న్యాయవ్యవస్థ పునర్నిర్మాణానికి నా వంతు కృషి చేశా

న్యాయవ్యవస్థ పునర్నిర్మాణం కోసం సాధ్యమైనంత కృషి చేశానని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ తెలిపారు. అక్కినేని నాగేశ్వరరావు 99వ జయంతి సందర్భంగా రసమయి ఆధ్వర్యంలో శుక్రవారం

Published : 24 Sep 2022 05:13 IST

సినిమారంగంలో మార్పు అవసరం.. సినీపెద్దలు గమనించాలి
పొరుగు భాషా కవులకున్న ఆదరణ తెలుగువారికి లేదు
సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ

ఈనాడు, హైదరాబాద్‌: న్యాయవ్యవస్థ పునర్నిర్మాణం కోసం సాధ్యమైనంత కృషి చేశానని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ తెలిపారు. అక్కినేని నాగేశ్వరరావు 99వ జయంతి సందర్భంగా రసమయి ఆధ్వర్యంలో శుక్రవారం తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్‌ ఆడిటోరియంలో జస్టిస్‌ రమణకు ‘రసమయి- డా. అక్కినేని జీవిత సాఫల్య పురస్కారం’ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్లెటూరి నుంచి దిల్లీకి వెళ్లి జీవితంలో నేర్చుకున్న పాఠాలు, గుణపాఠాలతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 16 నెలల కాలంలో చేయదగిన కార్యక్రమాలన్నీ చేశానని పేర్కొన్నారు. కానీ అనుకున్నవన్నీ సాధ్యపడలేదన్నారు. 75 సంవత్సరాల స్వాతంత్య్రం తర్వాత న్యాయవ్యవస్థలో సమూలమైన మార్పులు రావాలని ఆకాంక్షించానన్నారు. తెలుగు ప్రజల ఆశీస్సులతో ఈ స్థాయికి చేరుకుని వారి గౌరవాన్ని నిలబెట్టగలిగానన్నారు. న్యాయమూర్తుల నియామకం, సౌకర్యాల కల్పన, న్యాయవ్యవస్థ ఆధునికీకరణ జరిగి ప్రజలకు సత్వర న్యాయం చేకూరాలన్నారు. ప్రజలు న్యాయస్థానాలంటే భయపడే స్థితి గతంలో ఉండేదని.. ఇప్పుడు సమస్య వస్తే ధైర్యంగా కోర్టులను ఆశ్రయిస్తున్నారని అన్నారు.  

మానవత్వంతో ఎదిగిన అక్కినేని

పొరుగు భాషా కవులు పొందుతున్న గౌరవం తెలుగు కవులకు దక్కడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏఎన్నార్‌ గురించి మాట్లాడుతూ.. పెద్దపెద్ద డిగ్రీలు, సంపద లేకున్నా మానవత్వంతో ఎదిగిన మనిషి అని కొనియాడారు. న్యాయమూర్తి కాకముందే తనకు ఏఎన్నార్‌తో పరిచయం ఉందని, ఎన్నో వేదికలు పంచుకుని మాట్లాడుకునేవాళ్లమని, అక్కినేని తన అనుభవాలను చెబుతుంటే సంతోషంగా ఉండేదని గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ తెలుగువారైనందుకు గర్వంగా ఉందన్నారు.ఎన్టీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యంతో 1982లో సినిమా రంగంపై కొంచెం పరిజ్ఞానం ఏర్పడిందని తెలిపారు. పాత సినిమాల మాదిరిగా ఇప్పటి సినిమాలు లేవన్నారు. సాంకేతికత, సదుపాయాలు పెరిగినా నాణ్యత కొరవడిందని దీన్ని సినీపెద్దలు గ్రహించాలన్నారు. రసమయి సంస్థతో తనకు 1983 నుంచి అనుబంధం ఉందంటూ.. అప్పట్లో జరిగిన పుస్తకావిష్కరణలు, సాంస్కృతిక కార్యక్రమాల జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అక్కినేని జీవన సాఫల్య పురస్కారం అందుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. మాజీ ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి తనకు ఎంతో ఆప్తుడని, తాను జడ్జి అయిన తర్వాత.. శివుని అనుగ్రహం పొందేలా ఆయన తనకు బహూకరించిన సాలగ్రామం ఇప్పటికీ పూజగదిలో ఉందన్నారు. తనకు అన్నం పెట్టి పోషించిన గురువు అయ్యపురెడ్డి దగ్గరికి సుబ్బరామిరెడ్డి వచ్చే క్రమంలో పరిచయం ఏర్పడిందన్నారు. తమిళనాడు మాజీ గవర్నర్‌ రామ్మోహన్‌రావు నిర్మొహమాటంగా మాట్లాడే వ్యక్తి అని.. ఆయన నుంచి తాను ప్రశంసలు అందుకోవడం సంతోషంగా ఉందని జస్టిస్‌ రమణ అన్నారు. కార్యక్రమానికి హాజరైన ప్రముఖులతోపాటు అక్కినేని కుటుంబ సభ్యులతో అనుబంధాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. తమిళనాడు మాజీ గవర్నర్‌ పి.ఎస్‌.రామ్మోహన్‌రావు మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్‌వీ రమణ కొద్దికాలమే పనిచేసినా న్యాయవ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని, న్యాయమూర్తుల నియామకం, ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ ఏర్పాటులో కీలకపాత్ర పోషించారని ప్రశంసించారు. శాంతాబయోటెక్‌ వ్యవస్థాపకులు డా.వరప్రసాద్‌రెడ్డి, మాజీ ఎంపీలు సుబ్బరామిరెడ్డి, మురళీమోహన్‌, ఆదాయపుపన్ను శాఖ విశ్రాంత చీఫ్‌ కమిషనర్‌ ఎం.నర్సింహప్ప, ఏఎన్నార్‌ మనుమరాలు, అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్వాహకురాలు సుప్రియ తదితరులు మాట్లాడారు. సినీ రచయిత, ఎంపీ విజయేంద్రప్రసాద్‌, ఎస్వీ యూనివర్సిటీ మాజీ ఉపకులపతి కొలకలూరి ఇనాక్‌, అక్కినేని కుమార్తె నాగసుశీల తదితరులు పాల్గొన్నారు.


జస్టిస్‌ ఎన్‌వీ రమణకు ఘనస్వాగతం
పదవీ విరమణ తరువాత తొలిసారిగా నగరానికి

ఈనాడు, హైదరాబాద్‌: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించి ఇటీవలే పదవీ విరమణ చేసిన జస్టిస్‌ ఎన్‌వీ రమణకు హైదరాబాద్‌లో శుక్రవారం అపూర్వ స్వాగతం లభించింది. పదవీ విరమణ తర్వాత తొలిసారిగా ఆయన నగరానికొచ్చారు. ఆయన సతీమణి శివమాలతో కలిసి దిల్లీ నుంచి ఉదయం 9.27 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ కన్నెగంటి లలిత, జస్టిస్‌ డి.నాగార్జున స్వాగతం పలికారు. అనంతరం వీఐపీ లాంజ్‌లో హైకోర్టు సీజే జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ లలిత, జస్టిస్‌ సుమలత, జస్టిస్‌ ఎం.లక్ష్మణ్‌, జస్టిస్‌ సాంబశివనాయుడు, జస్టిస్‌ నాగార్జున, జస్టిస్‌ విజయభాస్కర్‌ రెడ్డి, జస్టిస్‌ ఇ.వి.వేణుగోపాల్‌, జస్టిస్‌ నగేశ్‌, జస్టిస్‌ కార్తీక్‌, జస్టిస్‌ కె.శరత్‌, హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ కె.సుజన, బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు అశోక్‌గౌడ్‌, ప్రభుత్వ విప్‌ అరెకపూడి గాంధీ, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు, జస్టిస్‌ ఎన్‌వీ రమణ వియ్యంకుడు రమేశ్‌, ఏపీ మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. న్యాయమూర్తులతో కాసేపు ముచ్చటించాక జస్టిస్‌ రమణ బయటికి వచ్చారు. అప్పటికే పెద్దసంఖ్యలో సన్నిహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులు అక్కడికి చేరుకున్నారు. స్వాగత బ్యానర్లు ప్రదర్శిస్తూ పుష్పగుచ్ఛాలతో జస్టిస్‌ రమణ దంపతులకు ఆహ్వానం పలికారు.

పూలవర్షం మధ్య నివాస గృహంలోకి..

బంధుమిత్రులు, అభిమానులకు అభివాదం చేస్తూ జస్టిస్‌ ఎన్‌వీ రమణ నగరానికి బయల్దేరారు. విమానాశ్రయం నుంచి ఎస్‌ఆర్‌నగర్‌లోని ఆయన నివాసం వరకు అభిమానులు వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇంటివద్ద కాలనీవాసులు, బంధువులు ఘనంగా స్వాగతించి శుభాకాంక్షలు తెలిపారు. ఇంటికి చేరుకోగానే పూలవర్షం కురిపిస్తూ ఆయనకు ఆహ్వానం పలికారు. అనంతరం అభిమానులతో కలిసి జస్టిస్‌ రమణ కేకును కోశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని