రూ.10 వేల కోట్లు వారంలో ఇస్తారా?

వానాకాలం (ఖరీఫ్‌) సీజన్‌ ఈ నెలాఖరుతో ముగియబోతున్నా పంటరుణాల పంపిణీ మెరుగుపడలేదు. ఈ సీజన్‌లో రూ.40,718 కోట్లను సాగు రుణాలుగా ఇవ్వాలని నిర్ణయించినా అందులో రూ.10 వేల కోట్లకు పైగా బ్యాంకులు

Updated : 24 Sep 2022 04:29 IST

నెలాఖరుతో ఖరీఫ్‌ ముగింపు
లక్ష్యాన్ని చేరుకోని పంట రుణాలు
ఇవ్వాల్సింది రూ.40 వేల కోట్లు.. ఇచ్చింది రూ.30 వేల కోట్లే

ఈనాడు, హైదరాబాద్‌: వానాకాలం (ఖరీఫ్‌) సీజన్‌ ఈ నెలాఖరుతో ముగియబోతున్నా పంటరుణాల పంపిణీ మెరుగుపడలేదు. ఈ సీజన్‌లో రూ.40,718 కోట్లను సాగు రుణాలుగా ఇవ్వాలని నిర్ణయించినా అందులో రూ.10 వేల కోట్లకు పైగా బ్యాంకులు పంపిణీ చేయలేదు. మరో వారంలో సీజన్‌ ముగుస్తున్నందున ఈ లక్ష్యం నెరవేరడం అనుమానమేనని అధికార వర్గాలు తెలిపాయి. గత ఏడాది వానాకాలంలోనూ రూ.36 వేల కోట్ల లక్ష్యంలో రూ.15 వేల కోట్లు రైతులకు ఇవ్వనేలేదు. ఈ సీజన్‌లో 1.36 కోట్ల ఎకరాల్లో పంటలను సాగు చేసినట్లు వ్యవసాయశాఖ తాజా నివేదికలో వెల్లడించింది. వరి, పత్తి పంటలే 1.14 కోట్ల ఎకరాల్లో వేసినట్లు అంచనా. ఈ పంటలకు ఎకరానికి రూ.35-38 వేల మేర రుణం ఇవ్వాలని ‘రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి’ (ఎస్‌ఎల్‌బీసీ) సీజన్‌కు ముందు ఖరారు చేసింది. కనిష్ఠంగా రూ.35 వేల చొప్పున చూసినా.. ఈ రెండు పంటలకే దాదాపు రూ.40 వేల కోట్లు ఇవ్వాలి. మిగిలిన 22 లక్షల ఎకరాల్లో ఇతర పంటలకు మరో రూ.10 వేల కోట్లు ఇవ్వాలి. ఈ లెక్కన రూ. 50 వేల కోట్ల రుణ వితరణ చేయాల్సి ఉంది. కానీ లక్ష్యమే రూ. 40 వేల కోట్లయితే.. ఇచ్చింది రూ. 30 వేల కోట్లే.

ఎందుకీ పరిస్థితి?

పంట రుణాల పంపిణీ తగ్గడానికి అనేక సాంకేతిక కారణాలున్నాయని బ్యాంకర్లు వ్యవసాయశాఖకు తెలిపారు. ప్రధానంగా ధరణి పోర్టల్‌లో పట్టాదారు పాసుపుస్తకాలు జారీ అయిన రైతుల వివరాలను పరిశీలించి పంటరుణం ఇవ్వాలని ప్రభుత్వం చెబుతోంది. గతంలో ఎన్నడూ పంటరుణం తీసుకోని రైతుకు కొత్తగా ఇవ్వాలంటే ధరణి పోర్టల్‌లో వివరాల నమోదుకు ఎడిట్‌ ఆప్షన్‌ లేదని, దీనివల్ల కొత్త రైతులకు రుణాలివ్వలేకపోతున్నట్లు బ్యాంకర్లు తెలిపారు. గత ఏడాది పంటరుణం తీసుకుని ఈ ఏడాది తిరిగి చెల్లించినవారు కొత్త రుణంగా ‘రెన్యువల్‌’ చేసుకోవచ్చు. కానీ రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న కొందరు రైతులు పాతబాకీ చెల్లించకపోవడంతో రుణం రెన్యువల్‌ కావడంలేదు.

ప్రైవేటు వ్యాపారుల వేధింపులు

బ్యాంకులు రుణాలివ్వకపోవడంతో రైతులు తమ భూములను ప్రైవేటు వ్యాపారులకు తనఖా రిజిస్ట్రేషన్‌ చేయించి.. అధిక వడ్డీలకు అప్పులు తీసుకుంటున్నారు. ఆ బాకీ చెల్లించినా.. తమ భూములను తిరిగి రిజిస్ట్రేషన్‌ చేయకుండా వడ్డీ వ్యాపారులు వేధిస్తున్నారంటూ రైతులు ‘రుణ ఉపశమన కమిషన్‌’ను ఆశ్రయిస్తున్నారని కమిషన్‌ ఛైర్మన్‌ నాగుర్ల వెంకటేశ్వర్లు చెప్పారు. రైతులు ప్రైవేటు అప్పులు తీసుకుంటే వాటిని తీర్చడానికి తప్పనిసరిగా బ్యాంకులు రుణాలివ్వాలని రిజర్వుబ్యాంకు నిబంధన ఉంది. మొత్తం పంటరుణాల లక్ష్యంలో 3 శాతం ఈ పేరుతో ఇవ్వాలనే నిబంధనను బ్యాంకులు పట్టించుకోవడం లేదని కమిషన్‌ విచారణలో తేలింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని