తెలంగాణకు కేంద్రం పూర్తి సహకారం

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అన్నివిధాలా సహకారం అందిస్తుందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ బ్రాండ్‌ను కాపాడుకునేలా అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ఇది మిగులు బడ్జెట్‌ ఉన్న

Published : 24 Sep 2022 05:12 IST

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
అక్కన్నపేట - మెదక్‌ రైలు మార్గం జాతికి అంకితం

ఈనాడు, మెదక్‌: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అన్నివిధాలా సహకారం అందిస్తుందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ బ్రాండ్‌ను కాపాడుకునేలా అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ఇది మిగులు బడ్జెట్‌ ఉన్న రాష్ట్రమని, దీన్ని మరింతగా అభివృద్ధి చేసుకోవాలన్నారు. అక్కన్నపేట- మెదక్‌ నూతన రైలుమార్గాన్ని శుక్రవారం ఆయన జాతికి అంకితం చేశారు. మెదక్‌- కాచిగూడ ప్యాసింజర్‌ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైల్వే నెట్‌వర్క్‌ విస్తరణకు ఈ ఎనిమిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం 15 ప్రాజెక్టులకు రూ.9,494 కోట్లు ఖర్చు చేసిందన్నారు. అందులో భాగంగానే అక్కన్నపేట- మెదక్‌ రైలు మార్గాన్ని పూర్తిచేశామన్నారు. దీన్ని సికింద్రాబాద్‌- ముంబయి మార్గానికి కలపడంతో మెదక్‌ ప్రాంతానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. తెలంగాణలో రికార్డుస్థాయిలో 298 కిలోమీటర్ల కొత్త మార్గాన్ని నిర్మించామన్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను వచ్చే ఏడాది డిసెంబరులోగా అందుబాటులోకి తెస్తామని వివరించారు. భూసేకరణలో ఆలస్యమవుతోందని, త్వరలోనే వరంగల్‌లో రూ.400 కోట్లతో ఓవర్‌హాలింగ్‌ ప్రాజెక్టుకు భూమిపూజ చేస్తామన్నారు. దీనివల్ల మూడువేలమందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ను రూ.653 కోట్లతో ఆధునికీకరిస్తామని, పనులు అక్టోబరులో మొదలవుతాయన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ... ఏ రాష్ట్ర ప్రభుత్వమూ రైల్వే మార్గం కోసం 50 శాతం నిధులు ఇవ్వదని, తెలంగాణ ప్రభుత్వం మాత్రం సగం నిధులను అందించిందన్నారు. మెదక్‌ నుంచి జోగిపేట, సంగారెడ్డిల మీదుగా ఈదులనాగులపల్లి వరకు కొత్త రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. దక్షిణమధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ తాము చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్‌రెడ్డి, రఘునందన్‌రావు, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పోటాపోటీ నినాదాలు: రైలుమార్గాన్ని జాతికి అంకితమిచ్చే సందర్భంగా తెరాస, భాజపా కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేశారు. జై కేసీఆర్‌, జై తెలంగాణ నినాదాలతో తెరాస కార్యకర్తలు... జై మోదీ, భారత్‌మాతాకీ జై నినాదాలతో భాజపా కార్యకర్తలు హోరెత్తించారు. ఎమ్మెల్యేలు రఘునందన్‌రావు, పద్మా దేవేందర్‌రెడ్డికలగజేసుకొని వారిని శాంతింపజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని