ఉమ్మడి సాగే మేలు

వ్యక్తులుగా కాకుండా.. సంఘాలుగా సంఘటితమైతేనే రైతులకు లాభాల పంట పండుతుందని జాతీయ వ్యవసాయ పరిశోధన, నిర్వహణ సంస్థ (నార్మ్‌) తాజా అధ్యయనంలో పేర్కొంది. ఈమేరకు తెలంగాణలో పత్తి రైతులకు,

Published : 24 Sep 2022 05:13 IST

తెలంగాణలో పత్తి రైతులకు ఇదే ప్రయోజనకరం
తాజా అధ్యయనంలో ‘నార్మ్‌’ వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: వ్యక్తులుగా కాకుండా.. సంఘాలుగా సంఘటితమైతేనే రైతులకు లాభాల పంట పండుతుందని జాతీయ వ్యవసాయ పరిశోధన, నిర్వహణ సంస్థ (నార్మ్‌) తాజా అధ్యయనంలో పేర్కొంది. ఈమేరకు తెలంగాణలో పత్తి రైతులకు, ఆంధ్రప్రదేశ్‌లో మత్స్యకారులకు ఆదాయం పెరగాలంటే ‘రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌పీవో)’గా ఏర్పడాలని సూచించింది. రైతులు ఒంటరిగా పంట పండించి అమ్ముకుంటే గిట్టుబాటు ధర గానీ, లాభాలు గానీ పెద్దగా రావడం లేదని.. ఒక గ్రామంలో ఒకే పంట సాగుచేసే రైతులంతా ఎఫ్‌పీవోగా నమోదు చేసుకుని సాగుచేస్తే ఆదాయం గణనీయంగా పెరుగుతుందని తెలిపింది. ఈమేరకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఈ సంఘాల ఏర్పాటు, ప్రస్తుత పరిస్థితి, వాటి అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై రాజేంద్రనగర్‌లోని ‘నార్మ్‌’ అధ్యయనం చేసి విధానపత్రాన్ని కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. తెలంగాణలో పత్తి రైతులు పెద్దఎత్తున ఎఫ్‌పీవోలుగా ఏర్పాటైతే.. పంటశుద్ధి, నిల్వ, మార్కెటింగ్‌ అవకాశాలు, ఆదాయం పెరుగుతాయని అధ్యయనంలో పేర్కొంది. రాష్ట్రంలో అరకోటి ఎకరాల్లో పత్తి పంటను ఏటా 25లక్షల నుంచి 30 లక్షల మంది రైతులు సాగు చేస్తున్నారు.  వీరి ఆదాయం పెంపునకు ఎఫ్‌పీవోలు తోడ్పడతాయని వెల్లడించింది.

ఎఫ్‌పీవోల ఏర్పాటు ఎలా?: ఒక గ్రామంలో కనీసం 10 నుంచి 500 మంది రైతుల పేర్లను నమోదు చేసి వారందరి భాగస్వామ్యంతో ఎఫ్‌పీవోను ఏర్పాటు చేసి, కంపెనీ చట్టం లేదా సహకార చట్టం కింద రిజిస్టర్‌ చేయించాలి. వీటి ఏర్పాటును నాబార్డు ప్రోత్సహిస్తోంది. 2020-23 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 10 వేల సంఘాలను కొత్తగా రైతులతో ఏర్పాటు చేయించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. గత మే ఆఖరు నాటికి తెలంగాణలో 56, ఏపీలో 33 ఎఫ్‌పీవోలు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 149 సంఘాలు ఏర్పడగా కర్ణాటక (126), మహారాష్ట్ర (105) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఎఫ్‌పీవోలుగా ఏర్పడటంతో అనేక ప్రయోజనాలున్నాయి. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను నేరుగా కంపెనీల నుంచే కొని తెచ్చుకునే వీలుంటుంది. దీనివల్ల రిటైల్‌ దుకాణాల కంటే తక్కువ ధరకే అవి లభిస్తాయి. పొలం దుక్కులకు అవసరమైన ట్రాక్టర్లు, కలుపుతీత, కోత యంత్రాలు వంటివాటిని సైతం వ్యవసాయశాఖ నుంచి రాయితీపై కొనుగోలు చేసుకుని, యంత్రాల సేవా కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. వీటిని రైతులు తక్కువ అద్దెకు తీసుకుని సాగు పనులు చేపడితే వ్యయం గణనీయంగా తగ్గుతుందని అధ్యయనంలో తేలింది.

జాతీయ బోర్డు ఏర్పాటుకు సిఫార్సు

ఎఫ్‌పీవోలను దేశవ్యాప్తంగా ప్రోత్సహించేందుకు వీటి కోసం ప్రత్యేకంగా జాతీయ ఎఫ్‌పీవో బోర్డును ఏర్పాటు చేయాలని కేంద్రానికి సిఫార్సు చేసినట్లు నార్మ్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ శ్రీనివాసరావు తెలిపారు. ఇవి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఒకసారి గ్రాంటుగా కొంత సొమ్మును ఇవ్వాలని సూచించినట్లు వెల్లడించారు. తక్కువ వడ్డీకి రుణాలిచ్చేందుకు ప్రత్యేక నిధి ఏర్పాటు, పంటల శుద్ధి, నిల్వ, మార్కెటింగ్‌కు జిల్లాస్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన, ఈ సంఘాల ఆదాయ, వ్యయాలపై ఎప్పటికప్పుడు ఆడిటింగ్‌ సదుపాయం కల్పించడం తదితర చర్యలకు కూడా సిఫార్సు చేసినట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని