్తికట్టింది. ఎఫ్‌సీఐ ద్వారా రాష్ట్రాల్లో ధాన్యం సేకరించడం వల్ల ఆర్థిక భారం పడుతోందంటూ ఈ విధానాన్నీ ప్రైవేట్‌పరం చేయాలని చూస్తోంది. కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ కార్యదర్శి సుధాంశు పాండే తాజాగా విడుదల చేసిన ప్రకటనే ఇందుకు నిదర్శనం. ధాన్యం సేకరణలో ఐకేపీ, ప్యాక్స్‌లకు పోటీగా ప్రైవేట్‌ వ్యాపారులకు అవకాశం కల్పించబోతున్నారు. విద్యుత్‌ సరఫరా వ్యవస్థలనూ ప్రైవేట్‌కు అప్పగించే కుట్రలకు తెరతీశారు. ప్రైవేట్‌ సంస్థలొస్తే సిరిసిల్ల జిల్లాలోని సెస్‌తోపాటు డిస్కంలలో రోజుకో ధర ఉంటుంది. రాష్ట్రంలో వ్యవసాయంతోపాటు దళితులు, గిరిజనులు, రజకులకు, పౌల్ట్రీ, వస్త్రోత్పత్తి రంగాలకు విద్యుత్‌ రాయితీని అడ్డుకునేందుకే ఇలాంటి విధానాలు తెస్తున్నారు. వ్యవసాయం, విద్యుత్‌ రంగాల బాధ్యతల నుంచి తప్పించుకునేందుకు కేంద్రం పార్లమెంటులో చర్చ లేకుండా.. దొడ్డిదారిన గెజిట్‌లను తీసుకొస్తోంది. కేంద్రం చర్యలను తిప్పికొట్టేందుకు ప్రజలంతా జాగరూకతతో వ్యవహరించాలి’’ అని కేటీఆర్‌ కోరారు.

ఒక్కసారీ మందు, డబ్బులు పంచలేదు..
సిరిసిల్లలో నాలుగు ఎన్నికల్లో పోటీ చేసినా.. ఒక్కసారి కూడా ఓటర్లకు మందు, డబ్బులను పంచలేదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాబోయే ఎన్నికల్లో తనతో పోటీ పడాలనుకునేవారూ ఇలా మంచి పనులు చేసి ప్రజల వద్దకు వెళ్లాలని, ఎవరికి ఓటేయాలో వారే నిర్ణయం తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో గురువారం ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల విద్యార్థులకు ట్యాబ్‌లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. విద్యావ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, ప్రపంచంతో పోటీపడే పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. ‘‘పుట్టినరోజు నాడు కేకులు, బ్యానర్లు, హోర్డింగులు లాంటి ఆర్భాటాలకు డబ్బు ఖర్చు చేయకుండా ప్రజాసేవకు ఉపయోగించాలనే ఆలోచన మూడేళ్ల క్రితం వచ్చింది. అప్పుడు సిరిసిల్ల నియోజకవర్గంలో సొంత ఖర్చుతో ఆరు అంబులెన్సులను అందజేశాను. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలు సుమారు రూ.26 కోట్ల విలువైన 120 అంబులెన్సులను వైద్యారోగ్యశాఖకు అప్పగించారు. మరుసటి ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 1,200 మూడు చక్రాల వాహనాలను అందజేశారు. ఈ ఏడాది రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న 5వేల మందికి ట్యాబ్‌లను ఇస్తున్నాం. ఈ రోజు 890 మందికి పంపిణీ చేస్తున్నాం. మిగిలినవారికి మండలాల వారీగా కళాశాలల్లోనే ఇస్తాం. రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో విద్యాసేవకు ముందుకు రావాలి’’ అని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. అనంతరం కలెక్టరేట్‌లో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని