ధరణి చుట్టూ అక్రమాలు

రెండు నెలల క్రితం నాగర్‌కర్నూల్‌ జిల్లా కోడేరుకు చెందిన ఓ భూ యజమాని సిమ్‌ కార్డును బ్లాక్‌చేయించి.. కొత్త సిమ్‌ తీసుకుని ఆయన బంధువు 11.17 ఎకరాలను కాజేశారు. లావాదేవీల సందర్భంగా భూ యజమాని హాజరుకాకున్నా రెవెన్యూ సిబ్బంది

Published : 24 Sep 2022 05:13 IST

సాంకేతికత ఆధారంగా చక్రం తిప్పుతున్న దళారులు  
దర్జాగా కొన్నిచోట్ల మోసాలకు తెరతీస్తున్న రెవెన్యూ సిబ్బంది  
ప్రభుత్వం అప్రమత్తమవ్వాలంటున్న బాధితులు
ఈనాడు - హైదరాబాద్‌

రెండు నెలల క్రితం నాగర్‌కర్నూల్‌ జిల్లా కోడేరుకు చెందిన ఓ భూ యజమాని సిమ్‌ కార్డును బ్లాక్‌చేయించి.. కొత్త సిమ్‌ తీసుకుని ఆయన బంధువు 11.17 ఎకరాలను కాజేశారు. లావాదేవీల సందర్భంగా భూ యజమాని హాజరుకాకున్నా రెవెన్యూ సిబ్బంది గుడ్డిగా రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ను  చేశారు. బాధితుడికి రైతుబంధు సాయం అందకపోవడంతో ధరణిలో పరిశీలించుకోగా అక్రమం వెలుగుచూసింది.

కకాలంలో రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ పూర్తి కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ధరణి విధానాన్ని అమల్లోకి తెచ్చింది. భూ యజమాని ఆధార్‌కార్డు, పాస్‌పోర్టు ఫొటో, సంతకం, సెల్‌ఫోన్‌ ఓటీపీ.. ఇవన్నీ ఉంటే ధరణి పోర్టల్లో సులువుగా యాజమాన్య హక్కుల మార్పిడి సాధ్యమవుతుంది. వీటినే తమ ఆయుధాలుగా చేసుకొని సాంకేతికత సహాయంతో కొందరు దళారులు రెవెన్యూ సిబ్బందితో కుమ్మక్కై అక్రమాలు చేస్తున్నారు. నకిలీ పత్రాలు, సిమ్‌కార్డులతో భూ యాజమాన్య హక్కులను దర్జాగా బదలాయించుకుంటున్నారు. ఇప్పటికే ఇలాంటి సంఘటనలు కొన్ని వెలుగుచూశాయి. భూ యజమాని తన దస్త్రాన్ని ధరణిలో పరిశీలించుకొనే వరకు జరిగిన మోసం బయటపడటం లేదు. ఉన్నతాధికారులు ఈ లోపాలపై  దృష్టిసారించకపోతే మరిన్ని అక్రమాలు జరిగే అవకాశం ఉందని బాధితులు అంటున్నారు. మీ సేవా కేంద్రాల ద్వారా స్లాట్‌ నమోదు చేసుకున్నాక వచ్చే గడువును బట్టి తహసీల్దారు- సంయుక్త సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ప్రక్రియ జరుగుతోంది. రిజిస్ట్రేషన్‌ లావాదేవీలకు సంబంధించిన ఇరువర్గాలు, సాక్షులు హాజరవుతున్నారు.ధరణిలో నమోదుకు తహసీల్దారు, ధరణి ఆపరేటర్‌ వేలిముద్ర (బయోమెట్రిక్‌) వేయాల్సి ఉంటుంది. ఇంత పకడ్బందీ వ్యవస్థ ఉండగా హక్కులు సులువుగా ఇతరుల పేర్లపైకి మారడం చర్చనీయాంశంగా మారింది. కొన్ని మీసేవా కేంద్రాల ద్వారా దళారీలు చక్రం తిప్పుతుండటం ఒక కారణమైతే, కొన్నిచోట్ల రెవెన్యూ సిబ్బంది కూడా అక్రమంలో పాలుపంచుకోవడం మరో కారణం. కాకపోతే వారి పాత్రలు తెరపైకి రావడం లేదు.  

అవకతవకలు జరిగాయి ఇలా...

సంగారెడ్డి జిల్లా రాయికోడ్‌ మండల నాగన్‌పల్లి వాసి శివమ్మకు చెందిన 27.34 ఎకరాల భూమి.. ఈ నెల 19న తనకు తెలియకుండానే ఆమె సోదరి పేరుపైకి మార్పిడి అయింది. గతేడాది ఏప్రిల్‌లో ఆమె భర్త మరణించగా ఫౌతి కింద ఆ భూమి శివమ్మ పేరుపైకి వచ్చింది. తాజాగా ఆమె కూడా మరణించిందని చెప్పి.. భర్త మరణ ధ్రువీకరణ పత్రాన్ని మాత్రమే జత చేసి భూమిని అక్రమంగా మార్పిడి చేశారు.

వికారాబాద్‌ జిల్లా ధారూర్‌ మండల కేంద్రంలోని సర్వేనంబరు 80లో 22 గుంటల భూ యజమాని మరణించారని, వారసుడ్ని తానేనంటూ ఓ వ్యక్తి దరఖాస్తు చేసుకోగా విరాసత్‌ మార్పిడి (12.12.2021) జరిగిపోయింది. తీరా యజమాని గుర్తించిన తరువాత తహసీల్దారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గతేడాది వికారాబాద్‌ పరిధిలో రూ.3.5 కోట్ల విలువైన 7 ఎకరాల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వ్యవహారంలో తహసీల్దార్‌ కార్యాలయంలోని ముగ్గురు సిబ్బందిని జైలుకు పంపించారు. .

క్షేత్రస్థాయి విచారణ లేకపోవడమే..

భూ దస్త్రాల నిర్వహణలో చోటుచేసుకుంటున్న అవినీతిని రూపుమాపేందుకు ప్రభుత్వం ధరణి వ్యవస్థను తీసుకొచ్చింది. ఆలోచన బాగున్నా.. ప్రస్తుతం జరుగుతున్న లావాదేవీల్లో ఎక్కడా క్షేత్రస్థాయి విచారణ అనేది లేదు. దీనివల్ల అక్రమాలకు ఆస్కారం ఏర్పడుతోందన్న అభిప్రాయం ఉంది. కోర్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థ తరహాలో భూమి మార్పిడి జరిగితే సెల్‌ఫోన్‌కు సందేశం వస్తుందని చెబుతున్నా.. అది జరగడం లేదని బాధితులంటున్నారు. కనీసం, భూ యాజమాన్య హక్కులు మార్పిడి జరిగేటప్పుడో.. జరిగిన తరువాతో గ్రామ పంచాయతీలో ఒక నోటీసు అంటిస్తే అందరికీ అవగాహన ఉంటుందన్న సూచనలు వస్తున్నాయి. అక్రమంతోనో.. పొరపాటుగానో.. యాజమాన్య హక్కులు ఒక్కసారి బదిలీ అయితే తిరిగి మళ్లీ పాత యజమాని పేరుపైకి మార్చడం సాధ్యం కావడం లేదు. దీనికోసం, మరోసారి స్లాటు నమోదు చేసుకుని రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ చేయాల్సి వస్తోంది. ఫలితంగా లింకు డాక్యుమెంటేషన్‌ ఆధారాలు దెబ్బతినే ప్రమాదం ఉందని భూ యజమానులు చెబుతున్నారు. దీనికోసం ప్రభుత్వం ఒక విధానాన్ని తేవాలని సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని