మాజీ ఎమ్మెల్యే కుమారుడు దౌర్జన్యం చేస్తున్నారు

అనంతపురం జిల్లా ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి కుమారుడు ప్రణయ్‌రెడ్డి తన అనుచరులతో దౌర్జన్యం చేయిస్తున్నారని రెన్యూ పవర్‌ సంస్థ భద్రతావిభాగం అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతపురం

Updated : 24 Sep 2022 06:38 IST

అనంతపురం ఎస్పీకి రెన్యూ పవర్‌ సంస్థ భద్రతా అధికారి ఫిర్యాదు

ఈనాడు డిజిటల్‌-అనంతపురం: అనంతపురం జిల్లా ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి కుమారుడు ప్రణయ్‌రెడ్డి తన అనుచరులతో దౌర్జన్యం చేయిస్తున్నారని రెన్యూ పవర్‌ సంస్థ భద్రతావిభాగం అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్పకు గురువారం ఫిర్యాదుచేయగా.. ఆ విషయం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఆ సంస్థ భద్రతా అధికారి శ్రీనివాసులు ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో ‘మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి కుమారుడు ప్రణయ్‌రెడ్డి అనుచరులు బెల్లంకొండ నర్సింహులు, బి.శివానంద్‌, ఉల్లిగప్ప, వెంకటేశ్‌తో పాటు కొందరు ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు నింబగల్లులోని మా సంస్థ ఆవరణలోకి చొచ్చుకుని వచ్చారు. కంటెయినర్లలో పనిచేసుకుంటున్న సిబ్బందిని బలవంతంగా బయటకు పంపించి వాటికి తాళాలు వేశారు. విండ్‌ టర్బైన్లు అన్నింటినీ ఆపేశారు. దీంతోపాటు సబ్‌స్టేషన్‌ వద్ద కొంతమంది వ్యక్తులు గుంపులుగా వచ్చి సామగ్రిని ధ్వంసం చేశారు. రాళ్లతో దాడిచేయడంతో సిబ్బందికి గాయాలయ్యాయి. కొంతమంది సిబ్బందిని ఉరవకొండకు తరలించాం. ప్రణయ్‌రెడ్డి అనుచరులు సిబ్బంది కొంతమందిని బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. దీంతో ఉద్యోగుల్లో భయం మొదలైంది. విద్యుత్తు ఉత్పత్తిని నిలిపివేశారు. సంస్థలపై దౌర్జన్యాలు, భౌతిక దాడులు ఏపీలో భవిష్యత్తు పెట్టుబడులను ప్రభావితం చేస్తాయి. రాష్ట్రానికి పరిశ్రమలు తెప్పించి ఉపాధి అవకాశాలను పెంచాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పనిచేస్తుంటే, స్థానిక నాయకుల తీరు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది’ అని పేర్కొన్నారు. దీనిపై వెంటనే స్పందించి తమ కంపెనీ ఆస్తులకు, ఉద్యోగులకు రక్షణ కల్పించాలని ఎస్పీని కోరారు. దీనిపై ఉరవకొండ పట్టణ సీఐ హరినాథ్‌ను వివరణ కోరగా.. ఎయిర్‌బ్యాగ్స్‌ సరిగా లేవనే కారణంతో అద్దెకు తీసుకున్న వాహనాన్ని రెన్యూ పవర్‌ సంస్థ ఉద్యోగులు తిరస్కరించడంతో వివాదం చోటుచేసుకుందన్నారు.  ఇరువర్గాలను పిలిపించి రాజీ చేసినట్లు తెలిపారు.

ఉరవకొండ, వజ్రకరూరు, విడపనకల్లు, బెళుగుప్ప, కూడేరు మండలాల పరిధిలో పలు పవనవిద్యుత్తు సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వైకాపా నాయకులు వాహనాలను అద్దెకు ఇచ్చి ప్రతినెలా ఆదాయం పొందుతున్నారు. కొన్ని వాహనాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ఇటీవల తొలగించారు. స్థానిక నాయకుల సిఫారసులకు ప్రాధాన్యం ఇవ్వట్లేదనే కోపంతో దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని